మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు.. ప్రణాళికతో చదివితే.. ‘టెన్త్​’లో పది జీపీఏ సాధ్యమే

మార్చి 21 నుంచి టెన్త్ పరీక్షలు.. ప్రణాళికతో చదివితే.. ‘టెన్త్​’లో పది జీపీఏ సాధ్యమే

మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు అందరూ పక్కా ప్రణాళికతో చదివితే పదవ తరగతిలో 10 జీపీఏ సాధించవచ్చు. కేవలం రెండు వారాలు   మాత్రమే ఉన్నందున విద్యార్థులందరూ ఇప్పటికే ప్రిపరేషన్ దాదాపుగా పూర్తి చేసి ఉన్నారు. కానీ, పరీక్షల సమీపిస్తున్న కొద్దీ విద్యార్థులలో ఒక రకమైన భయాందోళన, ఆత్రుత కలుగుతుంది. వాటిని దూరం చేసుకోవాలి. విద్యార్థి తనకు తానుగా ఒక చక్కటి ప్రణాళికను రూపొందించుకొని పూర్తిగా ఎగ్జామినేషన్ పాయింట్ అఫ్ వ్యూలో చదివినట్లయితే సులభంగా అనుకున్న జీపీఏ  సాధిస్తారు.

ఎక్కువ సమయం లేనందున విద్యార్థులు ప్రతి సబ్జెక్ట్  పాఠ్య పుస్తకంలో యూనిట్ వెనకాల ఉన్న అభ్యాసాలను ఒకసారి పునశ్చరణ  చేసుకోవాలి. అంతే కాకుండా పార్ట్–బీకి సంబంధించిన అంశాలను పూర్తిగా అవలోకనం చేసుకోవాలి. ముఖ్యంగా ఉదయం పూట మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ సబ్జెక్టులను చదువుతూ, సాయంకాలం సమయంలో  తెలుగు, హిందీ, సాంఘిక శాస్త్రాలను చదువుకోవాలి. ఈ రెండు వారాల సమయంలో తప్పనిసరిగా పార్ట్– బీకి సంబంధించిన ప్రశ్నలను అన్ని సబ్జెక్టులవారీగా రివిజన్​ చేసుకోవాలి. ఇందులోనే విద్యార్థి ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.

విద్యార్థి తాను ఇంతకుముందు ప్రిపేర్ అవుతున్నప్పుడు గీత గీసినటువంటి ముఖ్యాంశాలను,  కీ వర్డ్స్ ను ఒకసారి మళ్లీ సరి చూసుకుంటూ ప్రతి సబ్జెక్టువారీగా సమాధానాలను సొంతంగా రాసేటట్టు ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా ఉపాధ్యాయుడు చెప్పిన ముఖ్యమైన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు కృషి చేయాలి. అంతేకాకుండా ఇంతకు  ముందున్న ప్రాక్టీస్ పేపర్లు మరియు ప్రీ ఫైనల్ పరీక్ష పత్రాలను కూడా మరొకసారి సరిచూసుకొని ప్రశ్నల తీరు తెన్నులు ఏవిధంగా ఉన్నాయో విద్యార్థి గ్రహించుకోవాలి. వాటికి అనుగుణంగానే విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి. ఇలా చేస్తే విద్యార్థికి పరీక్షల్లో ఎక్కువ మార్కులు వచ్చే ఆస్కారం ఉన్నది.

ధ్యానంతో ఒత్తిడి దూరం
పరీక్షల సమయంలో విద్యార్థి  పౌష్టికాహారం తీసుకుంటూ, మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి ఉదయం వేళ ధ్యానం తప్పనిసరిగా చేయాలి. తద్వారా విద్యార్థికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షలు అంటే భయం పూర్తిగా తొలగిపోతుంది పరీక్షల సమయం కాబట్టి తల్లిదండ్రులు కూడా విద్యార్థులకు పూర్తిగా సహకరించి వారి ధ్యాస పూర్తిగా చదువు మీద ఉండేలా చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది.

పాఠశాలల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఇచ్చే కెరీర్  గైడెన్స్,  కౌన్సెలింగ్ వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా తోడ్పడుతుంది. మోటివేషన్ ప్రత్యేక తరగతులను తప్పనిసరిగా నిర్వహించాలి. తద్వారా విద్యార్థులు  ప్రేరణ పొంది తమకు తాముగా పరీక్షల్లో బాగా మార్కులు సాధించడానికి కృషి చేస్తారు. ఇలాంటి చక్కటి ప్రణాళికతో విద్యార్థులు ముందుకెళ్తే పదవ తరగతిలో తను అనుకున్న లక్ష్యం 10 పాయింట్స్ సాధించే  ఆస్కారం ఉన్నది. 

యాడవరం చంద్రకాంత్ గౌడ్, తెలుగు పండిట్