చెత్తను కాలుస్తున్నారు.... వాయుకాలుష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి..

చెత్తను కాలుస్తున్నారు....  వాయుకాలుష్యంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి..

ప్రపంచవ్యాప్తంగా మున్సిపల్​ చెత్తను కాలుస్తుండటంతో వాయు కాలుష్యం ముప్పు గణనీయంగా పెరుగుతోంది.  ఒక అంచనా ప్రకారం,  ప్రపంచవ్యాప్తంగా 1,700 కంటే ఎక్కువ థర్మల్ (WTE) ప్లాంట్లు ఉన్నాయి.  వాటిలో 80% కంటే ఎక్కువ అభివృద్ధి చెందిన దేశాలలో ఉన్నాయి. అమెరికాలో దాదాపు చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాలు 74 ఉన్నాయి.  స్వీడన్​లో కూడా ఈ రకం విద్యుత్ ఉత్పత్తి ఎక్కువ. అయినా కూడా అభివృద్ధి చెందిన అమెరికా, ఐరోపా దేశాలు ‘చెత్తను’ ఓడలలో నింపి  చిన్న, పేద దేశాలకు ఎగుమతి చేస్తుంటాయి.  

భారతదేశం కూడా వస్తువుల వ్యర్థాలను దిగుమతి చేసుకుంటున్నది.  జపాన్​లో చెత్త నుంచి విద్యుత్, లేదా పైరాలసిస్ పద్ధతి ద్వారా కాల్చేస్తుంటారు. ఆ దేశం భూభాగం చిన్నది కనుక చెత్తను ఎప్పటికప్పుడు కాల్చేయడం ఉత్తమంగా వారు నిర్ణయించారు. జపాన్‌‌లో  అత్యంత విస్తృతంగా ఉపయోగించే పద్ధతి.. దాదాపు 75 శాతం మున్సిపల్ వ్యర్థాలను భస్మం చేయటం. 2022 నాటికి జపాన్‌‌లో సుమారు 1,160 వేల వ్యర్థాలను కాల్చే ప్లాంట్లు ఉన్నాయి. అన్నింటి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయరు.  సింగపూర్ కూడా ఎక్కువ శాతం వ్యర్థాలను భస్మం చేస్తోంది. అయితే  ఇటీవల పునఃవినియోగం మీద దృష్టి పెట్టింది. 

2020లో  దాదాపు 5.88 మిలియన్ టన్నుల ఘన వ్యర్థాలలో ఫెర్రస్ మెటల్,  ప్లాస్టిక్​తో పాటు 20 శాతం కాగితం, కార్డ్‌‌బోర్డ్ ఉన్నాయి. ఈ రకం విద్యుత్ కేంద్రాలు విడుదల చేసే గాలి కాలుష్యం మీద ఆయా దేశాలలో ఎంతో కొంత నియంత్రణ ఉన్నది.  మన దగ్గర మాత్రం శూన్యం.  ఇది గ్రీన్ ఎనర్జీగా  పరిగణించి అన్ని రకాల పర్యావరణ అనుమతులు, నియంత్రణల నుంచి విముక్తి చేసింది కేంద్ర ప్రభుత్వం.  

బొగ్గు కాల్చి  విద్యుత్ ఉత్పత్తి చేసే  కేంద్రాలకు ఉన్న నియంత్రణ కూడా వీటికి లేదు.  భారతదేశంలో  థర్మల్​(WTE) కేంద్రాలు విఫలమయ్యాయి. హైదరాబాదులో  గంధంగూడలో,  వనపర్తి దగ్గర,  ఘటకేసర్ దగ్గర పెట్టినవి విఫలం అయినాయి. జవహర్ నగర్ లో పెట్టింది నడుస్తోంది అంటున్నారు. ఈ మధ్య ప్యారానగర్​లో పెట్టడానికి  ఏర్పాట్లు  జరుగుతున్నాయి. ఇవి కూడా నడవకపోవచ్చు. ప్రధాన సమస్య మిశ్రమ చెత్త.  వేడి బాగా వచ్చి బూడిద తక్కువ వచ్చే చెత్తను నిత్యం వేరు చేయడం ఖర్చుతో కూడిన పని.   

