వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు : లోనికి రాజు

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దు : లోనికి రాజు
  • బీజేపీ ఎంపీ డీకే అరుణ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నం
  • ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోనికి రాజు

ట్యాంక్ బండ్, వెలుగు: వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో కలపొద్దని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోనికి రాజు డిమాండ్​ చేశారు. కాదని కలిపితే తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. తెలుగు రాష్ట్రాల్లో వాల్మీకి బోయలు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని, ఎస్టీ జాబితాలో కలపాలని పార్లమెంటులో బీజేపీ ఎంపీ డీకే అరుణ మాట్లాడడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

శనివారం ఆయన సంఘం స్టేట్​ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. బీజేపీ తన రాజకీయ అవసరాల కోసం గతంలో ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపూరావుతో గిరిజన తెగల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడించిందని ఆరోపించారు. మళ్లీ ఇప్పుడు గిరిజన తెగలకు, బీసీ కులాల్లోని వాల్మీకి బోయల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలనే కుట్ర చేస్తోందని మండిపడ్డారు.

ఎస్టీ జాబితాలో కలపడానికి ఆర్థిక వెనుకబాటు ఒక్కటే ప్రామాణికం కాదన్న విషయం డీకే అరుణకు తెలియదా అని ప్రశ్నించారు. బీజేపీ కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 2023లో దేశవ్యాప్తంగా 15 కులాలను ఎస్టీ జాబితాలో కలిపి గిరిజనులకు తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. సమావేశంలో సాబన్న, మొగిలయ్య, సుధాకర్, రామకృష్ణ, వసంత్ తదితరులు పాల్గొన్నారు.