వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి

మన టార్గెట్.. 2023

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి: తరుణ్ చుగ్

కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై జనం విసుగెత్తిపోయారు

ఆల్టర్నేటివ్​గా బీజేపీ వైపు చూస్తున్నరు.. టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్​ను ఎండగట్టండి

సమస్యలపై పోరాడండి.. కార్యకర్తల త్యాగాలతోనే బీజేపీ ఈ స్థాయికి

బీజేపీ రాష్ట్ర నేతలకు స్టేట్ ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ దిశా నిర్దేశం

కోర్ కమిటీ, ఆఫీసు బేరర్స్, పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇన్​చార్జ్​లతో వరుస భేటీలు

హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విసిగెత్తిపోయారని, అందుకే ఆల్టర్నేటివ్​గా తమ పార్టీ వైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్ తరుణ్ చుగ్ అన్నారు.‘‘2023 ఎన్నికలే మన టార్గెట్. అప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడమే మన లక్ష్యం కావాలి. ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలి” అని పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో తరుణ్ చుగ్ వరుసగా రెండో రోజూ రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ, ఆఫీసు బేరర్స్, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ జిల్లా ఇన్​చార్జ్​లతో వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో బీజేపీకి పూర్తి అనుకూల వాతావరణం ఉందని, ప్రజలు పార్టీని ఆదరిస్తున్నారని చెప్పారు. పార్టీ లీడర్లు కూడా వారి ఆశలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు నిత్యం ఏదో ఒక సమస్యపై పోరాడాలని దిశా నిర్దేశం చేశారు.

ఏ ఎన్నికలైనా రెడీగా ఉండండి

దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్​లో గెలుపుతో పార్టీలో మంచి ఊపు వచ్చిందని, దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్లాలని తరుణ్ చుగ్ సూచించారు. ఏ ఎన్నిక వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, హైదరాబాద్, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎలక్షన్లలో గెలుపు కోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని ఆదేశించారు. ‘‘దశాబ్దాలుగా ఎందరో కార్యకర్తలు ఏమీ ఆశించకుండా పార్టీ కోసం ప్రాణ త్యాగం చేశారు. నీడ, తిండి లేని చోట నిలబడి పని చేసిన కార్యకర్తలు బీజేపీకి ఉండడం వల్లే ఈ రోజు దేశంలో ఈ స్థాయికి  చేరుకోగలిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీ బలపడింది. ఇంతకాలం ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. ఇప్పుడు బీజేపీలోకి వచ్చాక చివరి శ్వాస దాకా ఇదే జెండాను పట్టుకోవాలి” అని కోరారు. పార్టీలో చేరిన చాలా మంది నాయకులు అదృష్టవంతులని, వారికి ఎమ్మెల్యే అయ్యే అదృష్టం దక్కుతుందని చెప్పారు. నాయకులు పని విభజన చేసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. ఈ సమావేశాలకు పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షత వహించగా నేతలు మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, వివేక్ వెంకటస్వామి, డీకే అరుణ, విజయశాంతి, పేరాల శేఖర్ రావు, రాంచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన రెండు రోజుల టూర్

రాష్ట్ర బీజేపీ ఇన్​చార్జ్​గా నియమితులైన తర్వాత శుక్రవారం మొదటిసారి తరుణ్ చుగ్ హైదరాబాద్ వచ్చారు. రెండు రోజులపాటు పార్టీ స్టేట్ ఆఫీసులో వివిధ కమిటీలతో వరుస భేటీలు నిర్వహించారు. దాదాపు 10 సమావేశాలు నిర్వహించి నాయకుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రతి నాయకుడితో మాట్లాడి జోష్ నింపే ప్రయత్నం చేశారు. శనివారం సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లారు.