లెక్కలు చెప్పలేక సర్కార్ తిప్పలు
తాజాగా సీడబ్ల్యూసీ లేఖతో ఇరుకున పడ్డ రాష్ట్ర సర్కార్
రీఇంజనీరింగ్ పేరుతో భారీగా పెంచేసిన సర్కారు
గ్రావిటీతో వచ్చే నీళ్లను కాదని.. అంతపెద్ద లిఫ్టులు ఎందుకనే డౌట్
మూడో టీఎంసీ తమ్మిడిహెట్టి నుంచి ఎందుకు తీసుకోలే?
లింక్ –4లోనూ మరోసారి ఖర్చులు పెంచే ప్రయత్నం
లెక్కలేనన్ని డబ్బులు ధారపోసిన కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థించుకునేందుకు రాష్ట్ర సర్కారు తంటాలు పడుతోంది. అనుకున్న ఖర్చు అమాంతం మూడు రెట్లకుపైగా ఎందుకు పెరిగిందో చెప్పుకోలేక ఇప్పుడు తిప్పలు పడుతోంది. ఈ ప్రాజెక్టుపై ఇటీవల సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) రాసిన లేఖ సర్కారును ఇరుకున పడేసింది. ఏఐబీపీ స్కీమ్లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర సర్కారు గతేడాది అక్టోబర్లో కేంద్రాన్ని కోరింది. దీంతో పెరిగిన ఖర్చు, అదనంగా చేపట్టిన పనులకు అనుమతులు తీసుకోవాలని.. అందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపాలని కేంద్రం రాష్ట్ర సర్కారుకు లేఖ రాసింది. అయితే కేంద్రం కోరిన ప్రతిపాదనలు తయారు చేసేందుకు రాష్ట్ర ఇరిగేషన్ విభాగం ఇప్పుడు కిందామీదా పడుతోంది. గ్రావిటీతో పైసా ఖర్చు లేకుండా నీళ్లను తీసుకొచ్చే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇన్ని స్టేజీల్లో భారీ లిఫ్టులు ఎందుకు నిర్మించాల్సి వచ్చిందన్న ప్రశ్నలకు ఏం చెప్పాలో అర్థంకాని స్థితి నెలకొందని ఇంజనీరింగ్ వర్గాలు అంటున్నాయి.
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు విపరీతంగా పెరిగిపోతోంది. ప్రాజెక్టులో ఇప్పటివరకు మూడు లింకుల్లోపనులు పూర్తయ్యాయి. మేడిగడ్డనుంచి ఎల్లంపల్లిప్రాజెక్టు వరకు లింక్–1. ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు వరకు లింక్– 2. మిడ్‌మానేరు నుంచి అప్పర్ మానేరువరకు లింక్–3, మిడ్‌మానేరునుంచి బస్వా పూర్ వరకు చేపట్టేపనులు లింక్–4గా విడదీశారు. గత నాలుగేండ్లలో 1, 2, 4 లింకుల్లోపనులు కొలిక్కి వచ్చాయి. లింక్–4లో 50 టీఎంసీల కెపాసిటీతో నిర్మించాల్సిన మల్లన్నసాగర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులు భూసేకరణ తో పెండింగ్ లో పడ్డాయి. అయితే కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని ఎత్తిపోయటం తమ విజయంగా ప్రభుత్వం చెప్పుకుంటోంది.
లింక్–4లోనూ వడ్డనకు రెడీ!
మిడ్ మానేరు నుంచి కొండపోచమ్మసాగర్ వరకు గల లింక్ –4లోని పనుల వ్యయాన్ని పెంచడానికి రంగం సిద్ధం అవుతోంది. మల్లన్నసాగర్ నిర్మాణం పూర్తి కాకున్నాప్యాకేజీ–10 నుంచి 14 వరకు రూ.14,507.75 కోట్ల పనులు పూర్తి చేశారు. ఈ పనుల ఎస్టిమేషన్ కాస్ట్‌తో పోల్చితే.. నిర్మాణ వ్యయం భారీగా పెరిగిందంటూ వర్క్‌ఏజెన్సీ ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు చెప్పింది. పనుల వ్యయాన్ని సవరించాలని కోరినట్టు తెలిసింది. దీంతో మరోసారి అంచనాలు పెరిగే చాన్స్ ఉంది.
