తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్​లో ప్రత్యేక కేటాయింపుల్లేవ్​

తెలంగాణకు గుండు సున్నా.. కేంద్ర బడ్జెట్​లో ప్రత్యేక కేటాయింపుల్లేవ్​
  • విభజన హామీల్లో ఏపీకి సై.. తెలంగాణకు నై
  • సింగరేణి, ఐఐటీహెచ్​ వంటి సంస్థలకు కేటాయింపుల్లో కోత
  • బడ్జెట్​లో తెలంగాణ ఊసే ఎత్తని ఆర్థిక మంత్రి నిర్మల 
  • ఇక రెగ్యులర్ ​పన్నుల వాటా.. సెంట్రల్ ​స్పాన్సర్డ్​ స్కీములే దిక్కు
  • కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా రూ.26,216 కోట్లు

హైదరాబాద్, వెలుగు: కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి గుండు సున్నా దక్కింది. తెలంగాణ ప్రజలు ఇటీవల ఎన్నికల్లో బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినా.. మొండి చెయ్యే చూపింది. ఈ సారైనా తెలంగాణకు విభజన హామీలు, నిధులు దక్కుతాయని ఎదురుచూడగా.. నిరాశే మిగిలింది.  మంగళవారం లోక్​సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క కొత్త ప్రాజెక్టు దక్కలేదు. ఎలాంటి ప్రత్యేక కేటాయింపులకు నోచుకోలేదు.  కేంద్ర సంస్థలు, నేషనల్​ఎడ్యుకేషన్​ ఇన్​స్టిట్యూట్​లాంటివాటి ఏర్పాటుకు  ప్రకటనలు రాలేదు. సుదీర్ఘ సమయంపాటు బడ్జెట్​ ప్రసంగం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ నోటివెంట తెలంగాణ అనే పదమే వినిపించలేదు.

 దీంతో ఎప్పట్లాగే  కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వచ్చే నిధులే దిక్కవనున్నాయి. కేంద్ర బడ్జెట్‌‌ లో ఏపీ రీ ఆర్గనైజేషన్‌‌ యాక్ట్‌‌ ను ప్రత్యేకంగా ప్రస్తావించినా..  ఏపీ రాజధానికి, ఆ రాష్ట్రంలోని వెనకబడిన జిల్లాలకు, పోలవరం ప్రాజెక్టుకు వేల కోట్లు కేటాయించారు తప్ప మచ్చుకైనా తెలంగాణ ప్రస్తావన లేదు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్​సర్కారు..  రాష్ట్ర అవసరాల రీత్యా ఎన్డీయే సర్కారుతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నది. ఎన్నికల వరకే రాజకీయాలని, తమకు తెలంగాణ అవసరాలే ప్రయారిటీ అని ఇప్పటికే పలుసార్లు సీఎం రేవంత్​రెడ్డి స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఇటీవల సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు.. దఫదఫాలుగా ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులను కలిసి  విభజన హామీలు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, కేంద్ర విద్యాసంస్థలపై  వినతి పత్రాలు ఇచ్చారు.  

కానీ పూర్తిస్థాయి బడ్జెట్​లో కేంద్రం రాష్ట్రానికి మొండిచెయ్యే చూపింది. కేంద్ర బడ్జెట్‌‌ లో తెలంగాణకు సంబంధించిన ఏకైక అంశం హైదరాబాద్‌‌ – బెంగళూరు ఇండస్ట్రియల్‌‌ కారిడార్‌‌. దీనికి ఆర్థిక తోడ్పాటునందిస్తామని కేంద్రం వెల్లడించింది. ఇది కూడా ఏపీకి మేలు చేసేందుకేననే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఏపీలోని వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర కోస్టల్‌‌ ఏరియాకు బ్యాక్‌‌ రీజియన్‌‌ గ్రాంట్స్‌‌ అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చిన కేంద్ర సర్కారు..  తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఇదే కోటాలో నిధులు ఇవ్వాలని కాంగ్రెస్​ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని  పట్టించుకోలేదు.  పాలమూరు-–రంగారెడ్డి ప్రాజెక్టును ఏఐబీపీ స్కీమ్​లో కూడా పరిగణనలోకి తీసుకోలేదు. 

కేంద్ర పన్నుల్లో వాటాతోనే సరి

కేంద్రం ప్రవేశపెట్టిన  బడ్జెట్ ప్రకారం  ఈ ఆర్థిక సంవత్సరం (2024–25)లో రాష్ట్రానికి కేంద్ర పన్నుల వాటాలో రూ.26,216  కోట్లు రానున్నాయి. నిరుడితో పోలిస్తే కేంద్ర పన్నుల వాటా రూ.2 వేల కోట్లపైనే ఎక్కువ వస్తున్నది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ, ఇన్​కమ్ ట్యాక్స్, సీజీఎస్టీ, కస్టమ్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్‌‌‌‌ల ద్వారా కేంద్రానికి సమకూరే ఆదాయంలో రాష్ట్రాలకు 12.47 లక్షల కోట్లను పంపిణీ చేయనున్నది. 

అందులో నిర్ణీత వాటా ప్రకారం 2.102% నిధులు.. అంటే రూ.26,216 కోట్లు తెలంగాణకు వస్తాయి.  ఏటా కేంద్రం నుంచి పన్నుల వాటాతోపాటు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్‌‌‌‌ల నిధులు రాష్ట్రాలకు అందుతాయి. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి రాష్ట్రాలకిచ్చే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (సీఎస్​ఎస్) నిధులు ఈ సారి రూ.14,300 కోట్ల మేర వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ నిధులు కూడా ఉండనున్నాయి. 

