
- బేసిన్ ఆవల పెన్నాకు తరలించేందుకు ఏపీ యత్నిస్తోంది
- బ్రజేశ్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
- గోదావరి జలాల మళ్లింపునకు ఏపీ కుట్రలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నుంచి పెన్నా బేసిన్‌కు భారీ స్థాయిలో నీటిని తరలించుకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం పెద్ద స్థాయిలో ప్రాజెక్టులను చేపట్టిందని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్2 (కేడబ్ల్యూడీటీ2/బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్)కు తెలంగాణ అధికారులు వివరించారు. జీబీ లింక్ పేరిట భారీగా నీటిని ఔట్‌సైడ్ బేసిన్‌లోని పెన్నాకు తరలించేందుకు ఏపీ ప్రయత్నిస్తున్నదని వాదించారు. తొలుత గోదావరి–పెన్నా డైవర్షన్ స్కీమ్ పేరుతో ప్రాజెక్టును చేపట్టిందని, ఆ తర్వాత దానిని వైఎస్ఆర్– పల్నాడు స్కీమ్‌గా మార్చిందని తెలిపారు.
ఇప్పుడు పోలవరం నుంచి నీటిని తీసుకెళ్లేలా దానిని గోదావరి– బనకచర్ల (జీబీ) లింక్‌గా మార్చిందని పేర్కొన్నారు. జీబీ లింక్‌లో భాగంగా పోలవరం కుడి కాల్వ నుంచి నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. అక్కడి నుంచి తీసుకున్న నీటిని తరలించేందుకు ప్రకాశం బ్యారేజీ ఎగువన వైకుంఠపురం బ్యారేజీని నిర్మిస్తోందని.. అటు నుంచి నాగార్జునసాగర్ కుడి కాల్వకు లింక్ చేసి బనకచర్ల వరకు నీటిని తీసుకెళ్లేలా ప్రణాళికలను రూపొందిస్తున్నదని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పోలవరం కుడి కాల్వ నుంచే రోజూ 1.5 టీఎంసీల నీటిని తరలించేలా ఆ కాల్వ కెపాసిటీని పెంచిందని, కానీ, గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన డీపీఆర్ ప్రకారం ఆ కాల్వసామర్థ్యం కేవలం10 వేల క్యూసెక్కులేనని వివరించారు. ప్రస్తుతం పెంచిన సామర్థ్యంతో పోలవరం నుంచి 90 రోజుల పాటు135 టీఎంసీల నీటిని బనకచర్లకు ఎత్తుకుపోయేలా ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నదని పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ట్రిబ్యునల్‌లో మలిదశ వాదనలను తెలంగాణ తరఫు అడ్వకేట్లు వినిపించారు. మరో రెండు రోజుల పాటు ఈ వాదనలు కొనసాగనున్నాయి.
పోలవరం నుంచి భారీ డైవర్షన్లు
పోలవరం ప్రాజెక్టు ద్వారా ఏపీ భారీ మొత్తంలో నీటిని డైవర్ట్ చేసుకునే ప్రాజెక్టులను చేపట్టిందని తెలంగాణ అడ్వకేట్లు వాదించారు. ప్రకాశం బ్యారేజీకి నీటిని తరలించి కృష్ణా డెల్టా సిస్టమ్ (కేడీఎస్)కు నీళ్లిచ్చేలా పోలవరం ప్రాజెక్టు ఆధారంగా ఏపీ పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను నిర్మించిందని తెలిపారు. పోలవరం నుంచి 80 టీఎంసీలు తీసుకునేలా దానిని డిజైన్ చేశారన్నారు. ఆ నీళ్లతో పాటు ఇతర సోర్సుల ద్వారా తరలించే నీళ్లు కేడీఎస్ అవసరాలకు సరిపోతాయని వాదించారు. ఈ సమయంలో జోక్యం చేసుకున్న ట్రిబ్యునల్.. 215 టీఎంసీల కన్నా ఎక్కువ నీటి అవసరాలు ఉన్నాయని ట్రిబ్యునల్ ముందు చూపించారని, కానీ, ట్రిబ్యునళ్లు కేవలం 151.2 టీఎంసీలే కేటాయించాయి కదా? అని ప్రశ్నించింది.
దానికి స్పందించిన తెలంగాణ అడ్వకేట్.. ఆ అవసరాల కోసమే 80 టీఎంసీలను పట్టిసీమ ద్వారా తరలించేలా లిఫ్టును నిర్మించారన్నారు. కేడీఎస్ అవసరాలు కేవలం 151.2 టీఎంసీలేనని, అందుకు అనుగుణంగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీలకు ఏపీ డీపీఆర్లనూ సమర్పించిందని గుర్తు చేశారు. ట్రిబ్యునల్ ముందు ఏపీ దాఖలు చేసిన అఫిడవిట్లోనూ ఇదే అంశాన్ని పేర్కొందని చెప్పారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలను డైవర్ట్ చేయగా.. కేడీఎస్ నీటి అవసరాలు కేవలం 72 టీఎంసీలేనని స్పష్టం చేశారు.