
సూర్యాపేట, వెలుగు: ఈనెల 10న జరిగే గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డేను జయప్రదం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాధవిరెడ్డి, మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పిడమర్తి లింగయ్య, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సైదులు యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం సూర్యాపేటలో గ్రేట్ తెలంగాణ మిలియన్ మార్చ్ డే కరపత్రాలను వారు ఆవిష్కరించి మాట్లాడారు. 2011 మార్చి 10న సీమాంధ్ర దోపిడీ పాలనపై తెలంగాణ ప్రజలు తిరగబడిన రోజు అని అన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 250 గజాల ఇంటి స్థలంతోపాటు రూ.30 వేల గౌరవ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్చి 10న హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ నుంచి గన్ పార్క్ లోని అమరవీరుల స్తూపం వరకు పది వేల మంది తెలంగాణ ఉద్యమకారులతో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ ర్యాలీలో తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ, తెలంగాణ ఉద్యమకారుల మహిళా వేదిక, తెలంగాణ ఉద్యమ కళాకారుల వేదిక, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక, తెలంగాణ జర్నలిస్ట్ ఫ్రంట్ సభ్యులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో మలిదశ తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కే యూసూఫ్ షరీఫ్, రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగయ్య, జిల్లా అధ్యక్షుడు మురళి, జిల్లా ప్రధాన కార్యదర్శి అమృనాయక్, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు అంజయ్య తదితరులు పాల్గొన్నారు.