కల్తీ పాల తయారీ..పాల పొడి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ మిక్స్‌

  • ఖమ్మం నగరంలో వెలుగులోకి
  •  పాల పొడి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ మిక్స్‌
  •  ఎలాంటి అనుమతి లేకుండానే కేంద్రం నిర్వహణ
  •  నిర్వాహకులపై కేసు పెడతామన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు

ఖమ్మం నగరంలో కల్తీ పాల తయారీ బాగోతం బయటపడింది. పాల కేంద్రంలో బాయిలర్ పేలిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని లీటర్ల పాలను సేకరించి.. వాటిలో పాలపొడి, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కలిపి కల్తీ చేసి ‘హనుమాన్ డెయిరీ’ పేరుతో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక గోపాలపురంలో శనివారం ఒక్కసారిగా బాయిలర్‌ బ్లాస్ట్ అయింది. పేలుడు ధాటికి బాయిలర్ 200 మీటర్ల దూరం ఎగిరిపడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకుని తనిఖీకి వచ్చిన ఫుడ్ సేఫ్టీ అధికారులు సన్ ఫ్లవర్ ఆయిల్ క్యాన్లు, పాల పొడి మిశ్రమాన్ని గుర్తించారు. హనుమాన్ పాల ఫ్యాక్టరీకి ఎలాంటి అనుమతులు లేవని, నిర్వాహకులపై కేసు పెడతామని చెప్పారు. పాలను టెస్టులకు పంపుతామని వెల్లడించారు.

ఖమ్మం/ఖమ్మం రూరల్​, వెలుగు : ఖమ్మం నగరంలో నకిలీ పాల తయారీ బాగోతం బయటపడింది. ఖమ్మం సిటీలోని 8వ డివిజన్​ గోపాలపురం, పంచాక్షరీ నగర్  దగ్గర ఆంధ్ర ప్రాంతానికి చెందిన నేపాలి రవీందర్ 2017లో కొత్తపల్లి శ్రీనివాస్​ అనే వ్యక్తి వద్ద ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. హనుమాన్​ డెయిరీ పేరుతో కల్తీ పాలు తయారుచేసి అమాయక ప్రజలకు విక్రయిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం పాల తయారీ కేంద్రంలో బాయిలర్​ బ్లాస్ట్​ కావడంతో కల్తీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గోపాలపురంలో మధ్యాహ్నం ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళనకు గురయ్యారు. ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్..  రాకెట్ వేగంతో గాల్లోకి దూసుకువెళ్లి  సమీపంలోని దత్తాత్రేయ ఆశ్రమంలో పడింది. అర కిలోమీటర్ వరకు పొగ నిండిపోయింది. స్థానిక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. నిర్వాహకుల నిర్లక్ష్యం ఫలితంగా భారీ ప్రమాదం తప్పినప్పటికీ పరిశ్రమ నిర్వహణ విషయంలో అనేక సందేహాలు  ఉత్పన్నమవుతున్నాయి. నిర్వాహకులు అనుమతులు ఉన్నాయని చెబుతున్నా అధికారులు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఫుడ్​ సేఫ్టీ అధికారి రాయపుడి కిరణ్​కుమార్​ పాల కేంద్రాన్ని సందర్శించారు. అయితే, ఆ సమయంలో పాల కేంద్రం నిర్వాహకులు ఎవరూ లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డెయిరీ యజమాని కాకినాడ వెళ్లాడని చెపుతున్నారని, సూపర్ వైజర్​ తాళాలు వేసుకుని వెళ్లిపోయాడని డెయిరీలో పనిచేస్తున్న మహిళలు తెలిపారు. హనుమాన్​ డెయిరీకి ఎలాంటి అనుమతులు లేవని, వారికి పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకుంటామని ఫుడ్  సేఫ్టీ అధికారి చెప్పారు. ఫ్యాక్టరీలో తయారవుతున్న పాలను టెస్ట్ లకు​పంపుతామన్నారు. తనిఖీ సమయంలో పాల కేంద్రంలో భారీ మొత్తంలో ఫ్రీడం​ సన్​ఫ్లవర్​ అయిల్​ క్యాన్లు, పాలపొడి మిశ్రమం దొరికాయని, బాయిలర్​ పేలుడు విషయంలో నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామని ఆయన వెల్లడించారు. రెండు రోజుల తరువాత పూర్తి స్థాయిలో మళ్లీ తనిఖీ చేస్తామన్నారు. కాగా, గత కొన్నేళ్లుగా ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇక్కడ పరిశ్రమ నిర్వహిస్తున్నా అధికారులు ఎందుకు దృష్టి సారించలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో జరిగే వ్యాపారం అక్రమమో, సక్రమమో తేల్చకుండానే అధికారులు వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు. 

నకిలీ పాల తయారీ ఇలా..

నిర్వాహకులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కొద్ది మొత్తంలో పాలు సేకరిస్తున్నారు. ఆ పాలను పాల కేంద్రానికి తీసుకువచ్చిన తరువాత ఒరిజనల్​ పాలలో పాలపొడితో పాటు ఫ్రీడం​ సన్​ఫ్లవర్​ ఆయిల్​ కలిపి కల్తీ పాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన కల్తీ పాలను హనుమాన్​ నేచురల్​ పాలు, పెరుగు పేరుతో విక్రయిస్తున్నారు.