మూడో టీఎంసీతోనే చిక్కుముడి
ప్రాణహిత – చేవెళ్ల స్కీంలో భాగంగా కేవలం ఒక్క స్టేజీ లిఫ్టుతోనే ఎల్లంపల్లికి నీటిని తరలించే అవకాశం ఉంది. తమ్మిడిహెట్టి నుంచి మైలారం వరకు గ్రావిటీ కాల్వ తవ్వి లైనింగ్ కూడా పూర్తయి రెడీగా ఉంది. ఈ కాల్వ ద్వారా రోజుకు రెండు టీఎంసీల నీటిని తరలించే అవకాశముంది. ఇప్పటికే పూర్తయిన పనుల ద్వారా తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి మూడో టీఎంసీని తరలించే అవకాశమున్నా.. ఎందుకు తిరిగి మేడిగడ్డకే వెళ్లారనే ప్రశ్నలకు సర్కారు వద్ద సరైన సమాధానాల్లేవు. ప్రాజెక్టు కాస్ట్ బెనిఫిట్ రేషియోపై ఇది ప్రధానంగా ప్రభావం చూపుతుంది. ఈ అంశాన్ని సీడబ్ల్యూసీ కార్నర్ చేసే చాన్స్ ఉందని అధికారులు తల పట్టుకుంటున్నారు.
ప్రాణహిత పేరు ఉండొద్దనే రీడిజైన్!
ఉమ్మడి ఏపీలో జలయజ్ఞంలో భాగంగా అంబేద్కర్ ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టారు. కేంద్ర మాజీ మంత్రివెంకటస్వామి (కాకా) అప్పటి సీఎం వైఎస్ పై ఒత్తిడి చేసి ఈ ప్రాజెక్టును మొదలుపెట్టేలా చేశారు. 2007–08లో రూ.38,500 కోట్ల అంచనాతో మొదలైన ఈ ప్రాజెక్టుపై ఉమ్మడి రాష్ట్రంలోనే రూ.11 వేల కోట్లకు పైగా ఖర్చు చేశారు. 160 టీఎంసీల నీటిని ఎత్తిపోసి 16 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చేలా డిజైన్ చేశారు. తమ్మిడిహెట్టినుంచి మైలారం వరకు రెండు టీఎంసీల కెపాసిటీతో 74 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ తవ్విలైనింగ్ కూడా చేశారు. ప్యాకేజీ–5 పనులు జరగాల్సిన చోట సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లు ఉండటంతో జైపూర్ వాగు ద్వారా ఎల్లంపల్లివరకు నీటిని తరలించి, అక్కడ ఒక లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లిలోకి ఎత్తిపోయాలని అనుకున్నారు. తమ్మిడిహెట్టివద్ద 148 మీటర్లఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్న సర్కారు.. ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన ప్రాణహిత పేరుంటే తమకు మైలేజ్ రాదనే కారణంతో రీడిజైన్ చేశారు.
ఇంకా ఎత్తిపోతలు ఎందుకు?
మేడిగడ్డనుంచి మిడ్ మానేరు వరకు రెండు టీఎంసీలను ఎత్తిపోసే వ్యవస్థ అందుబాటులో ఉంది. హైదరాబాద్ తాగునీటి, పారిశ్రామిక అవసరాలు, మల్లన్నసాగర్ సహా మిగతా రిజర్వాయర్ల ఆయకట్టుకు భరోసా ఇవ్వాలనే పేరుతో మిడ్ మానేరు నుంచి రెండో టీఎంసీ పనులకు రూ.21 వేల కోట్లకు పైగా వెచ్చిస్తోంది. ఇక్కడ కొత్తగా ఒక్క ఎకరం కూడా సాగులోకి వచ్చే అవకాశం లేదు. హైదరాబాద్ తాగునీరు, పారిశ్రామిక అవసరాలను మొదటి ప్రపోజల్లోనే పెట్టారు. ఇప్పుడు మళ్లీఅదే కారణంతో అడిషనల్ టీఎంసీ పనులు చేస్తున్నారు. పాత ప్రతిపాదనల్లో ఉన్న ఆయకట్టు, తాగునీటి అవసరాలకు మళ్లీలిఫ్టింగ్ ఎందుకని కేంద్రం ప్రశ్నించే అవకాశాలున్నాయి.