15వ ఆర్థిక సంఘం స్థానిక సంస్థల గ్రాంట్లతోపాటు హెల్త్ గ్రాంట్, స్టేట్ స్పెసిఫిక్ గ్రాంట్లు, ఇతర నిధులన్నీ కలిపితే  కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్​ రూ.3,500   కోట్ల మేర ఉండనుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,400  కోట్ల మేర గ్రాంట్ రిలీజ్ కానున్నది. ఈ ఏడాది హెల్త్ గ్రాంట్ కింద రూ.462 కోట్లు, డిజాస్టర్ మేనేజ్‌‌‌‌‌‌మెంట్ కింద రూ.495 కోట్లు రానున్నాయి. 

ఎన్నో అడిగినా.. ఒక్కటీ పట్టించుకోలే

ఖమ్మం జిల్లాలో స్టీల్‌‌ ప్లాంటు ఏర్పాటు, కాజీపేటలో రైల్వే కోచ్‌‌ ఫ్యాక్టరీ, పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు,  హైదరాబాద్‌‌ చుట్టూ రీజినల్​రింగ్​రోడ్డు (ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌)కు చేయూత, మెట్రో రైలు రెండోదశ ప్రాజెక్టుకు ఆర్థికసాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అడిగినా కేంద్రం పట్టించుకోలేదు. మూసీ రివర్‌‌ ఫ్రంట్‌‌ ప్రాజెక్టుకు సాయం,  హైదరాబాద్‌‌ సమీపంలో మల్టీ మోడల్‌‌ లాజిస్టిక్‌‌ పార్క్‌‌ ఏర్పాటు, ఇన్ఫర్మేషన్‌‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌‌మెంట్‌‌ రీజియన్‌‌(ఐటీఐఆర్‌‌) ప్రాజెక్టుకు సమ్మతి, కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో నవోదయ విద్యాలయాల ఏర్పాటు,  వరంగల్‌‌ జిల్లా ధర్మసాగర్‌‌ మండలం ఎలకుర్తిలో సైనిక్‌‌ స్కూల్‌‌ స్థాపన,  కరీంనగర్‌‌, జనగాం జిల్లాల్లోనూ లెదర్‌‌ పార్కుల ఏర్పాటు కోసం వినతులిచ్చినా మోదీ సర్కారు కరుణించలేదు.  

హైదరాబాద్‌‌లో ఐఐఎం ఏర్పాటు,  హైదరాబాద్‌‌ నుంచి కరీంనగర్‌‌ వెళ్లే రాజీవ్‌‌ రహదారి, నాగ్‌‌పుర్‌‌ వెళ్లే జాతీయ రహదారిపై నగరం నుంచి ఎలివేటెడ్‌‌ కారిడార్ల నిర్మాణానికి నిధులు, హైదరాబాద్‌‌–కల్వకుర్తి హైవేను నాలుగు వరుసలకు విస్తరించడానికి నిధులు, భారత్‌‌మాల పరియోజన కింద తెలంగాణలో ఎనిమిది రోడ్లను జాతీయ రహదారులుగా గుర్తింపు, స్మార్ట్‌‌ సిటీ మిషన్‌‌ కింద వరంగల్, కరీంనగర్‌‌ నగరాలకు నిధులు, రాష్ట్ర నార్కొటిక్స్‌‌ బ్యూరో ఆధునికీకరణకు ఆర్థిక సాయం వంటివి రాష్ట్రం ప్రత్యేకంగా కోరినా కేంద్రం బడ్జెట్​లో వీటి ఊసే ఎత్తలేదు. 

సింగ‌‌రేణి, ఐఐటీహెచ్​కు కేటాయింపుల్లో కోత

బడ్జెట్​లో ఐఐటీ హైద‌‌రాబాద్​కు కేటాయింపుల్లో కేంద్రం భారీ కోత విధించింది. గ‌‌త ఆర్థిక సంవత్సరం రూ.522.71 కోట్లు కేటాయించ‌‌గా, తాజా బడ్జెట్​లో కేవలం రూ.122 కోట్లు మాత్రమే ప్రతిపాదించింది. 400.71 కోట్లు కోత పెట్టింది. హైద‌‌రాబాద్‌‌లోని నేష‌‌న‌‌ల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ రూరల్ ​డెవలప్​మెంట్ ​అండ్​ పంచాయతీరాజ్​కు కూడా  కోత విధించింది. గ‌‌త బ‌‌డ్జెట్‌‌లో రూ.91.38 కోట్లు కేటాయించ‌‌గా, ప్రస్తుత బడ్జెట్‌‌లో రూ.10.84 కోట్లు ఇచ్చింది. రూ.80.54  కోట్లు
కోత పెట్టింది. ఇక సింగ‌‌రేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌‌సీసీఎల్‌‌)కు కేటాయింపుల్లో కేంద్రం కోత విధించింది. గ‌‌త బ‌‌డ్జెట్‌‌లో రూ.1,650 కోట్లు కేటాయించ‌‌గా,  ప్రస్తుత బ‌‌డ్జెట్‌‌లో రూ.1,600 కోట్లతో సరిపెట్టింది. అంటే గతంతో పోల్చితే రూ.50 కోట్లు కోత విధించింది. ఈ మొత్తం కలిపి దాదాపు 530 కోట్ల కోత పడింది. అయితే, హైద‌‌రాబాద్‌‌లోని అటామిక్ మినరల్స్ అన్వేష‌‌ణ‌‌, రీసెర్చ్ డైరెక్టరేట్‌‌కు గ‌‌త బ‌‌డ్జెట్‌‌లో రూ.340.48 కోట్లు ఇవ్వగా, ఈ బ‌‌డ్జెట్‌‌లో స్వల్పంగా పెంచి రూ.352.18 కోట్లు కేటాయించారు.