ఆర్జేడీ లాంతర్‌ని పట్టుకునే వాళ్లెవరా అని బీహార్‌లో జనం ఎదురుచూస్తున్న దశలో తేజస్వీ ముందుకొచ్చాడు. పట్టుమని 30 ఏళ్లయినా లేని ఈ ట్వెల్త్ క్లాస్ డ్రాపవుట్ స్టూడెంట్ బీహారీలకు బాగా నచ్చాడు. లాలూ మాదిరిగా వివిధ బీసీ, దళిత కులాలను ఏకతాటిపైకి తేవటానికి ప్రయత్నిస్తున్నాడు. సోషల్ జస్టిస్ విషయంలో లాలూ కేరాఫ్ అడ్రస్.యూపీలో మాదిరిగా కాకుండా బీహార్‌లో యాదవ్ లతోపాటు ఇతర కులాల్నీ కలుపుకు వెళ్తుంటారు. దీనిలో తేజస్వీ ఇప్పటికే కొంత విజయం సాధించాడు. రాష్ట్రంలోని మూడు చిన్నపార్టీలను తన సామాజిక కూటమిలో పార్ట్‌నర్ లను చేయటంలో పరిణతి చూపాడు.
సమోసాలో ఆలు, బీహార్ లో లాలూ’ అని చెప్పుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. బీహార్ రాజకీయాల్లో ఇరుసులా పనిచేసే లాలూ ప్రసాద్‌యాదవ్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన పెద్దకొడుకు తేజ్ పాల్ యాదవ్ ఫ్యామిలీ చిక్కుల్లోఇరుక్కుని జనంలో చులకనయ్యాడు. అప్పటికే లాలూ తనకు దీటైన వారసుడిగా రెండో కొడుకు తేజస్వీ యాదవ్ ని ఎంకరేజ్ చేయడం మొదలెట్టారు. లాలూ అంచనాలు నిజమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆర్జేడీ పార్టీ చీఫ్ , రాష్ట్ర మాజీ సీఎం, తన తండ్రి లాలూ ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో లేని లోటును భర్తీ చేసేందుకు ఈ యువ నాయకుడు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నాడని కితాబిస్తున్నారు. లాలూ వేసిన పొలిటికల్ ప్లాట్ ఫాం వల్లే తేజస్వీకి ఈ గుర్తింపు వచ్చిందని, అయితే ఆ అవకాశాన్ని అతను పూర్తిగా వినియోగించుకోలేక పోతున్నాడనే విమర్శల్లో నిజం లేదని ఖండిస్తున్నారు.
వాస్తవానికి తేజస్వీ యాదవ్ ‘చీఫ్ మినిస్టర్–ఇన్–వెయిటింగ్ ’ కాదు. సీఎం సింహాసనానికి వారసుడిగానూ రాలేదు. పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లోతండ్రి లేకపోవటం వల్ల తలెత్తిన సవాళ్లను ఒక్కటొక్కటిగా విజయవంతంగా పరిష్కరిస్తున్నాడు. లాలూ మాదిరిగా వివిధ బీసీ, దళిత కులాలను ఏకతాటిపైకి తేవటానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విషయంలో తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. అయితే ఆయనలాగా ఈ కుల రాజకీయాలపై పట్టు సాధించటానికి ఈ యూత్ లీడర్‌కి మరికొంత సమయం పడుతుందనటంలో సందేహం లేదు.
ఈ దిశగా సక్సెస్ అవ్వాలంటే యాదవ కమ్యూనిటీ మాత్రమే ఆర్జేడీకి ప్రధాన బలమనే పరిమితికి లోబడకుండా చూసుకోవాలి. అదే ఆయన పాసవ్వాల్సిన మొదటి పరీక్ష. సామాజిక న్యాయ రాజకీయాలకు లాలూ కేరాఫ్ అడ్రస్. దాన్ని తన పార్టీకి శాశ్వత చిరునామాగా మార్చాలంటే ఇతర కులాలనూ భాగస్వాములను చేయాలి. ఈ మేరకు ఇప్పటికే కొంత విజయం సాధించాడు.రాష్ట్రంలోని మూడు చిన్న పార్టీలను తన సోషల్ కొయిలేషన్ లో పార్ట్ నర్లను చేయటంలో పరిణతి చూపాడు.
పట్టుమని 30 ఏళ్లయినా లేని..
