- ఎత్తిపోసిన 6 టీఎంసీలూ కిందికే
- కరువున్నా, వానలున్నా ...
- కాళేశ్వరం నీళ్లు బంగాళాఖాతానికే!
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : ఈ ఏడాది కూడా జూన్నుంచి ఇప్పటి వరకు వెయ్యి టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రం పాలయ్యాయి. కరువు ఉంటే కాళేశ్వరం విలువ తెలుస్తుందని సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు ఈసారీ నిజం కాలేదు. అటు జూన్‌లో, తర్వాత ఆగస్టులో రెండుసార్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కాళేశ్వరం ద్వారా చుక్కనీరును సర్కారు ఎత్తిపోసింది లేదు. పంటలకు అందించిందీ లేదు. తీవ్ర విమర్షల
నేపథ్యంలో జూలైలో 6 టీఎంసీలు ఎత్తిపోసినా ఆ తర్వాత వర్షాలు పడి లిఫ్టు చేసిన నీళ్లన్నీ కిందికే వదిలేశారు. ఈ లెక్కన కరువున్నా, వానలున్నా కాళేశ్వరం నీళ్లు మాత్రం పోయేది బంగాళాఖాతానికేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎత్తిపోసిన 6 టీఎంసీలు కిందికే..
రాష్ట్రంలో జూన్ నెలలో సరిగ్గా వానలు పడలేదు. దీంతో వరి నాట్లు లేటయ్యాయి. పత్తి, మొక్కజొన్న ఇతర పంటలకు నీళ్లులేక ఎండిపోయాయి. ఈ టైంలో ఎత్తిపోద్దామంటే మేడిగడ్డ వద్ద నీళ్లు లేవు. జూలైలో భారీ వర్షాలు పడడంతో ఆ నెల 3న కాళేశ్వరం ప్రాజెక్ట్ మోటార్లను ఆఫీసర్లు ప్రారంభించారు. రోజుకు రెండు టీఎంసీల చొప్పున లిఫ్టు చేసే చాన్స్ ఉన్నా కేవలం ఒక టీఎంసీ చొప్పున నీళ్లు ఎగువకు లిఫ్ట్ చేస్తామని ప్రకటించారు.
Also Raed :- తొలి పూజకు వేళాయే.. అన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవ కమిటీ
తీరా17 మోటార్లలో కేవలం ఏడు మోటార్లను మాత్రమే నడిపారు. పది రోజులకు పైగా మోటార్లను నడిపి ఆరు టీఎంసీల నీళ్లను మాత్రమే అన్నారం బ్యారేజీకి లిఫ్ట్ చేశారు. అన్నారం నుంచి సుందిళ్ల, సుందిళ్ల నుంచి ఎల్లంపల్లి, ఎల్లంపల్లి నుంచి లింక్‒2లో ఏర్పాటు చేసిన రిజర్వాయర్లలోకి కూడా నీళ్లను మోటార్ల సహాయంతో లిఫ్ట్ చేశారు. ఎస్సారెస్పీలోనూ అర టీఎంసీని ఎత్తిపోసినట్లు చెప్పారు. ఆ వెంటనే భారీ వర్షాలు పడడంతో గోదావరి బేసిన్‌లోని అన్ని బ్యారేజీల గేట్లను తెరిచి నీళ్లను కిందికి వదిలేశారు.
ఆగస్టులో కరువున్నా నీళ్లియ్యలేని పరిస్థితి..
జూలైలో భారీ వర్షాలు కురిసినా ఆగస్టులో వానల జాడ లేక సుమారు 10 లక్షల ఎకరాల్లో మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. వేలాది ఎకరాల్లో వరి పొలాలు నెర్రెలుబాశాయి. వీటిలో కాళేశ్వరం కొత్త ఆయకట్టు పరిధిలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వరంగల్, సూర్యాపేట, కామారెడ్డి లాంటి జిల్లాలున్నాయి. కాళేశ్వరం ద్వారా 20 లక్షల కొత్త ఆయకట్టును స్థిరీకరిస్తామని సర్కారు చెప్పినా నేటికీ ఆయా జిల్లాల్లో వివిధ ప్యాకేజీల కింద కెనాల్స్, పైపులైన్ పనులు పూర్తికాకపోవడం వల్ల నీళ్లున్నా వాడుకోలేని పరిస్థితి తలెత్తింది. జూలైలో కురిసిన వర్షాలకు ఎస్సారెస్పీ సహా గోదావరిపై ఉన్న ప్రాజెక్టులన్నీ నిండాయి కాబట్టి ఇక్కడి పంటలకు ఎలాంటి డోకా లేకుండా పోయింది. అదే కృష్ణాలో వాటర్లేకపోవడంతో నాగార్జున సాగర్కింద లక్షల ఎకరాలు బీడు భూములుగా మిగిలాయి. దీన్ని బట్టి ప్రస్తుతం కోటి ఎకరాల్లో పండుతున్న పంటలు వర్షాల వల్లే తప్ప సర్కారు చెప్తున్న కాళేశ్వరం వల్ల కాదని స్పష్టమవుతోంది.
బంగాళాఖాతం వైపు వెయ్యి టీఎంసీలు
జూలై 12వ తారీఖు నుంచి మేడిగడ్డ బ్యారేజీ గేట్లను కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారులు ఓపెన్ చేసి పెట్టారు. ప్రస్తుతం 85 గేట్ల నుంచి గోదావరి, ప్రాణహిత నుంచి వచ్చిన వరద వచ్చినట్లే కిందికి పోతోంది. రెండు నెలలుగా ఇదే పరిస్థితి. ప్రస్తుత వానలకు మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 4.1 లక్షల క్యుసెక్కుల ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో నమోదవుతోంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఇప్పటి వరకు వెయ్యి టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి సముద్రం పాలయ్యాయని, ఇందులో ఒక్క టీఎంసీని కూడా మనం ఎత్తిపోసుకోలేకపోయామని ఇంజినీర్లు వాపోతున్నారు.