నెదర్లాండ్స్ క్రికెట్ టీమ్లో బెజవాడ కుర్రాడు

నెదర్లాండ్స్  క్రికెట్ టీమ్లో  బెజవాడ కుర్రాడు

వన్డే వరల్డ్ కప్ సమరం కొనసాగుతోంది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరిగిన ఆరంభం మ్యాచులో భారతీయ ప్లేయర్ అదరగొట్టాడు. అజేయ సెంచరీతో న్యూజిలాండ్కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. దీంతో అతని పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో మారుమోగుతోంది. తాజాగా మరో జట్టులో మరో భారతీయ ప్లేయర్ వెలుగులోకి వచ్చాడు. వన్డే వరల్డ్ కప్లో పాల్గొంటున్న నెదర్లాండ్స్ టీమ్ లో ఓ భారతీయుడు చోటు సంపాదించాడు. అతనెవరో కాదు..తేజ నిడమానూరు. ఇది తెలుగు పేరులా ఉంది అనుకుంటున్నారా..? అవును..తేజ మన తెలుగోడే. అతని స్వస్థలం విజయవాడ. 


పుట్టి ఇక్కడ..ఆడింది అక్కడ..

తేజ నిడమనూరు అసలు పేరు..అనిల్ తేజ నిడమనూరు. ఏపీలోని విజయవాడలో జన్మించాడు.  చిన్నప్పుడే తేజ తల్లి (పద్మావతి) ఉన్నత చదువుల నిమిత్తం సింగపూర్‌కు వెళ్లింది. కానీ  తేజ విజయవాడలోని వాళ్ల తాతయ్య ఇంట్లో పెరిగాడు. తాతయ్య ప్రోత్సాహంతో తేజ క్రికెట్ ఓనమాలు నేర్చుకున్నాడు. అయితే తేజ తల్లి  పద్మావతికి  ఆక్లాండ్ (న్యూజిలాండ్)లో ఉద్యోగం వచ్చింది. దీంతో  తేజ కివీస్‌కు తల్లితో పాటే వెళ్లిపోయాడు.  ఆక్లాండ్‌లో తేజ తల్లి పద్మావతి పని  చేసే ఆఫీసు పక్కనే కార్న్‌వాల్ క్రికెట్ క్లబ్‌  ఉండేది. దీంతో అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ చేశాడు తేజ. ఆ తర్వాత క్రికెట్ పూర్తిగా నేర్చుకుని..2018లో  సీనియర్ లెవల్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఆక్లాండ్ తరఫున  పలు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు  ఆడాడు. న్యూజిలాండ్  జాతీయ జట్టులో చోటు కోసం  తీవ్రంగా కృషి చేశాడు. 

అయితే న్యూజిలాండ్ జాతీయ జట్టులో తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో.. తేజ  2019 లో నెదర్లాండ్స్కు వెళ్లిపోయాడు.  అక్కడికి వెళ్లి ఆడినా కూడా 6 నెలల పాటు  అవకాశాలు  రాలేదు. కొన్నాళ్ల పాటు ఓ  ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేశాడు. అయితే  ఎట్టకేలకు  నెదర్లాండ్స్ టీమ్లో తేజ  చోటు దక్కించుకున్నాడు. 2022  మే 31న వెస్టిండీస్తో జరిగిన వన్డేతో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో  ఓడినా  తేజ మాత్రం హాఫ్ సెంచరీ (58) తో రాణించాడు.  ఆ తర్వాత పపువా న్యూ గినియా పై నెదర్లాండ్స్  తరఫున 2022  జూలైలో టి20ల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం  వరల్డ్ కప్ లో పాల్గొనే నెదర్లాండ్స్ జట్టులో  చోటు సంపాదించాడు.  

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అక్టోబర్ 06వ తేదీన పాకిస్తాన్తో జరిగిన మ్యాచులో తేజ నిడమనూరు నిరాశపర్చాడు. 9 బంతుల్లో  1 ఫోర్ సాయంతో కేవలం 5 పరుగులే చేశాడు. అయితే ప్రస్తుతం వరల్డ్ కప్ లో ఇది తన తొలి మ్యాచ్ మాత్రమే. ముందు ముందు మరిన్ని మ్యాచులు ఉండటంతో..తేజ మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని తెలుగు ప్రేక్షకులకు కోరుకుంటున్నారు.