రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయం ఫిబ్రవరి 17న ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ కార్యక్రమానికి తాను హాజరుకాకపోవడంపై బీహార్ సీఎం నితీష్ కుమార్ వివరణ ఇచ్చారు. తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ తనను ఆహ్వానించారని.. కాకపోతే బిజీ షెడ్యూల్ కారణంగా వెళ్లలేకపోతున్నట్లు నితీష్ స్పష్టం చేశారు.
‘‘తమ పార్టీ తరఫున ఎవరినైనా పంపమని కేసీఆర్ కోరారు. ఈ విషయాన్ని నేను మా పార్టీ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్‌కు చెప్పా. డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌తో కూడా ఓ మాట చెప్పాలని కేసీఆర్ అడిగారు. మీరు కూడా తేజిస్వితో స్వయంగా మాట్లాడండి అని కేసీఆర్‌కు సూచించా’’ అని నితీశ్ కుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో కేసీఆర్ సభకు హాజరైనంత మాత్రానా కాంగ్రెస్‌తో తమకున్న భాగస్వామ్యానికి వచ్చే నష్టమేమీ లేదంటూ నితీశ్ కుమార్ వెల్లడించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో కలిసి విపక్షాలను ఏకం చేసేందుకు తాను చేస్తున్న ప్రయత్నాలను ఇంకా విరమించలేదని స్పష్టంచేశారు. భారత్ జోడో యాత్ర ముగింపు అనంతరం ఈ సన్నాహాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.