Weather Report: తెలుగు రాష్ట్రాలకు కోల్డ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. రెండు రోజుల పాటు ( జనవరి 21,22) ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. శ్రీలంకకు దిగువన అల్పపీడనం ఏర్పడింది . దీని ప్రభావంతో తమిళనాడువైపు బలమైన గాలులు వీస్తుండటంతో.. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మాత్రం వర్షం పడకపోయినా.. చలి విపరీతంగా పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని..వీలైనంత వరకు రాత్రిళ్లు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ సూచించారు. శాటిలైట్ అంచనాల ప్రకారం రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోమేఘాలు చాలా తక్కువగా ఉంటాయి. జనవరి 21, 22 తేదీలు పొడి వాతావరణం ఉంటుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో చలి విపరీతంగా పెరుగుతుంది. ఏపీ కంటే తెలంగాణలో చలి మరింత ఎక్కువగా ఉంటుంది.
రానున్న రోజుల్లో చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏజెన్సీ, అడవి ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటుంది. పగటివేళ కంటే రాత్రివేళ తేమ బాగా పెరుగుతుందని..రాత్రిళ్లు చలి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ తెలిపింది. చలి తీవ్రత కారణంగా తెలంగాణలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. పిల్లలు, ముసలివారు, ఆస్తమా బాధితులు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
గాలివేగం బంగాళాఖాతంలో గంటకు 30కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో ఇది గంటకు 14కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో గంటకు 11కిలోమీటర్లు ఉంటుంది. ప్రస్తుతం గాలులన్నీ శ్రీలంకవైపే వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో చలి వాతావరణం రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నందున, ముఖ్యంగా హాని కలిగించే జనాభాకు ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.