కరీంనగర్ జిల్లా సెప్టెంబర్ 5వ తేదీన గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన తెలంగాణ ఉద్యమకారుడు కుక్క మల్లయ్య(58) మృతి చెందాడు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన తనను బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడం లేదని కుక్క మల్లయ్య సెప్టెంబర్ 5వ తేదీన కరీంనగర్‌లో ఆత్మహత్యకు యత్నించాడు. స్థానిక అమరవీరుల స్తూపం దగ్గర పురుగుల మందు తాగాడు.
కరీంనగర్ రూరల్ మండలం దుబ్బపల్లికి చెందిన కుక్క మల్లయ్య(58) తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణ వచ్చేంతవరకు కొట్లాడాడు. అయితే తెలంగాణ కోసం పోరాడిన తాను అన్ని విధాలా నష్టపోయానని, ఇప్పటివరకు తనను ఎవరూ ఆదుకోలేదంటూ మదనపడే వాడు.
సెప్టెంబర్ 3వ తేదీన కుక్క మల్లయ్య ఇంట్లో కూడా ఈ విషయమై గొడవ జరిగింది. ఉద్యమంలో కొట్లాడిన వాళ్లకు కళాకారులుగా ఉద్యోగాలు వచ్చినయ్...పెన్షన్లు తీసుకుంటున్నరు. నువ్వు తెలంగాణ..తెలంగాణ అని కొట్లాడినవ్ కదా...ఏం సాధించినవ్..ఏ సంపాదించివన్’ అని ఇంట్లో మందలించారు. దీంతో సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం సాయంత్రం కరీంనగర్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర పురుగుల మందు తాగాడు. స్థానిక ఆటో డ్రైవర్లు గమనించి అతడిని గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో..ఆయన్ను హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. 9 రోజుల పాటు చికిత్స పొందిన కుక్క మల్లయ్య..చివరకు చనిపోయాడు.