మొదట్లో ఈ రకం కేంద్రాలు పెట్టడం ఆ తరువాత చేతులు ఎత్తివేయడం పరిపాటి అయిపోయింది. ఉత్పత్తి అయిన విద్యుత్ కంటే  అంతర్గతంగా వినియోగించే విద్యుత్ ఎక్కువ కావటం కూడా ఒక కారణం.  హైదరాబాద్​లో రోజుకు 9వేల టన్నుల చెత్త
హైదరాబాద్ నగరంలో రోజు దాదాపు 9వేల టన్నుల చెత్తను లారీల ద్వారా తరలిస్తుంటారు. దీనికంటే ముందు, కాలనీలలో ఇంకా ఇతర ప్రాంతాలలో  మున్సిపల్​ కార్మికులు నిత్యం చెత్తను ఊడ్చి కాలపెడుతుంటారు. చెత్త లారీల వరకు, ఇతర చిన్న వాహనాల వరకు చేరకముందే కాల్చేస్తున్నారు.  

అలా కాల్చిన తరువాత  పోగు అయ్యిందే  దాదాపు 9 వేల టన్నులు బరువు ఉండవచ్చు.  కానీ,  అందులో అనేక రకాల వ్యర్థాలు ఉంటాయి. ఇంటి శిథిలాలతో సహా కనీసం 100కు పైగా వివిధ రకాల వ్యర్థాలు ఈ 9 వేల టన్నులలో ఉంటుంది. దీనిని వేరు చేయకుండా కలిపి తరలిస్తున్నారు. 

తరలించిన తరువాత అక్కడ వేరు చేసి చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి  చేస్తున్నామంటున్నది హైదరాబాద్ బల్దియా.  కాల్చగలిగినది మాత్రమే వేరు చేసి మిగతాది అక్కడ కుప్పలుగా మిగులుస్తారు. జవహర్​ నగర్లో చెత్తను కాల్చి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ముందట  నివేదిక ఇచ్చింది. 

వ్యర్థాలతో విష వాయువులు

అమెరికాలో గతంలో మున్సిపల్ వ్యర్థాలను కాల్చడం వల్లే వెలువడిన 70-–80% డయాక్సిన్‌‌లు ఉత్తర ధృవ ప్రాంతానికి చేరుకున్నాయని ఒక అధ్యయనం కనుగొంది.  విష వాయువులు చాలా విస్తృతంగా పయనిస్తాయి. టోక్యో  నగరాన్ని  డయాక్సిన్ రాజధానిగా పరిగణిస్తారు. వ్యర్థాలను కాల్చడం ద్వారా విడుదలయ్యే అనేక విష వాయువులను చాలా  ప్రమాదకరంగా గుర్తించారు శాస్త్రవేత్తలు.  

ప్రపంచవ్యాప్తంగా  నీరు, ఆహారం  ద్వారా  ప్రజలలో,  వన్యప్రాణులలో  పేరుకుపోయి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. PFAS రసాయనాలు, డయాక్సిన్లు,  పాదరసం సమ్మేళనాలు తదితర విషపదార్థాల ఉనికి దూరంగా ఆర్కిటిక్‌‌లోని పర్యావరణం, ప్రజలు, సముద్ర క్షీరదాలలో కనుగొన్నారు. ఆధునిక గృహ వ్యర్థాలను కాల్చడం అనారోగ్యకరం. చాలా రకాల ఆహార ప్యాకేజింగ్, గృహ వ్యర్థాలలో ప్లాస్టిక్‌‌లు ఉంటాయి. అవి కాల్చినప్పుడు విషవాయువులు, రసాయనాలను విడుదల చేస్తాయి.  విద్యుత్ ఉపయోగించి కాల్చే వ్యర్థాలలో ఆసుపత్రి వ్యర్థాలు ఉన్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఈ దహన యంత్రాలు ఏర్పాటు చేయడం వల్ల కాలుష్యం విస్తృతం అవుతున్నది.

పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు దోహదం

వ్యర్థాలు ఇంధనం కాదు.  వ్యర్థాలను భస్మం చేయడం వలన వనరులు వృథా అవుతాయి. ‘వ్యర్థాల నుంచి విద్యుత్’ ఉత్పత్తి చేసే కేంద్రాలు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. వ్యర్థాలను కాల్చడం పునరుత్పాదక శక్తిగా భావించరు. కేంద్ర,  రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల నిజమైన సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన పరిష్కారాల నుంచి పెట్టుబడులు దూరం అవుతున్నాయి. 

ఈ కేంద్రాలు వాతావరణ మార్పుని కలిగిస్తూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు దోహదం చేస్తాయి. నిరంతరం సబ్సిడీలు, ప్రభుత్వ నిధులు ఉంటేనే అవి పని చేయగలుగుతాయి.  అమెరికాలో ఈ రకం కేంద్రాల ఏర్పాటుకు అయ్యే మూలధన వ్యయం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ఖర్చు కంటే రెండు రెట్లు,  అణు విద్యుత్  కేంద్రాల ఏర్పాటు ఖర్చు కంటే 60% ఎక్కువ.  వీటి వలన ‘చెత్తను’ ఏరి  పునఃవినియోగించే అసంఘటిత వ్యవస్థలో ఉపాధి పోతుంది. ఉద్యోగాలు పోతాయి. అందుకే ప్రపంచం ఇప్పుడు జీరో వేస్ట్‌‌ విధానాలను స్వీకరిస్తోంది.  దీనికి విరుద్ధంగా తెలంగాణా రాష్ట్రం ఇప్పుడు చెత్తను భస్మం చేసే పని నెత్తికి ఎత్తుకున్నది.

రీసైక్లింగ్​తో పరిష్కారం

బహిరంగ దహనం వల్ల కలిగే పర్యావరణ ప్రభావం గురించి అవగాహన లేకపోవడం ఒక కారణం కాగా క్యాన్సర్ కారక ఉద్గారాలకు అది మూలం అని కూడా తెలియకపోవడం ఇంకొక కారణం. మున్సిపల్​ ఘన వ్యర్థాలను బహిరంగంగా కాల్చడం కారణంగా 
10 ప్రధాన కాలుష్య కారకాలు  (డయాక్సిన్, ఫ్యూరాన్లు, అతి సూక్ష్మ కణాలు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్లు,  నైట్రోజన్ ఆక్సైడ్లు, బెంజీన్,  టౌలీన్,  ఇథైల్ బెంజీన్, 1-హెక్సీన్) విడుదల అవుతాయి. డయాక్సిన్ల వల్ల హార్మోనుల వ్యవస్థ మీద దుష్ప్రభావం పడుతుంది.  

భారత్​లో ఒక అంచనా మేరకు సంవత్సరానికి 19.20 కోట్ల టన్నుల మున్సిపల్ వ్యర్థాలు ఉత్పన్నం అయితే అందులో 7.4 కోట్ల టన్నులు బహిరంగంగా కాల్చేస్తున్నారు. ప్రతి భారత నగరంలో వాయు కాలుష్యానికి తోడు అయ్యే 4 ప్రధాన రంగాలు..  పరిశ్రమలు, భవన నిర్మాణం, వాహనాలు, మున్సిపల్ వ్యర్థాల దహనం.  2035 నాటికి మున్సిపల్ వ్యర్ధాల దహనం వాయు కాలుష్యానికి అతిపెద్ద కారణంగా పరిణమించవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ వ్యర్థాలను ఉత్పత్తి చేయడం, తక్కువ ప్లాస్టిక్‌‌ను తయారు చేయడం, ఎరువు తయారు చేయడం,  పునఃవినియోగించడం (రీసైక్లింగ్) వంటి ప్రభావవంతమైన, నిరూపితమైన పద్ధతులను ఉపయోగించడంపై దృష్టి పెట్టాలి.

- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్​-