జైపూర్ మండల కేంద్రంలో హార్టికల్చర్ నర్సరీ భూమి కబ్జాకు యత్నం

 జైపూర్ మండల కేంద్రంలో హార్టికల్చర్ నర్సరీ భూమి కబ్జాకు యత్నం
  • గేటు వేసి ఉండగానే లోపలికి చొరబడి భూమి చదును
  • అడ్డుకున్న తహసీల్దార్ వనజారెడ్డి

జైపూర్, వెలుగు: జైపూర్ మండల కేంద్రంలో 50 ఏండ్లుగా కొనసాతుతున్న హార్టికల్చర్ నర్సరీ భూమిని కబ్జా చేసేందుకు కొందరు  ప్రయత్నిం చారు. జేసీబీ, ట్రాక్టర్లతో చదును చేస్తుండగా తహసీల్దార్ ఆ పనులను అడ్డుకున్నారు. తహసీల్దార్ వనజారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి తనకు జైపూర్ శివారులోని సర్వే నంబర్ 94లో 8 ఎకరాల పట్టా భూమి ఉందని పేర్కొంటూ హార్టికల్చర్ నర్సరీ గేటుకు తాళం వేసి ఉండగానే అధికారులకు సమాచారం లేకుండా కొందరితో కలిసి ఫెన్సింగ్​వద్ద దారి చేసుకొని లోపలికి చొరబడ్డారు.

జేసీబీ, ట్రాక్టర్లతో భూమి చదును చేస్తుండగా సమాచారం అందుకున్న తహసీల్దార్ అక్కడికి చేరుకొని పనులను అడ్డుకున్నారు. ప్రభుత్వం హార్టికల్చర్ నర్సరీకి కేటాయించిన భూమి రికార్డులను పరిశీలించి, హద్దులు వేసేంత వరకు అక్కడ ఎలాంటి పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. తహసీల్దార్ ఆఫీస్​లోనే పనిచేసి రిటైర్డ్ వీఆర్వో, మరికొందరు ప్రముఖులు కలిసి నర్సరీ భూమిని పట్టా చేయించుకుని కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొని ఆ భూమిని కాజేయాలని ప్రయత్నిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నర్సరీని కాపాడాలని కోరుతున్నారు.