నిర్వహణ భారం తడిసి మోపెడు
కాళేశ్వరం ప్రాజెక్టు భారీ లిఫ్టులు. పంపు హౌజ్ లతో ముడిపడి ఉన్నప్రాజెక్టు. అందుకే ప్రాజెక్టుకు అంచనా వ్యయంతో పాటు నిర్వహణ భారం ఏటేటా తడిసి మోపెడవుతుంది. భారీగా కరెంట్ బిల్లుల భారం పడుతుంది. మేడిగడ్డ నుంచి వివిధ స్టేజీల్లో నీటిని ఎత్తిపోయాలి. ఎక్కడ ఏ చిన్న సాంకేతిక సమస్య తలెత్తినా మొత్తం ప్రాజెక్టులో నీటి సరఫరా ఆగిపోతుంది. ఆయకట్టుకు నీరందకుండా పోయే ప్రమాదముంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణకు నిరుటి బడ్జెట్ లో సర్కారు రూ.5,219 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది అదనంగా మరో రూ.500 కోట్లుపెంచింది. ప్రాజెక్టు మొత్తం పూర్తయితే కరెంట్ బిల్లులకే ఏటా రూ.7,500 కోట్లదాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మూడో టీఎంసీ ఎత్తిపోతలకు అయ్యే ఖర్చు దానికి అదనంకానుంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు భారీ నష్టం
ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టులో ఆ రెండు పేర్లు లేకుండా చేసిన రాష్ట్ర సర్కారు.. రంగారెడ్డి జిల్లాలోని కరువు ప్రాంతాలకు గోదావరి నీళ్లిచ్చే పనులను కూడా తొలగించింది. తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాల్లోని రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉండగా ఆ ప్రాంతాన్ని కట్ చేశారు. ప్రస్తుత కొండపోచమ్మ నుంచి చేవెళ్ల ట్యాంకుకు లింక్ చేసే టన్నెల్ పనులను కొంత చేసినా అర్థంతరంగా వదిలేశారు. తాజాగా కొండపోచమ్మ వరకు నీళ్లురావడంతో.. ఇప్పటికే చేవెళ్ల లింక్ పనులు చేసి ఉంటే పాత ఆయకట్టుకు నీళ్లొచ్చేవని రైతులు అంటున్నారు.
లిఫ్ట్ మీద లిఫ్ట్.. ఖర్చు మూడింతలు
2008లో రూ.38,500 కోట్లతో ప్రాణహిత–చేవెళ్ల పేరుతో ఈ ప్రాజెక్టు పనులు మొదలయ్యాయి. తర్వాత సర్కారు రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చింది. పనుల్లో మార్పులు చేస్తూ.. అంచనా ఖర్చును భారీగా పెంచుకుంటూ వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు వ్యయం మూడు రెట్లు పెరిగి.. లక్షా 10 వేల కోట్లు దాటింది. తొలుత 2016లో ప్రాజెక్టు కాస్ట్ ను ఒక్కసారే అమాంతం రూ.80 వేల 190 కోట్లకు పెంచారు. ఈ మూడేండ్లలో మరో రూ.8,254 కోట్ల వ్యయాన్ని అదనంగా పెంచారు. మూడో టీఎంసీ పనులతో మరో 21 వేల కోట్లకుపైగా చేర్చారు. ఇట్లా ఇంతగా ఖర్చును పెంచేయడం వివాదాస్పదంగా మారింది. ప్రతిపక్షాలన్నీ పదే పదే ఇదే విషయాన్ని వేలెత్తి చూపుతున్నాయి.
సీఎం చెప్పినోళ్లకే పనులు
మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు రెండు లింకుల్లో చేపట్టి న ఖర్చు మూడేండ్లలోనే రూ.8,254 కోట్లు అదనంగా పెరిగింది. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరు వరకు మూడో టీఎంసీ, మిడ్ మానేరు నుంచి మల్లన్నసాగర్ వరకు రెండో టీఎంసీ నీటిని తరలించే పనులను మరో రూ.21,458 కోట్ల వ్యయంతో చేపట్టారు. వర్క్ ఏజెన్సీలు 2.15 శాతం ఎక్సెస్‌కు ఈ టెండర్లను దక్కించుకున్నాయి. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడో టీఎంసీ పనులను రూ.4,657.95 కోట్లతో టెండర్లు లేకుండానే సీఎం ప్రస్తు త వర్క్ ఏజెన్సీలకే నామినేషన్ పద్ధతిన అప్పగించారు. మోటార్లు బిగించేందుకు అవసరమైన ఎర్త్ వర్క్, గ్రావిటీ కాల్వ పనులను రెండు టీఎంసీల పనులతో పాటే చేపట్టారు. పంపుల ఫిట్టింగ్ పనులు మాత్రమే కొత్తగా చేపట్టారు. ఈ నెల రెండో వారంలోనే సీఎం జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు వద్ద అడిషనల్ టీఎంసీ పనులు ప్రారంభించాల్సి ఉండగా దాన్ని వాయిదా వేశారు.
