తెలంగాణ భవన్‌‌ ముట్టడికి కాంగ్రెస్​నేతల యత్నం

తెలంగాణ భవన్‌‌ ముట్టడికి కాంగ్రెస్​నేతల యత్నం

హైదరాబాద్, వెలుగు: మహిళా మంత్రిని అవమానించే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం తగదని, బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కొందరు సోమవారం బంజారహిల్స్‌‌లోని బీఆర్ఎస్‌‌ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. మంత్రి కొండా సురేఖను ఎంపీ రఘునందన్ రావు సన్మానించిన ఫొటోను బీఆర్ఎస్ శ్రేణులు ట్రోల్ చేయడాన్ని వారు ఖండించారు. 

తెలంగాణ భవన్ ఎదుట నిరసన తెలపడంతోపాటు కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు ప్రయత్నించారు. వారిని బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపేందుకు వచ్చిన క్రమంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇది కరెక్ట్ కాదు: హరీశ్‌‌రావు

సోషల్ మీడియాలో మంత్రి కొండా సురేఖను ట్రోల్ చేయడాన్ని బీఆర్‌‌‌‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌‌రావు ఖండించారు. ‘‘మహిళలను గౌరవించడం మనందరి బాధ్యత. వారి పట్ల అగౌరవంగా ప్రవర్తించడాన్ని ఏ ఒక్కరూ సహించరు’’అని హరీశ్‌‌రావు ట్వీట్ చేశారు.