చారిత్రక ప్రదేశాల్ని నేరుగా చూస్తేనే థ్రిల్లింగ్ ఉంటుంది. అక్కడి శిల్పాలు.. కట్టడాలు చూస్తూ ఆ ప్రాంత చరిత్రను ఒకసారి గుర్తు చేసుకోవచ్చు. ఇప్పుడు అలాంటి ప్రాంతమే తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. కాకతీయుల నాటి కోట గుళ్లు.. దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర ముక్తేశ్వర స్వామి గుడి ఈ జిల్లాలోనే ఉంది.అంతే కాకుండా మహాభారత కాలంనాటివిగా చెప్పే పాండవుల గుహలు కూడా ఇక్కడే ఉన్నాయి, కాళేశ్వరం ప్రాజెక్ట్ తో పాటు... నల్ల బంగారం దొరికే సింగరేణి బొగ్గు గనులు కూడా ఇక్కడే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఇప్పుడు ఆ ప్రాంత విశేషాలను వివరంగా తెలుసుకుందాం. ..
తెలంగాణలో ఉన్న పురాతన దేవాలయాల్లో కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం ఒకటి. గోదావరి, ప్రాణహిత, సరస్వతి అనే మూడు పుణ్య నదులు ఇక్కడ కలుస్తాయి. అందుకే దీనిని త్రివేణీ సంగమం అని కూడా అంటారు, దక్షిణ కాశీగా ఈ ప్రాంతం ప్రసిద్ది చెందింది. గర్భగుడిలో ఒకే బండమీద రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత.
ఈ దేవాలయంలో శివుడు ముక్తేశ్వరుడుగా... యమధర్మరాజు కాళేశ్వరుడిగా పూజలందుకుంటారు. దీనికి ఓ పురాణ గాథ కూడా ఉందా. ముక్తేశ్వర స్వామిగా ముక్తిని ప్రసాదిస్తున్న పరమశివుడిని యమధర్మరాజు వేడుకున్నాడట. దీంతో శివుడి యమధర్మరాజును తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడని స్థల పురాణం చెబుతుంది. ఇక్కడ ఉన్న ముక్తేశ్వర లింగానికి రెండు రంధ్రాలు ఉంటాయి. ఒక రంధ్రంలో ఎన్ని నీళ్లు పోసినా నిండకపోవడం ఇక్కడ కనిపించే అద్భుతం. ఆ శివలింగం రంధ్రంలో పోసిన నీళ్లు గోదావరిలో కలుస్తాయని అక్కడి వాళ్లు చెబుతుంటారు.
పాండవుల గుట్టలు
రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో పాండవుల గుట్టలు ఉన్నాయి. పాండవులు అరణ్యవాసం చేసేటప్పుడు ఇక్కడ కొంతకాలం ఉన్నారట. అందుకనే వీటికి పాండవుల గుహలు.. పాండవుల గుట్ట అని పేరు వచ్చింది. ఈ గుహలు ఉత్తరం నుంచి దక్షిణం దిక్కువైపు వరుసగా ఉంటాయి. ఇక్కడున్న గోడలు, సీలింగ్ పై ప్రాచీన, మధ్య రాతియుగం నాటి బొమ్మలు కనిపిస్తాయి. ఆదిమానవులు జంతువులను వేటాడటం కోసం ఉపయోగించిన కత్తులు, ఈటెలు, విల్లులు, బాణం, బొమ్మల్ని ఇక్కడ చూడొచ్చు. ఈగుహల్లోని కొన్ని జాగాలను మేకలబండ, ముంగిసబండ, వరాహపర్వతం, పులి పర్వతం, యానాదుల గుహ, కుంతీదేవి, పంచపాండవులు .. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. అడ్వెంచర్స్ స్పోర్ట్స్ ను ఇష్టపడేవారు ఇక్కడ కొండలు ఎక్కుతుంటారు.
16వ శతాబ్దం నాటి దేవాలయం
చిట్యాల మండలం నైన్పాక గ్రామంలో 16 వశతాబ్దంలో నిర్మించిన దేవాలయం కలదు. ఇది సర్వటోభద్ర వాస్తు శిల్పానికి నమూనా. అంటే ఈ గుడికి నాలుగు వైపులా నాలుగు దేవతా విగ్రహాలు ఉంటాయి. తూర్పున యోగ ముద్రలో కూర్చున్న ఉగ్ర నరసింహుడు, దక్షిణ దిక్కున వేణుగోపాలస్వామి, ఉత్తరం వైపు శ్రీరాముడు, పడమరలో బలరాముడి విగ్రహాలు ఉన్నాయి. దక్షిణ భారత దేశంలో సర్వటోభద్ర వాస్తు శైలిలో కట్టిన గుడి ఇది ఒక్కటే. 50 అడుగుల ఎత్తైన గోపురం పై భాగాన్ని ఇటుకలతో కింది భాగాన్ని గులాబీ రంగు రాళ్లతో కట్టారు.
13వ శతాబ్దం నాటి గణపేశ్వర ఆలయం
కాకతీయుల శిల్పకళకి సాక్ష్యంగా నిలిచే కట్టడాల్లో ఘన్ పూర్ కోటగుళ్లు చెప్పుకోదగినవి. వీటిని 13వ శతాబ్దం తొలి రోజుల్లో గణపతి దేవుడు కట్టించారని చెబుతుంటారు. ఇక్కడ ఉండే ప్రధాన గుడిని గణపేశ్వర ఆలయం అంటారు. ఇందులో శివుడు కూడా కొలువై ఉంటాడు. ప్రధాన ఆలయం చుట్టే ఒకప్పడు 22 చిన్న గుళ్లు ఉండేవి. ప్రతి గుడి సైజు, డిజైన్ వేరు వేరుగా ఉండటం కోటగుళ్ల ప్రత్యేకత. ఒక రాతి స్థంభంపై చెక్కిన ఏనుగు మీద సవారీ చేస్తున్న సగం మనిషి, సగం సింహం ఆకారంలో ఉన్న శిల్పాలు భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
ఎలా వెళ్లాలంటే..
హైదరాబాద్ నుంచి 212 కిలోమీటర్ల దూరంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. వరంగల్ నుంచి 60 కిలోమీటర్లు జర్నీ చేస్తే కోటగుళ్లు చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు 140 కిలో మీటర్లు. పాండవుల గుట్టకు వెళ్లాలంటే జిల్లా కేంద్రం నుంచి దాదాపు 23 కిలో మీటర్లు జర్నీ చేయాలి. . ..