వికాస్ షీల్ ఇన్ సాన్ పార్టీ (వీఐపీ), హిందుస్తానీఅవామ్ మోర్చా(హెచ్ ఏఎం), రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ(ఆర్ఎల్ఎసీపీ)ల చేరికతో తేజస్వీ యాదవ్ నేతృత్వం లో ని రాజకీయ కూటమి బలోపేతమైంది. తమకంటూ సొంత లక్ష్యాలు ఉండే పార్టీలను ఉమ్మడి లక్ష్యం కోసం ఒక్కటి చేయటం పాలిటిక్స్‌లో తలపండిన వాళ్లకే ఒక్కోసారి సాధ్యం కాదు. అలాం టిది పట్టుమని30 ఏళ్లు కూడా నిండని తేజశ్వీ యాదవ్ చేసి చూపించాడు. మధుబని, షియోహర్, మోతిహరి,దర్భంగా సీట్లను పొత్తులో భాగంగా వేరే పార్టీలకు కేటాయిం చాడు.
కొన్ని సాధించాలంటే కొన్ని వదులుకోవాలి.మరో పార్టీని చెంతకు చేర్చు కోవాలంటే ఆ పార్టీ నుంచే కాదు మన వైపు నుంచీ పట్టు విడుపులు ప్రదర్శించాలి. ఈ విషయంలో ఆర్జేడీ కొన్నిత్యాగాలు చేసిందనే చెప్పాలి. సాధారణ ఎన్నికల ప్రచారాన్ని సాదాసీదాగా చేస్తున్నాడనే విమర్శలను తేజశ్వీ యాదవ్ పటాపంచలు చేస్తున్నాడు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిపిన లెవల్లో, గత ఏడాది మొదట్లో జరిగిన బై ఎలక్షన్ ను తలదన్నే లాక్యాంపెయిన్ ను పక్కాగా నిర్వహిస్తున్నాడు.
ఎన్నికల వ్యూహాలు మొదలుకొని బలమైన అభ్యర్థులను ఎంపిక చేయటం వరకు, వివిధ పార్టీలతో పొత్తు కుదుర్చుకోవటం నుం చి ఎలక్షన్ ప్రచారం వరకు తేజస్వీ యాదవ్ అడుగడుగునా తన ట్యాలెంట్ ని చాటుకుంటున్నాడు. జూనియర్ లాలూగా ప్రశంసలు అందుకుంటున్నాడు.ఆయన ప్రతిభకు పార్లమెంట్ దిగువ సభ ఎన్నికల ఫలితాలే అద్దం పట్టనున్నాయి.
కన్హయ్యకు అన్నయ్యగా
బెగుసరాయ్ లోక్ సభ నియోజకవర్గం లో బరిలో నిలిచిన సీపీఐ అభ్యర్థి కన్హయ్య కుమార్‌కు పోటీగా ఆర్జేడీ క్యాండిడేట్ ను నిలపలేదు. ఆ స్థానంలో తన పార్టీ గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నా ఆ విద్యార్థి నేతకు తేజస్వీ యాదవ్ పరోక్షంగా అండగా నిలిచారు. తద్వారా తేజస్వీయాదవ్ తన సొంత లక్ష్యాల కోసమే పనిచేస్తున్నాడన్న మాటలు తప్పని నిరూపించాడు. బెగుసరాయ్ లో 2014 లోక్ సభ ఎన్ని కల్లో బీజేపీకి 35.72 శాతం ఓట్లు రాగా ఆర్జేడీని కూడా ప్రజలు దాదాపు అదే రేంజ్లో ఆదరించారు. 34.31 శాతం ఓట్లు కట్టబెట్టారు. అయినా గానీ, కన్హయ్య కోసం తేజస్వీ సీటు త్యాగం చేశాడు.
పదునైన విమర్శలు
జనరల్ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏపై తేజస్వీ యాదవ్ నాన్ స్టాప్‌గా విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఆ కూటమి సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని తప్పుపడుతున్నారు. బీహార్ ప్రభుత్వంపైనా విరుచుకు పడుతున్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వాధి నేత(నితీశ్ కుమార్) దొంగిలించారంటూ తేజశ్వీ మండిపడుతున్నారు. తద్వారా రాష్ట్రంలోని విపక్షాలన్నింటి తరఫునూ ఈ యువ నాయకుడు ఒక్కడే సమర్థవంతంగా గళం విప్పుతున్నట్లు అనిపిస్తోంది. – ‘ది వైర్ ’ సౌజన్యంతో