గుడిహత్నూర్, వెలుగు: రైతులు స్థానికంగా ఉండే వనరులను వినియోగించుకొని నిర్వహిస్తున్న వ్యాపారాల్లో మరింత అభివృద్ధి సాధించాలని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ సూచించారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా గుడిహత్నూర్ మండలంలోని డీఎన్టీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపనీ సభ్యులు నిర్వహిస్తున్న ఆయిల్, దాల్ మిల్‌ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌తో కలిసి పరిశీలించారు.
ప్రభుత్వం ట్రైకార్ ద్వారా ఆర్థిక సాయం అందించి వ్యాపారాభివృద్ధికి మరింత తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్‌లో చేపట్టబోయే వ్యాపారాల గురించి కంపెనీ సీఈవో సునీల్‌ను అడిగి తెలుసుకున్నారు. అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. గుడిహత్నూర్ మండలంతో పాటు పరిసర మండలాల్లో టమాట సాగు ఎక్కువ ఉన్నందున టమాట ఉత్పత్తులపై దృష్టి సారించి ఆ దిశగా పరిశ్రమ ఏర్పాటు చేస్తే మరింత లబ్ధి చేకూరుతుందని ఆయన సూచించారు.
నాగోబా ఆలయ సందర్శన
అనంతరం బెల్లయ్య నాయక్ ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ప్రసిద్ధ నాగోబా ఆలయాన్ని సందర్శించారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ నాయకురాలు ఆత్రం సుగుణ ఆయనకు స్వాగతం పలికారు. మెస్రం వంశస్థులతో మాట్లాడి ఆలయ చరిత్రను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించారు. స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఇంద్రవెల్లి లోని డీఎన్టీ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపనీని సందర్శించి గిరిజన రైతులు చేస్తున్న వ్యాపారాలను తెలుసుకున్నారు. కంపెనీ చైర్మన్ సోయం భోజన్న, కాంగ్రెస్ నాయకులు కుమ్రం కోటేశ్, సెడ్మకి ఆనంద్ రావ్, మల్యాల శ్రీకర్, ఆరీఫ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.