చేనేత వస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం :  స్మితా సబర్వాల్

చేనేత వస్త్రాలను ప్రపంచానికి పరిచయం చేయడమే లక్ష్యం :  స్మితా సబర్వాల్
  • తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మితాసబర్వాల్

భూదాన్ పోచంపల్లి, వెలుగు : తెలంగాణ చేనేత వస్త్రాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్  తెలిపారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్  పోచంపల్లిలోని తెలంగాణ టూరిజం పార్కును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మే 15న హైదరాబాద్ లో ఫ్యాషన్  షో అనంతరం 35 దేశాల పోటీదారులు భూదాన్  పోచంపల్లిలో పర్యటిస్తారని తెలిపారు. దానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్  హనుమంతరావుతో కలిసి పరిశీలించారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు కొట్టొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. టూరిజం పార్కులో  పోచంపల్లి ఇక్కత్, ధర్మవరం, నారాయణగిరి, గద్వాల్  వంటి ప్రముఖ తెలంగాణ చేనేత వస్త్రాల స్టాళ్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని, చేనేత వృత్తి ప్రాముఖ్యతను వివరించేలా ప్లాన్  చేస్తున్నట్లు తెలిపారు. భూదాన్  పోచంపల్లి వేదికగా చేనేత వస్త్రాలను ప్రపంచ దేశాలకు ప్రమోట్  చేసే లక్ష్యంతోనే ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు.