- స్కూల్ ఎడ్యుకేషన్‌లో స్పీడ్‌గా నిర్ణయాలు
- బడుల బలోపేతానికి వేగంగా చర్యలు
- హైకోర్టు తీర్పు వచ్చిన తెల్లారే..మోడల్ టీచర్ల బదిలీలు
- మండలానికో ఇంచార్జీ ఎంఈవో నియామకం
- పది రోజుల్లోనే డీఎస్సీ అపాయిట్మెంట్ లెటర్లకు ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూళ్ల బలోపేతంపై సర్కారు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని పలు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గడిచిన మూడు, నాలుగు వారాల్లోనే కీలకమైన నిర్ణయాలను సర్కారు తీసుకున్నది. ప్రధానంగా డీఎస్సీ రిజల్ట్ ఇచ్చిన పదిరోజుల్లోనే నియామక పత్రాలు అందించేందుకు డిసైడ్ అయింది. దీనికితోడు మోడల్ స్కూళ్లలో బదిలీలు, ప్రతి మండలానికొక ఇంచార్జీ ఎంఈవో నియామకం, కేజీబీవీ టీచర్ల బదిలీలతో పాటు వెయ్యి ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నది. ఆలస్యం లేకుండా వెంట వెంటనే తీసుకుంటున్న ఈ నిర్ణయాలు స్కూల్ ఎడ్యుకేషన్ బలోపేతానికి ఉపయోగడుతుందని టీచర్లు, విద్యావేత్తలు చెప్తున్నారు.
11 ఏండ్ల తర్వాత మోడల్ టీచర్ల బదిలీలు
రాష్ట్రంలో మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలపై సర్కారు నిర్ణయం వందలాది మంది టీచర్ల కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013–14 విద్యాసంవత్సరంలో రిక్రూట్ అయిన స్కూళ్లలోనే ఇప్పటివరకూ కొనసాగారు. సీనియార్టీ అంశంపై హైకోర్టులో కేసుతో బదిలీలు, ప్రమోషన్లు ఆగిపోయాయి. అయితే, 20 రోజుల క్రితం బదిలీలపై అనుసరించాల్సిన విధానాన్ని చెప్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.
దీంతో అప్పటికే బదిలీల ప్రక్రియ అంతా రెడీగా ఉండటంతో, మరుసటిరోజే బదిలీలు నిర్వహించింది. దీంతో 11 ఏండ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్ 89 మంది ఉండగా, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 1,923 మంది, ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 745 మంది బదిలీ అయ్యారు. ప్రస్తుతం మోడల్ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
మండలానికో ఎంఈవో సాహసమే..
సర్కారు ఇటీవల తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లో ఎంఈవోల నియామకం కీలకమైంది. రాష్ట్రంలో 632 మండలాలు ఉండగా, వాటిలో 16 మండలాల్లోనే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. ప్రస్తుతం ఒక్కో ఇంచార్జీ ఎంఈవో కూడా ఆరు నుంచి పది మండలాల బాధ్యతలు చూస్తున్నారు. అయితే, ప్రస్తుతం సర్వీస్ రూల్స్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో కొన్నేండ్లుగా రెగ్యులర్ ఎంఈవోల నియామకం ఆగిపోయింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని బడుల బలోపేతం, పర్యవేక్షణ కోసం మండలానికో ఇంచార్జీ ఎంఈవోను నియమించాలని సర్కారు భావించింది.
దానికి అనుగుణంగా ఆయా మండలాల్లోని సీనియర్ హెడ్మాస్టర్లకు ఇంచార్జీ ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించింది. తద్వారా 609 మండలాలకు ఇంచార్జీలు, మరో 16 మండలాలకు రెగ్యులర్ ఎంఈవోలను నియమించినట్టయింది. ఈ క్రమంలోనే 19 ఏండ్లుగా బదిలీల్లేక ఒకే చోట పనిచేస్తున్న రెగ్యులర్ ఎంఈవోలకూ బదిలీలు జరిగాయి.
మరో వెయ్యి కేజీబీవీ పోస్టుల భర్తీ
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో పనిచేస్తూ, రెండేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న టీచర్లకు ప్రభుత్వం బదిలీలు నిర్వహించింది. తద్వారా సుమారు 500 మంది బదిలీలు అయ్యారు. అనంతరం కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న సుమారు వెయ్యి పోస్టులను భర్తీ చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి డీఈవోలకు ఆదేశాలు జారీచేశారు. 2023లో నిర్వహించిన రాతపరీక్ష ఆధారంగా మెరిట్ ఆభ్యర్థులను తీసుకుంటున్నారు. కాగా, కొత్తగా ఎంపికైన టీచర్ అభ్యర్థులకు ఈ నెల9న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలను అందించనున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి తెలిపారు.
పదిరోజుల్లోనే నియామక పత్రాలు
రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ–2024 నోటిఫికేషన్ ఇచ్చింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకూ డీఎస్సీ రాత పరీక్షలు జరిగాయి. ఈ పోస్టులకు 2.79 లక్షల మంది అప్లై చేస్తే.. 2.46 లక్షల మంది పరీక్ష రాశారు. గతనెల 30న డీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టులు రిలీజ్ చేయగా, ఆ మరుసటి రోజే 1: 3 ప్రతిపాదికన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించారు. శనివారంతో జనరల్ టీచర్ పోస్టుల వెరిఫికేషన్ పూర్తయింది. సోమవారం 1: 1 మెరిట్ లిస్టు ఇచ్చేసి.. ఈ నెల 9న నియామక పత్రాలు ఇచ్చేందుకు సర్కారు రెడీ అయింది. అయితే, కేవలం పరీక్ష నిర్వహించిన 55 రోజుల్లోనే ఫలితాలు రిలీజ్ చేయడం విద్యాశాఖలో రికార్డే. ఫలితాలు రిలీజ్ చేసిన పదిరోజుల్లోనే నియామక పత్రాలు ఇవ్వడమూ చరిత్రేననీ టీచర్లు చెప్తున్నారు.