తెలంగాణ లీడర్ల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి

తెలంగాణ లీడర్ల సిఫార్సు లేఖలకు  టీటీడీ అనుమతి
  • సీఎం రేవంత్, టీటీడీ చైర్మన్ ప్రతిపాదన అంగీకరించిన  ఏపీ సీఎం చంద్రబాబు

హైదరాబాద్, వెలుగు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల అనుమతిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై సీఎంతో చర్చించారు. తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని టీటీడీ చైర్మన్ ప్రకటించారు. 

తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారానికి ఏవైనా రెండు రోజులు (సోమవారం నుంచి గురువారం వరకు) వీఐపీ బ్రేక్ దర్శనానికి రూ.500, సంబంధించి రెండు లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి రూ.300 సంబంధించి రెండు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. తిరుమల దర్శనాల్లో ప్రాధాన్యం దక్కడం లేదని తెలంగాణ ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో మాదిరిగానే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇచ్చే సిఫార్సు లేఖలకు అనుమతి ఇవ్వాలని ఏపీ సీఎంకు లేఖ రాశారు. 

తెలంగాణ ప్రజలకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారితో వందల ఏండ్లుగా విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందని, ఇక్కడి నుంచి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని అందులో పేర్కొన్నారు. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు రిప్లే ఇచ్చారు.  ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించాలనే  తెలంగాణ సీఎం ప్రతిపాదనను  పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ పంపించారు. తెలుగు జాతి సత్సంబంధాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లండించారు.

ఏపీ సీఎంకు కృతజ్ఞతలు  

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు  లేఖలను అనుమతించడానికి ఆదేశాలిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.   శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,  స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లు ఈ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేశారు. 

 ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు సోమవారం పత్రిక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. తిరుమలలో తెలంగాణ భక్తులకు ప్రత్యేక దర్శనం కోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొనసాగిన  కృషి ఫలించిందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. తిరుమల దర్శన సౌకర్యాన్ని తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుక అని ఆమె అభివర్ణించారు.