వనపర్తి, వెలుగు: జిల్లాలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా శనివారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా తయారీతో పాటు ఓటర్లకు అవగాహన కల్పించామని, పోలింగ్ స్టేషన్ల పేర్ల మార్పులు చేసినట్లు చెప్పారు.
తుది ఓటరు జాబితా వచ్చినప్పటికీ డబుల్ ఓటర్లు, మరణించిన వారి పేర్లు తొలగించడం వంటి వాటిపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇంకా ఏమైనా అంశాలు, ఫిర్యాదులు ఉంటే తెలియజేయాలని కోరారు. ఓటరు జాబితా రూపకల్పన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు వంటి అంశాల్లో ఎలాంటి సందేహాలు, ఫిర్యాదులు లేవని రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఈవీఎం గోదామ్ నుంచి రిపేరులో ఉన్న 28 బ్యాలెట్ యూనిట్లు, 1 కంట్రోల్ యూనిట్, 12 వీవీ ప్యాట్ లను పోలీస్ భద్రత మధ్య హైదరాబాద్ లోని ఈసీఐఎల్ కంపెనీకి పంపించారు.
మొదటి స్థాయి ఈవీఎంల పరిశీలనలో వీటికి రిపేర్లు అవసరం ఉన్నట్లు గుర్తించామని కలెక్టర్ తెలిపారు. గమనించడంతో వాటిని రిపేరు కోసం పంపించామన్నారు. అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్, ఆర్డీవో పద్మావతి, రాజకీయ పార్టీల ప్రతినిధులు సయ్యద్ జమీల్, రహీం, శంకర్, ప్రవీణ్, వేణుచారి, వంశీకృష్ణ పాల్గొన్నారు.