కలిసిన అన్నదమ్ములు

కొద్దికాలంగా దూరంగా ఉన్న  రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) లీడర్ లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకులు తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వి మళ్లీ ఒక్కటయ్యారు. అన్నదమ్ములు పాత గొడవలు మరచిపోయారు. దీంతో ఆర్జేడీ కార్యకర్తలు ఫుల్ హ్యాపీ. కలవడమే కాదు అన్నదమ్ములిద్దరూ కలిసి కొన్ని వందల కుటుంబాలకు న్యాయం చేశారు. ‘ దూద్ మండి ’… పాట్నా సిటీలో చాలా ఫేమస్ ఏరియా.  దాదాపు 50 ఏళ్లుగా కొన్ని వందల కుటుంబాలు ఇక్కడ పాల వ్యాపారం చేసుకుని బతుకుతున్నాయి. ఇంత మందికి అన్నం పెట్టే దూద్ మండిని రోడ్డు విస్తరణ పనుల పేరుతో అధికారులు కూల్చివేశారు. విషయం తెలియడంతోనే  తమ్ముడు తేజస్వి  అక్కడ కు వచ్చి సర్కార్ పై పోరాటం మొదలెట్టాడు. ధర్నా షురూ చేశాడు. పాల వ్యాపారులకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశాడు.  ఆ తర్వాత అన్న తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా అక్కడికి వచ్చాడు. పాత గొడవలు మర్చిపోయి తమ్ముడితో ధర్నాలో కూర్చున్నాడు. సడన్ గా తేజ్ ప్రతాప్ అక్కడకు రావడంతో ఆర్జేడీ కేడర్ ఆనందానికి హద్దు లేకుండా పోయింది. కార్యకర్తలు ఫుల్ ఖుషీ అయ్యారు. ఎడతెరిపి లేకుండా వాన పడుతున్నా  అన్నదమ్ములిద్దరూ దూద్ మండి దగ్గర ధర్నాలోనే రాత్రంతా  కూర్చున్నారు. కూల్చివేత ఆర్డర్స్ ను వెనక్కి తీసుకోవాలని అక్కడికి వచ్చిన అధికారులకు తెగేసి చెప్పారు. లేదంటే ధర్నాను కొనసాగిస్తామని హెచ్చరించారు. యాదవ్ సోదరుల పోరాటానికి పాట్నా కార్పొరేషన్ తలవంచక తప్పలేదు. పాట్నా మునిసిపల్ కమిషనర్ దూద్ మండి ప్రాంతానికి వచ్చి, కూల్చేసిన దుకాణాలకు తిరిగి లైసెన్సు ఇస్తామన్నారు. రైల్వే స్టేషన్ కు దగ్గర్లలో త్వరలో కొత్త షాపులను కట్టించి ఇస్తామన్నారు. అన్నదమ్ముల పోరాటం సక్సెస్ కావడంతో పాల వ్యాపారుల జేజేలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది.

రాజకీయ వారసత్వంపైనే గొడవలు

లాలూ రాజకీయ వారసత్వం పై అన్న తేజ్ ప్రతాప్ యాదవ్, తమ్ముడు తేజస్వి యాదవ్ మధ్య  చాలా కాలం నుంచి గొడవలున్నాయి. దాణా కుంభకోణంలో  లాలూ ప్రసాద్ జైలుకు పోవడంతో  చిన్న కొడుకు తేజస్వినే  పార్టీకి పెద్ద దిక్కుగా మారాడు. అంతేకాదు జైలు కు వెళ్లడానికి ముందే తన రాజకీయ వారసుడు తేజస్వినే అని లాలూ ప్రసాద్ తెగేసి చెప్పారు. దీంతో పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ అలిగాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. తాజా లోక్ సభ ఎన్నికల్లో ఈ గొడవలు మరింత ముదిరాయి. కొంతమంది పార్టీ నాయకులకు టికెట్లు ఇవ్వాలని తమ్ముడు తేజస్విని తేజ్ ప్రతాప్ కోరాడు. అయితే అన్న  చెప్పినవారికి  తమ్ముడు తేజస్వి టికెట్లు ఇవ్వలేదు. తన మాట చెల్లుబాటు కాకపోవడంతో  తేజ్ ప్రతాప్ ఏకంగా కొత్త పార్టీ పెడతానని  ప్రకటించాడు. తేజస్వి మీద ఎడాపెడా విమర్శలు చేశాడు. ఆర్జేడీని తేజస్వి ఆగమాగం చేస్తున్నాడని మండిపడ్డాడు. ఫలితంగా జనంలో పార్టీ పలచన అయింది. 40 సీట్లున్న బీహార్ లో ఆర్జేడీ కి ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాలేదు. ఆర్జేడీ పుట్టిన తర్వాత ఇంత పెద్ద ఓటమి ఎన్నడూ చూడలేదన్నారు ఎనలిస్టులు. ఈ పరిస్థితుల్లో అన్నదమ్ములిద్దరూ మళ్లీ కలవడం ఆర్జేడీలో జోష్ నింపింది.

లాలూ ఎక్కడ ?

కొడుకులిద్దరూ కలవడం చూసి తండ్రి లాలూ ప్రసాద్ సంతోషించి ఉంటారు. సంతోషం సంగతి సరే, ఇంతకీ లాలూ ఎక్కడున్నారు ? దాణా కేసులో దోషిగా శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ సీనియర్ లీడర్ లాలూ ప్రసాద్ ప్రస్తుతం రాంచీ జైల్లో ఉన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆయన బెయిల్ కోసం ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చడంతో ఆయన జైల్లోనే  గడపాల్సి వచ్చింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో చురకలతో సాగే ఆయన ప్రసంగాల కోసం జనం ఎదురు చూశారు. కానీ బెయిల్ దొరక్కపోవడంతో ఆయన బయటకు రాలేదు. జైల్లోనే ఉన్నారు. దీంతో బీహార్ ప్రజలే కాదు రాజకీయ ప్రత్యర్థులు కూడా లాలూను మిస్సయ్యారు. లాలూ మార్క్ ప్రసంగాల సందడి  లేకుండానే బీహార్​లో లోక్ సభ ఎన్నికలు ముగిశాయి.