ఏరియర్స్‌‌‌‌ మంజూరు కోసం లంచం డిమాండ్‌‌‌‌

  • ఏసీబీకి చిక్కిన ఖమ్మం ట్రెజరీ ఆఫీస్‌‌‌‌ పెన్షన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ సీనియర్‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌ నగేశ్‌‌‌‌
  • ఆడియో, వీడియో రికార్డింగ్‌‌‌‌ ఆధారంగా పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్లు 

ఖమ్మం టౌన్, వెలుగు : రిటైర్ అయి, చనిపోయిన ఓ అటెండర్‌‌‌‌ భార్యకు రావాల్సిన ఏరియర్స్‌‌‌‌ మంజూరు కోసం లంచం డిమాండ్‌‌‌‌ చేసిన ఉద్యోగిని ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. లంచం డిమాండ్‌‌‌‌ చేసిన ఆడియా, వీడియో రికార్డ్‌‌‌‌ల ఆధారంగా ఖమ్మం ట్రెజరీ పెన్షనర్‌‌‌‌ విభాగంలో పనిచేస్తున్న సీనియర్‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. ఖమ్మం ఏసీబీ డీఎస్పీ రమేశ్‌‌‌‌ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సుబ్లేడ్ పీహెచ్‌‌‌‌సీలో అటెండర్‌‌‌‌గా పనిచేసిన ఓ వ్యక్తి రిటైర్డ్‌‌‌‌ అయి కొన్ని రోజుల కింద చనిపోయాడు. 

దీంతో రూ. 4 లక్షల ఏరియర్స్‌‌‌‌ కోసం అతడి భార్య అప్లై చేసుకుంది. ఏరియర్స్‌‌‌‌ మంజూరు కోసం మహిళ తరఫున ఆమె కుటుంబ సభ్యులు ఖమ్మం ట్రెజరీ ఆఫీస్‌‌‌‌లో సీనియర్‌‌‌‌ అకౌంటెంట్‌‌‌‌గా పనిచేస్తున్న కట్టా నగేశ్‌‌‌‌ను కలిశారు. అయితే తనకు కొంత పర్సంటేజీ ఇస్తేనే ఏరియర్స్‌‌‌‌ మంజూరు చేస్తానని అతడు స్పష్టం చేశాడు. పలుమార్లు ఫోన్‌‌‌‌లో సంప్రదించగా లంచం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పడంతో ఆ ఆడియోని రికార్డు చేశారు. 

అలాగే ఏరియర్స్‌‌‌‌ మంజూరు కోసం ఎంత తీసుకోవాలన్న విషయంపై నగేశ్‌‌‌‌ మరొకరితో మాట్లాడుతుండగా దానిని కూడా వీడియో తీశారు. ఈ ఆడియో, వీడియో ఆధారంగా ఏసీబీ ఆఫీసర్లను కలిసి ఫిర్యాదు చేశారు. మహిళ కుటుంబ సభ్యులు సోమవారం మరోసారి నగేశ్‌‌‌‌తో చర్చించగా డబ్బులు ఇవ్వాల్సిందేనని చెప్పాడు. దీంతో ఏసీబీ ఆఫీసర్లు నగేశ్‌‌‌‌ను అదుపులోకి తీసుకొని రెండు గంటల పాటు విచారించారు. నగేశ్‌‌‌‌ను ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌‌‌‌కు తరలించనున్నట్లు డీఎస్పీ రమేశ్‌‌‌‌ తెలిపారు.