హైదరాబాద్‌ నగర శివార్లలో ఏటీఎంల భద్రత గాలికి.. 85 శాతం సెంటర్లలో సెక్యూరిటీ గార్డులే లేరు

హైదరాబాద్‌ నగర శివార్లలో ఏటీఎంల భద్రత గాలికి.. 85 శాతం సెంటర్లలో సెక్యూరిటీ గార్డులే లేరు
  • చాలా చోట్ల పనిచేయని సీసీ కెమెరాలు
  • అలారం సంగతి దేవుడెరుగు
  • వరుస ఘటనలతో పోలీసుల అలర్ట్​
  • త్వరలో బ్యాంకు ఆఫీసర్లతో మీటింగ్

హైదరాబాద్‌, వెలుగు: శివారుల్లోని ఏటీఎంలను  అంతర్రాష్ట్ర ముఠాలు టార్గెట్‌ చేశాయి. పోలీసులు పట్టుబడతామన్న భయం కూడా లేకుండా లక్షలకు లక్షలు దోచుకుపోతున్నాయి. ఆదివారం రావిర్యాల ఎస్​బీఐ ఏటీఎంను కొల్లగొట్టిన దొంగలు రూ. 30 లక్షలు ఎత్తుకెళ్తూ అరగంటలోనే మధుబన్​కాలనీలో మరో ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేయడం సంచలనం కలిగించింది. ఈ రెండు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ  లేకపోవడంతోనే దోపిడీకి యత్నించినట్టు తెలుస్తోంది. 

ఆర్బీఐ రూల్స్​కు అనుగుణంగా సెక్యూరిటీ లేకపోవడం, పాతకాలం నాటి మెషీన్లనే ఇంకా వాడుతుండడంతో దొంగలకు అవకాశం ఇచ్చినట్టవుతోంది. సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థ ఏర్పాటు చేయడంలోనూ బ్యాంకులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో దొంగలు రెచ్చిపోయి దోపిడీలకు తెగబడుతున్నారు. దీంతో ఏటీఎంల వద్ద భద్రత ఏర్పాటు చేసేందుకు పోలీసులు మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నారు.

సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలకే వదిలేశారు 
గ్రేటర్ హైదరాబాద్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో జాతీయ బ్యాంకులు సహా దాదాపు 12 వేలకు పైగా ఏటీఎం సెంటర్లున్నాయి. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా రోజూ సగటున రూ.5లక్షల చొప్పున క్యాష్ రీఫిల్​చేస్తుంటారు. ఆ సమయంలో మాత్రమే భద్రతపై దృష్టి పెడుతున్న బ్యాంకులు తర్వాత సెంటర్లను గాలికి వదిలేస్తున్నాయి.  సాఫ్ట్​వేర్ ​బ్రేక్ ​చేసి సైబర్ ​క్రిమినల్స్​ కొల్లగొట్టకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నా..ఫిజికల్​ అటాక్స్​ జరగకుండా మాత్రం అడ్డుకోలేకపోతున్నాయి.

ఏటీఎం సెంటర్లలో కేవలం సీసీటీవీ కెమెరాలు బిగించి, అలారం సెట్​చేసి వదిలేస్తుండడంతోఈ పరిస్థితి తలెత్తుతోంది. నగరంలో దాదాపు 85 శాతం ఏటీఎం సెంటర్స్‌ ను పరిశీలిస్తే బ్యాంకు వద్ద తప్పితే మరెక్కడా ఒక్క గార్డు కనిపించడు. కొన్ని ప్రాంతాల్లో గార్డులున్నా వారి చేతుల్లో కనీసం కర్ర కూడా ఉండదు. ఇలాంటి చోట్ల అనుకోని ఘటన జరిగితే డయల్ 100కి కాల్‌చేయడం మినహా చేసేదేమీ ఉండడం లేదు.

