టన్ను ఆయిల్ పామ్ గెలలు రూ. 21 వేలు : తుమ్మల

టన్ను ఆయిల్ పామ్ గెలలు రూ. 21 వేలు : తుమ్మల
  • ధర పెరగడంతో 64,582 మంది​ రైతులకు లబ్ధి: తుమ్మల

హైదరాబాద్, వెలుగు: ఆయిల్ పామ్ గెలల ధర రోజురోజుకు పెరుగుతున్నందున, రైతులు పెద్ద మొత్తంలో పామాయిల్ పంటను సాగుచేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. టన్ను ఆయిల్ పామ్ ధర రూ.21వేలకు పెరగడంతో ఆయిల్ పామ్ రైతులకు మంచిరోజులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటికి టన్ను ధర కేవలం రూ. 12,534  ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా రూ. 8,500 పెరిగిందని తెలిపారు. దీంతో ఆయిల్​పామ్ సాగు చేసిన 64,582 మంది రైతులకు అదనపు లబ్ధి చేకూరినట్లయిందన్నారు. 

వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా, రైతు రుణమాఫీ పథకాలను అమలు చేయడంతో పాటు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 2.43 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు. 31 జిల్లాల్లో సాగు విస్తరించడంతో పాటు 14  కంపెనీలకు అనుమతులిచ్చామని తెలిపారు. ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటల సాగుకు 45,548 మంది రైతుల ఖాతాల్లో రు.72 కోట్లను ప్రభుత్వం జమ చేసిందని చెప్పారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పెద్ద సంఖ్యలో రైతులు ముందుకు వచ్చి ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని మంత్రి కోరారు.