
- బల్దియా బంపరాఫర్ .. ఆస్తి పన్ను వడ్డీపై 90% డిస్కౌంట్
- వచ్చే నెలలో వన్‌టైమ్ సెటిల్మెంట్ ఇచ్చే చాన్స్
- ప్రభుత్వ అనుమతి కోసం లెటర్
- సర్కార్ నుంచి రావాల్సిన పన్ను బకాయిలు రూ.3వేల కోట్లు
- జనం కట్టాల్సింది రూ.2,500 కోట్లు
- 10 శాతం వడ్డీతో తీసుకున్నా రూ.1,150 కోట్ల రాబడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్బకాయిల వసూళ్ల కోసం జీహెచ్ఎంసీ మరోసారి వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్ (ఓటీఎస్) తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన వచ్చిన తర్వాత స్కీమ్ కి సంబంధించిన అనుమతుల కోసం లెటర్ రాయనుంది. పర్మిషన్రాగానే, వచ్చే నెల నుంచే ఓటీఎస్ అమలుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రాపర్టీ ట్యాక్స్వడ్డీపై 90 శాతం రాయితీ ఇవ్వనుంది.
ఆదాయం తగ్గినప్పుడల్లా..
బల్దియా ఆదాయం తగ్గినప్పుడల్లా వన్ టైమ్ సెటిల్ మెంట్ స్కీమ్అమలు చేస్తోంది. మొదటిసారి 2020లో ఓటీఎస్ ను తీసుకువచ్చింది. 2020 ఆగస్టు1 నుంచి నవంబర్ 15 వరకు అమలు చేయగా, 2022 జులైలో రెండోసారి తీసుకువచ్చింది. ఈ రెండు సార్లు కలిపి జీహెచ్ఎంసీ కి రూ.700 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 మార్చిలో ఓటీఎస్‌ద్వారా రూ.320 కోట్లు రాబట్టుకుంది. ఈసారి కూడా నిధుల సమస్య వేధిస్తుండడంతో ఓటీఎస్తీసుకురావాలని భావిస్తున్నది. ఇందులో భాగంగా ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేయనుంది. ఆస్తి పన్ను బకాయిదారులు కేవలం 10 శాతం వడ్డీతో చెల్లిస్తే సరిపోతుంది. 2024లో ట్యాక్స్‌కట్టకుండా పెండింగ్పెట్టిన వారికి ఇప్పుడు ఓటీఎస్ఇచ్చి కనీసం రూ.500 కోట్లు వసూలు చేయాలని భావిస్తోంది.
సర్కారు నుంచి స్టాంప్ డ్యూటీ వచ్చినా..
ఇటీవల ప్రభుత్వం స్టాంపు డ్యూటీ బకాయిలు రూ.3,030 కోట్లను రిలీజ్చేసి పర్సనల్ డిపాజిట్స్(పీడీ) అకౌంట్ లో జమ చేసింది. ఈ నిధులను రెవెన్యూ ఖర్చుల కోసం మాత్రమే ఉపయోగించుకునే వీలుంది. డెవలప్ మెంట్ కోసం ఒకేసారి వాడుకునే అవకాశం లేదు. దీంతో జీతాలు, మెయింటెనెన్స్, లోన్ల రీ పేమెంట్స్ కోసం వాడుకోనుంది. పనుల కోసం డబ్బులు లేకపోవడం, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చేందుకు కూడా ఇబ్బందులు ఉండడంతో మరోసారి ఓటీఎస్‌ను తీసుకురావాలని ప్లాన్చేస్తోంది.
బకాయిలు రూ.4 వేల కోట్లు
గ్రేటర్ లో ఆస్తి పన్ను బకాయిలు రూ.4 వేల వేల కోట్ల వరకు ఉండగా, ఇందులో ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు రూ.3 వేల కోట్లు ఉన్నాయి. మిగతా రూ. వెయ్యి కోట్లు గ్రేటర్‌లోని సుమారు 2 లక్షల మంది నుంచి రావాల్సి ఉంది. ఈ బకాయిలకి ఇంట్రెస్ట్ కలిపితే రూ.2,500 కోట్ల వరకు అవుతోంది. ఓటీఎస్‌ద్వారా 90 శాతం వడ్డీ మాఫీ చేస్తే రూ.1,150 కోట్ల వరకు వస్తుంది. అయితే ఎంత మంది ఈ స్కీమ్ ని వినియోగించుకుంటారన్న దానిపై బల్దియా ఇన్‌కం ఆధారపడి ఉంటుంది.
ఈ ఏడాది భారీ ఆదాయం
ప్రాపర్టీ ట్యాక్స్వసూళ్లలో ఐదేండ్లలో ఎన్నడూ లేనంతగా ఈ సారి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉందని బల్దియా అధికారులు అంచనా వేస్తున్నారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో రూ.1,357 కోట్లు, 2020–21లో రూ.1,633 కోట్లు, 2021–22లో రూ.1,681 కోట్లు, 2022–23 రూ.1,658 కోట్లు, 2023–24లో రూ.1,915 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. 2024–25కు సంబంధించి ఇప్పటికే రూ.1,421 కోట్లు వచ్చింది. మరో రెండు నెలలు మిగిలి ఉండడం, అందులో ఓటీఎస్కూడా అమల్లోకి రానుండటంతో గతేడాదిని మించే చాన్స్ ఉందంటున్నారు.