బీఆర్ఎస్​లో..పథకాల పంచాయితీ

  •     తమ అనుచరుల కోసం నేతల పట్టు
  •     సిఫారసులు పట్టించుకోకుంటే అలక..
  •     సవాలుగా మారుతున్న లబ్ధిదారుల ఎంపిక..
  •     ఎలక్షన్ టైంలో కత్తి మీద సాములా స్కీములు

నిర్మల్, వెలుగు : అధికార బీఆర్ఎస్ పార్టీలో సంక్షేమ పథకాల పంచాయితీ మొదలైంది. వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం అధికార బీఆర్ఎస్ కు కత్తిమీద సాములా మారుతోంది. బడా నేతలే కాకుండా ద్వితీయ శ్రేణి నేతలు కూడా తమ అనుచరులకు పథకాల లబ్ధి చేకూర్చేందుకు పోటీ పడుతున్నారు. ఈ, అంశం మంత్రి, ఎమ్మెల్యేలకు తల నొప్పిగా మారింది. అసలే ఎలక్షన్ టైం కావడంతో ఈ వ్యవహారం తమకు మైనస్​గా మారే ప్రమాదం ఉందని నేతలు భయపడుతున్నారు. 

అర్హులకు అన్యాయం

గత కొద్ది రోజుల నుంచి నిర్మల్ తో పాటు ముథోల్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక వ్యవహారం అధికార బీఆర్ఎస్ పార్టీలో గ్రూపు తగాదాలు, 
అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది. ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన ద్వితీయ శ్రేణి నాయకులంతా తమ అనుచరులకే పథకాలు ఇప్పించుకునేందుకు పోటీపడుతున్నారు. ముఖ్యంగా నిర్మల్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో అధికార పార్టీ నేతలు ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి తమ మాట నెగ్గించుకునేందుకు పట్టుబడుతున్నారు. దీంతో అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వివిధ పథకాలకు సంబంధించిన యూనిట్లు ఈ మూడు నియోజకవర్గాలకు తక్కువ సంఖ్యలో మంజూరవుతుండడం, ఆశించేవారి సంఖ్య ఎక్కువగా ఉంటుండడంతో ఇది రాజకీయ సమస్యకు దారితీస్తోంది. మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు అలాగే ఆ పార్టీకి సంబంధించిన వార్డు ప్రతినిధులు, సీనియర్ నాయకులు, ఇతర పదవులలో కొనసాగుతున్న వారు ఈ పథకాల కోసం పట్టుబడుతుండడం అక్కడి మంత్రి, ఎమ్మెల్యేల అసహనానికి కారణమవుతోంది. 

నేతలను నిలదీస్తున్న అనుచరులు

ముఖ్యంగా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు, దళిత బంధు, బీసీల్లోని చేతివృత్తుల వారికి రూ.లక్ష సాయం, మైనార్టీలకు రూ.లక్ష పంపిణీ లాంటి పథకాల కోసం రాజకీయ పంచాయితీ ముదురుతోంది. కౌన్సిలర్లు, సర్పంచులు ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో తమకు కోటా ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. వీరంతా మంత్రి, ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తెస్తుండడంతో తప్పని పరిస్థితిలో కొన్ని పేర్లు సిఫారసు చేస్తున్నారు. సిఫారసులు ఎక్కువై, యూనిట్లు తక్కువగా ఉండడంతో.. ఒకరిద్దరికి మినహా మిగతా వారికి మొండిచేయి ఎదురవుతోంది. ఇది కాస్తా అధికార పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు దారితీస్తోంది.

ఈ విషయంపై తమ అనుచరులను సముదాయించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వారు మాత్రం వినడంలేదు. లబ్ధిదారుల ఎంపికపై మున్సిపాలిటీల్లోని బీఆర్ఎస్ కౌన్సిలర్లే తమ నేతలను నిలదీస్తుండడం, బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తుండడం చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా దళిత బంధు విషయంలో అర్హులకు కాకుండా తమ అనుచరులకే నేతలు లబ్ధి చేకూరేలా చేస్తున్నారని దళితులు మండిపడుతున్నారు. ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి పంచాయితీ అధికార బీఆర్ఎస్ ను కలవరపెడుతోంది.

మున్సిపాలిటీల్లో వెరీ సీరియస్

నిర్మల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు వ్యవహారంలో కూడా తాము సూచించిన వారిని ఎంపిక చేయలేదంటూ కౌన్సిలర్లు బాహాటంగానే చెబుతున్నారు. తమ అనుచరులైన కొంతమంది పేర్లు సిఫారసు చేసినప్పటికీ వారిని అర్హులుగా గుర్తించలేదంటూ పలువురు కౌన్సిలర్లు వాపోతున్నారు.

ఇతర సంక్షేమ పథకాల విషయంలోనూ తాము సూచించిన వారికి జాబితాలో చోటు దక్కలేదంటూ కౌన్సిలర్లు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎలక్షన్ టైంలో స్థానికంగా ఓట్లు అడగలేని పరిస్థితి ఏర్పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మల్ మున్సిపాలిటీలో సంక్షేమ పథకాల ఎంపిక వ్యవహారం కౌన్సిలర్లు, కొంతమంది సీనియర్ నాయకుల మధ్య అసంతృప్తికి, అంతర్గత పోరుకు కారణమవుతోంది.