
బషీర్బాగ్/ట్యాంక్ బండ్, వెలుగు: వ్యవసాయ శాఖలో ప్రమోషన్లు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు సంఘం చైర్మన్ కృపాకర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. బషీర్ బాగ్ లోని ఫతే మైదాన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడ్డాక పదేండ్లుగా వ్యవసాయ శాఖలో పదోన్నతుల విషయంలో వివక్షకు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమోషన్ల కోసం వ్యవసాయ శాఖ మంత్రిని, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిని కలిసి విజ్ఞప్తి చేశామన్నారు.
వారి సహకారంతో తమ శాఖకు ప్రమోషన్లు లభించాయని తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్ నుంచి జాయింట్ డైరెక్టర్ గా 18 మందికి , అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి డిప్యూటీ డైరెక్టర్ గా 42 మందికి ప్రమోషన్లు వచ్చాయన్నారు. అంతకుముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. సుదీర్ఘకాలంగా వ్యవసాయ శాఖలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వివరించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులకు కార్యాలయ వసతులు, కంప్యూటర్, ఆఫీస్, స్టేషనరీ, వాహన సదుపాయం కల్పించాలని కోరారు.