
ముషీరాబాద్, వెలుగు: మైదాన ప్రాంతంలో ఉన్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధి కోసం 5 ఐటీడీఏలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘాల ఐక్యవేదిక కోరింది. ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ ఎల్ రూప్ సింగ్, వైస్ చైర్మన్ లోకిని రాజు నేతృతంలో పలువురు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ గిరిజన సంఘాలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఎన్నికల వేళ ఎస్టీ డిక్లరేషన్ సభలో సంతు సేవాలాల్, కుమ్రం భీమ్, ఎరుకల ఏకలవ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అలాగే ఎస్టీ జాతి అభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని విన్నవించారు. కార్యక్రమంలో కూతాడి రవికుమార్, సాయి, వనం రమేశ్, సోయం గోవర్ధన్ పాల్గొన్నారు.