
విశాఖపట్నంలో దారుణం జరిగింది. చినగదిలి రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకు గురయ్యారు. ఆయన నివాసం వద్దే గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. కొమ్మాదిలోని రమణయ్య నివసించే అపార్ట్‌మెంట్ వద్దకు చేరుకున్న దుండగులు ఇనుప రాడ్డుతో ఆయన తలపై దాడిచేశారు. దీంతో రమణయ్య అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్లినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ కమిషనర్ రవిశంకర్ డాగ్ స్క్వాడ్ , క్లూస్ టీమ్ లతో పరిశీలన చేస్తున్నారు. ల్యాండ్ ఇష్యూకు సంబంధించి గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా నందిగామ మండలం దిమ్మిలాడ గ్రామానికి చెందిన రమణయ్య.. గత పదేళ్లుగా తహసీల్దార్ గా పనిచేస్తున్నాడు. రమణయ్య ఇటీవలే విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందింతులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తు్న్నారు.