- భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో వరుస సమావేశాలు.. పక్కా ప్రణాళికల రచన
- కొత్తగూడెం, ఇల్లెందులలో నామినేషన్ వేసేందుకు సన్నద్ధం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ తెలంగాణ ఉద్యమకారులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరులో అలుపెరుగని పోరాటం చేసిన వారిని బీఆర్ఎస్ సర్కార్ గుర్తించడం లేదంటూ వారు వాపోతున్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేసి బీఆర్ఎస్కు తమ సత్తా చూపుతామని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఉద్యమకారులు స్పష్టం చేస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల్లో నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఆ రెండు నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం
తెలంగాణ రాష్ట్రం కోసం తొలి, మలి ఉద్యమాల్లో కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాలకు ప్రత్యేక స్థానం ఉంది. తొలి ఉద్యమం కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచలోనే మొదలైంది. కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో జరిగిన పోలీస్ కాల్పుల్లో దస్తగిరితో పాటు మరొకరు మృతి చెందగా ఐదారుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఇదే క్రమంలో పాల్వంచ, ఇల్లెందులలో పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది. ఎంతో మంది జైలు పాలయ్యారు. మలి ఉద్యమం కూడా ఇల్లెందు,కొత్తగూడెంలలో భారీ ఎత్తున సాగింది. ప్రధానంగా సింగరేణి కార్మికులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో ఉప్పెనలా పాల్గొన్నారు.
ఇప్పుడు కనీస మర్యాద కరువై..
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన తమకు బీఆర్ఎస్ ప్రభుత్వం కనీస మర్యాద ఇవ్వడం లేదని ఉద్యమకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రత్యేక పించన్ స్కీం ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. డబుల్ బెడ్రూం ఇండ్లలో ప్రాధాన్యత లేదని, కనీసం ఇండ్ల స్థలాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై పాల్వంచలో తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సంఘం కన్వీనర్ రషీద్ ఆధ్వర్యంలో ఏడాది కింద పాల్వంచ టు ప్రగతి భవన్ పాదయాత్ర చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. కొత్తగూడెం, పాల్వంచలలో పలుమార్లు ఉద్యమకారులు నిరాహార దీక్షలు చేపట్టిన దాఖలాలున్నాయి.
హక్కుల పరిరక్షణే లక్ష్యంగా...
తమ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కొత్తగూడెంలో ఉద్యమకారుల తరుపున నామినేషన్ వేయనున్నట్టు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు శ్రావణబోయిన నర్సయ్య తెలిపారు. ఉద్యమ కారుల త్యాగాలతో అధికారం చెలాయిస్తున్న కేసీఆర్తో పాటు ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పేందుకు తాను పోటీలో ఉంటున్నానని స్పష్టం చేశారు. ఇటీవలనే ఇల్లెందులో తెలంగాణ ఉద్యమ కారులు నియోజకవర్గ స్థాయి మీటింగులు పెట్టుకున్నారు.
ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఇల్లందు క్యాండిడేట్భానోత్ హరిప్రియ తీరుతో పాటు సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ మలి దశ ఉద్యమ కారుల సంక్షేమ సంఘం తరుపున నామినేషన్ వేయనున్నట్టు వారు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అలుసుగా మారిందని సంఘం నేత ఆదూరి రవి ఆరోపించారు. ఒకవేళ అనుకోని పరిస్థితులలో తాము పోటీ నుంచి విరమించుకోవాల్సి వస్తే బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేస్తామని, కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతు ఇస్తామని వారు పేర్కొనడం గమనార్హం.