గ్రావిటీ నీళ్లు వద్దని.. పునరుజ్జీవం పేరుతో మూడో టీఎంసీ లిఫ్టింగ్ !
గతేడాది ఎస్సారెస్పీకి భారీగా వరదలు వచ్చి నీళ్లు నదిలో వృథాగా పోయాయి. ఆ టైంలో వరద కాల్వ ద్వారా రూపాయి ఖర్చు లేకుండా కిందికి నీటిని వదిలే అవకాశమున్నా.. దిగువ చి ఎత్తిపోయడానికే ప్రాధాన్యమిచ్చారు. ఎస్సారెస్పీ స్టేజ్–2 ఆయకట్టుకు కాళేశ్వరం నీళ్లు ఇచ్చామని అనిపించుకోవడానికి వరద కాల్వను ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేశారు. ఫలితంగా వందల కోట్ల కరెంట్ బిల్లు పడింది. ఎస్సారెస్పీకి ఉల్టా నీళ్లను లిఫ్ట్ చేసి.. పునరుజ్జీవం పోస్తామని చెప్పుకునేందుకు అడిషనల్ టీఎంసీ అంశాన్ని తెరపైకి తీసుకురావటంతో కాళేశ్వరం అంచనాలను మరింతగా పెంచారు. తొలి ఏడాది ఈ ప్రాజెక్టు ద్వారా ఒక్కటంటే ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదు. పెద్దపల్లి జిల్లాలో కాళేశ్వరం కింద 30 వేల ఎకరాలను ప్రతిపాదించినా దానికి ఈ ఏడాది కూడా నీళ్లిచ్చే పనులు చేపట్టలేదు.
ఖర్చు పెంపుపై సర్కారు చెప్తున్నదిదీ..
ప్రాణహిత ప్రతిపాదిత ఆయకట్టు 16 లక్షల ఎకరాలుకాగా.. కాళేశ్వరంలో 18.25 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ ప్రాజెక్టు నీళ్ల తోనే ఇంకో 18 లక్షల ఎకరాల ఆయకట్టును క్రమబద్ధీకరిస్తారు. ప్రాణహిత ప్రాజెక్టులో రిజర్వాయర్ల కెపాసిటీ 14.7 టీఎంసీలు. కాళేశ్వరం ప్రాజెక్టులో వాటి సామర్థ్యాన్ని 141 టీఎంసీలకు పెంచారు. ప్రాణహిత ప్రాజెక్టులో ఎల్లంపల్లికి ఒక స్టేజీలోనే నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా.. మేడిగడ్డ నుంచి 3 స్టేజీల్లో ఎత్తిపోయాల్సి ఉంటుంది. తమ్మిడిహెట్టి ఒక్కటే బ్యారేజీ కాగా.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, మూడు పంపుహౌస్‌ల నిర్మాణంతో ఖర్చు పెరిగింది. ప్రాణహిత పంపింగ్ కెపాసిటీ 1.8 టీఎంసీలేకాగా మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు మూడు టీఎంసీలను లిఫ్ట్ చేయడానికి పనులు చేపట్టారు. ప్రాణహిత-చేవెళ్ల లిఫ్టు కరెంట్ ఖర్చుకు రూ.1,010 కోట్లు. ఇప్పుడు కాళేశ్వరం కోసం రూ.3 వేల కోట్లు కేటాయించింది. రిజర్వాయర్ల కెపాసిటీ పెరగడంతో భూసేకరణ వ్యయం భారీగా పెరిగింది. ఉమ్మడి ఏపీలో భూసేకరణ కోసం ఎకరానికి రూ.2 లక్షలే ఇవ్వగా.. కాళేశ్వరం ముంపు భూములకు ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు చెల్లిస్తున్నారు. ప్రాణహిత భూసేకరణకు రూ.1,071 కోట్లు కేటాయించగా.. కాళేశ్వరం భూసేకరణ కోసం రూ.6,085 కోట్లు కేటాయించారు.
For More News..