వీటితో పాటు చాలా సెంటర్లలో సీసీ కెమెరాలు పని చేయడం లేదు. ఉన్నచోట కూడా  తక్కువ రిజల్యూషన్ తో ఏర్పాటు చేస్తున్నారు. దొంగలు మెషీన్లు ఓపెన్ చేస్తే అప్రమత్తం చేసే అలారం సిస్టం ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా దాదాపు 85 శాతం సెంటర్లలో ఈ వ్యవస్థే లేదు. ఉన్నా చాలా చోట్ల పని చేయడం లేదు. సీసీటీవీ కెమెరాలున్న చోట స్థానిక పోలీస్‌ స్టేషన్లు, బ్యాంకులకు అనుసంధానం చేయడం లేదు.

అర్ధరాత్రే దోపిడీకి ముహూర్తం..
భద్రతా లోపాలతో ఉన్న ఏటీఎం సెంటర్లను హరియానా, బిహార్‌, యూపీ, కర్నాటకకు చెందిన ముఠాలు టార్గెట్‌ చేస్తున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని ఏటీఎంలనే దోపిడీలకు అనుకూలమైనవిగా చేసుకుంటున్నాయి. దాదాపు వారం రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో రెక్కీ నిర్వహిస్తున్న ఈ ముఠాలు ఏటీఎం, సీసీటీవీ కెమెరాలు సహా పరిసర ప్రాంతాలను క్షుణంగా పరిశీలిస్తున్నాయి. తర్వాత  దొంగలు బైక్‌ లేదా కార్లు చోరీ చేస్తున్నారు. తెల్లవారుజామున 2 గంటల నుంచి 3 గంటల మధ్య దోపిడీలకు స్కెచ్ వేస్తున్నారు.

ఫింగర్​ప్రింట్స్, డీఎన్ఏకు, ఇతర క్లూలకు  అవకాశం కల్పించకుండా చేతులకు గ్లౌజులు, ముఖానికి మంకీ క్యాపులు ధరిస్తున్నారు. సీసీటీవీ కెమెరాల వైర్లు కట్‌ చేయడం లేదా స్ప్రే చల్లి పని మొదలుపెడుతున్నారు. గ్యాస్‌కట్టర్లు, ఇనుప రాడ్లతో మెషీన్లను ధ్వంసం చేసి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. వాహనాలు వదిలి సొంత రాష్ట్రాలకు పారిపోతున్నారు. దీంతో దొంగలను పట్టుకునే విషయంలో పోలీసులకు సవాళ్లు ఎదురవుతున్నాయి. పోలీసులు గస్తీ తగ్గించడం, బ్లూకోల్ట్స్​ సిబ్బంది  ఏటీఎం సెంటర్లపై పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో దోపిడీలు రిపీటెడ్గా జరుగుతున్నాయి. 

ఫేక్​ నంబర్​ ప్లేట్​ కారుతో..
రావిర్యాల  దోపిడీ కేసులో దొంగలు వచ్చిన కారుకు ఫేక్ నంబర్ ప్లేట్ అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన పాత నేరస్తుల ముఠా చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఏపీ నంబర్‌‌ ప్లేట్‌తో శనివారం కర్నాటకలోని హోస్‌కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు గుర్తించారు.  

ఆర్బీఐ రూల్స్ ​ఫాలో కావట్లే..
బ్యాంకులు ఏటీఎంల వద్ద సెక్యూరిటీ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఆర్బీఐ రూల్స్​ఫాలో కావాలని చెప్పినా పట్టించుకోవడం లేదు. లాకింగ్‌ వ్యవస్థ, సెక్యూరిటీ గార్డులు అప్రమత్తంగా లేకపోవడం, కొన్ని చోట్ల సీసీ కెమెరాలు పనిచేయకపోవడం గుర్తించాం. వరుస ఘటనల నేపథ్యంలో బ్యాంకుల నోడల్ ఆఫీసర్లతో త్వరలో సమావేశం నిర్వహిస్తాం.


సుధీర్‌‌బాబు,సీపీ,రాచకొండ