- వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు కసరత్తు
- 11న ఢిల్లీకి మంత్రి ఉత్తమ్, ఈఎన్సీలు
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజ్డ్యామేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) ఫుల్ రిపోర్ట్‌ను తెప్పించుకునేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. రిపోర్టు ఇవ్వడంలో ఆలస్యం చేస్తుండడంతో ఎన్డీఎస్ఏపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఎన్డీఎస్ఏ చైర్మన్‌కు జ్యుడీషియల్ కమిషన్ కూడా గతంలో సూచించింది. ఈ నేపథ్యంలోనే 11న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు ఢిల్లీకి వెళ్లి ఎన్డీఎస్ఏ అధికారులతో భేటీ కాబోతున్నట్టు సమాచారం.
టెస్టులు లేటవుతున్నయ్
ఈ ఏడాది మార్చిలో చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ ఇంజినీర్లు, ఇరిగేషన్ అధికారులను విచారించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలనూ పరిశీలించింది. తర్వాత మేలో మూడు బ్యారేజీలకు సంబంధించి మధ్యంతర నివేదిక ఇచ్చింది. వర్షాకాలం అంతా మూడు బ్యారేజీల గేట్లనూ ఎత్తిపెట్టాల్సిందేనని రిపోర్టులో పేర్కొంది. రిపేర్లు చేసేందుకు మరిన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందనీ సూచించింది. జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులు చేయాల్సిందిగా పేర్కొంది.
ఫుల్ రిపోర్ట్ కోసం ఎన్డీఎస్ఏని పలుమార్లు అధికారులు కోరినా ఆ టెస్టులు పూర్తయితేగానీ.. రిపోర్ట్‌ను ఇవ్వలేమని ఎన్డీఎస్ఏ స్పష్టం చేస్తున్నట్టుగా తెలిసింది. అయితే, ప్రస్తుతం బ్యారేజీల వద్ద టెస్టులు కొనసాగుతున్నాయని, ఫ్లడ్ సీజన్ కావడంతో కొన్ని టెస్టులు చేయడానికి వీలుపడడం లేదని అధికారులు చెబుతున్నారు. ఆ టెస్టులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆ రిపోర్టులను ఎన్డీఎస్ఏకి అందజేస్తామని అంటున్నారు.
విజిలెన్స్ వేగం పెంచడంతో..
బ్యారేజ్ డ్యామేజ్‌పై ఫుల్ రిపోర్ట్ ఇచ్చేందుకు ఇప్పటికే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా వేగం పెంచింది. వరుసగా అధికారులను విచారిస్తున్నది. ఒకట్రెండు నెలల్లో పూర్తి స్థాయి నివేదికను సిద్ధం చేయనుంది. ఈ క్రమంలోనే ఎన్డీఎస్ఏ రిపోర్టును కూడా వీలైనంత త్వరగా తెప్పించుకునేందుకు సర్కారు ప్రయత్నాలు చేస్తున్నది. రిపోర్ట్ ఆలస్యం వల్ల కమిషన్ విచారణపై ప్రభావం పడుతుందన్న సర్కారు భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆ నివేదికలను తొందరగా తెప్పించుకొని కమిషన్ ఎంక్వైరీని త్వరగా పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నది.