
- సీజన్ ప్రారంభంలో రూ. 19 వేలు.. ఇప్పుడు రూ.13,350
- కూలీల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్న రైతులు
- కోల్డ్ స్టోరేజీల్లోకి మిర్చి బస్తాలు
ఖమ్మం, వెలుగు : తేజ రకం మిర్చి ధర రోజురోజుకూ పతనమవుతోంది. ఖమ్మం మార్కెట్‌లో ఈ సీజన్‌లో అత్యంత తక్కువగా సోమవారం జెండా పాట రూ.13,350గా నమోదైంది. సీజన్ ప్రారంభంలో కొత్త మిర్చి వచ్చిన టైంలో క్వింటాల్‌కు రూ.19 వేలు పలుకగా.. తర్వాత రేటు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఒక్క నెలలోనే క్వింటాల్‌కు రూ.2500 వరకు రేటు పడిపోయింది. దీంతో వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి, కూలీలు, రవాణా ఖర్చులు భరించి మార్కెట్‌కు పంటను తీసుకొస్తే కనీస ధర కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రస్తుతం ఇస్తున్న రేటుకు కూలీల ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ. 6 వేల నుంచి రూ. 11,500 మధ్యే...
ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్‌కు సోమవారం సుమారు 60 వేల బస్తాల మిర్చి రాగా.. ఇందులో 55 వేలకు పైగా బస్తాలను రూ.12 వేల లోపు ధరకే వ్యాపారులు కొనుగోలు చేశారు. ఎక్కువ లాట్లను రూ.6 వేల నుంచి రూ.11,500 వరకే కొన్నారు. మిర్చి క్వాలిటీ ఆధారంగా రేటు తగ్గుతుందని ట్రేడర్లు, వ్యాపారులు చెబుతుండగా.. రైతులు మాత్రం తమకు గిట్టుబాటు కావడం లేదని వాపోతున్నారు. అయితే విదేశాలకు ఎగుమతులు జరగకపోవడం వల్ల మిర్చికి డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నారు. చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలకు ఎగుమతులు జరిగిన సమయంలో క్వింటాల్‌కు రూ.25 వేల వరకు పలికిందని, ప్రస్తుతం ఎగుమతులు తగ్గిపోవడంతో రేటు తగ్గిందని అంటున్నారు.
కోల్డ్ స్టోరేజీలకు తరలింపు
మిర్చి రేటు రోజురోజుకు పడిపోవడమే తప్ప పెరగకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు. డబ్బులు అత్యవసరం ఉన్న వారు మాత్రం వచ్చిన రేటుకు పంటను అమ్ముకుంటుండగా, భవిష్యత్‌లోనైనా మంచి రేటు రాకపోతుందా అని ఆలోచిస్తున్న వారు మాత్రం తమ పంటను కోల్డ్ స్టోరేజీల్లో భద్రపరుచుకుంటున్నారు. పంట సీజన్పూర్తైన తర్వాత డిమాండ్ వస్తుందన్న ఆశతో ఉంటున్నారు. ఖమ్మం జిల్లాలో 2.20 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం గల 48 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి.
మూడేండ్ల కింద ఖమ్మం మార్కెట్‌లో మిర్చి పాతిక వేలను తాకింది. ఆ తర్వాత క్రమంగా ధర తగ్గుతూ వచ్చింది. గతేడాది కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండడంతో ఎక్కువ మంది వ్యాపారులు రైతుల నుంచి తక్కువ రేటుకు మిర్చిని కొని కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేశారు. మళ్లీ రూ.25 వేలకు పెరగకపోతుందా అన్న ఆశతో క్వింటాల్ మిర్చిని రూ.16 వేల నుంచి రూ.18 వేలకు కొని ఏసీలో పెట్టారు. కానీ ఈ సీజన్ ప్రారంభంలో మళ్లీ రూ.19 వేల నుంచే రేటు మొదలై క్రమంగా తగ్గుతూ వస్తోంది.
దీంతో ఎక్కువ మంది వ్యాపారులు, రైతులు నష్టపోయారు. అయినా ఇప్పుడు కూడా అన్‌సీజన్‌లో రేటు పెరుగుతుందన్న ఆలోచనతో కోల్డ్ స్టోరేజీలకు తరలిస్తున్నారు. అక్కడ దాచుకున్న పంటను గ్యారంటీగా పెట్టి ‘రైతు బంధు’ కింద బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. మరోవైపు మార్కెటింగ్ శాఖ ఆఫీసర్లు కూడా రైతులకు ఇదే విషయాన్ని చెబుతున్నారు. తక్కువ రేటుకు అమ్ముకోకుండా, అవసరమైతే పంటను దాచుకోవాలని సూచిస్తున్నారు.
వ్యవసాయ కూలీగానే బాగుంది
మిర్చి రేటు ఈ రకంగా తగ్గితే వ్యవసాయం కంటే కూలీగా పని చేయడమే మంచిది అనిపిస్తోంది. ఎకరానికి రూ. 16 వేలు కౌలు చెల్లించి రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేశాను. 13 క్వింటాళ్ల దిగుబడి రావడంతో మార్కెట్‌కు తీసుకొస్తే కాయ పచ్చిగుందని చెప్పిన్రు. నన్ను కనీసం మాట్లాడనీయకుండా నా పంటకు క్వింటాల్‌కు రూ. 8 వేలు ఇస్తామన్నారు. 170 మంది కూలీలకు రూ. 350 చొప్పున ఇచ్చి పని చేయించిన. మిర్చిని మార్కెట్‌కు తీసుకొచ్చేందుకురూ. 7 వేల కిరాయి అయింది. క్వింటాల్‌కు కనీసం రూ. 20 వేలు ఇచ్చినా ఖర్చులకే సరిపోతాయి. - గన్నెబోయిన శంకర్, మైలాపురం, నల్గొండ జిల్లా
పెట్టుబడి అయినా వస్తే చాలు
నేను రెండు ఎకరాల్లో మిరప సాగు చేశాను. 19 బస్తాల దిగుబడి వచ్చింది. దానిని తీసుకొని మార్కెట్‌కు వస్తే క్వింటాల్‌కు రూ. 12 వేలు మాత్రమే ఇస్తాంటున్నారు. 42 మంది కూలీలతో పని చేయించి ఒక్కో కూలీకి రూ.350 చొప్పున ఇచ్చాను. రెండు ఎకరాలకు మొత్తం రూ. 1.80 లక్షల ఖర్చు అయింది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. మా పెట్టుబడి, కష్టాన్ని చూసి ప్రభుత్వమే రేటు నిర్ణయించాలి.- లకావత్ శుక్లా, మానాపురం, తుంగతుర్తి మండలం, సూర్యాపేట జిల్లా