తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు జనాగ్రహానికి గురవుతయ్​

హైదరాబాద్, వెలుగు: ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు జనాగ్రహాన్ని చవిచూస్తాయని వేద పండితులు శ్రీనివాసమూర్తి చెప్పారు. శనివారం గాంధీ భవన్​లో ఆయన ఉగాది పంచాంగ శ్రవణం చెప్పారు. రాష్ట్రంలో పంటలు సమృద్ధిగా పండుతాయని, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవిస్తారని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి ఉంటుందన్నారు. రాజకీయ నేరస్తులకు శిక్షలు వేయడంలో కోర్టులు ఇబ్బందులు ఎదుర్కొంటాయని చెప్పారు. కేంద్రంలో ఓ ముఖ్య నేత చనిపోతారన్నారు.

వైద్య రంగంపై కేంద్రం ఎక్కువ ఖర్చు చేస్తుందని.. పాకిస్తాన్, చైనాలతో మన దేశ పోరు నడుస్తుందని పేర్కొన్నారు. నదుల అనుసంధానానికి చర్చలు జరుగుతాయన్నారు. రేవంత్ రెడ్డి మరిన్ని ధైర్య సాహసాలు  ప్రదర్శిస్తారని, అక్టోబర్​లో విజృంభిస్తారని చెప్పారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని పీసీసీ చీఫ్ రేవంత్ ఆకాంక్షించారు. ముగ్గురు మహిళల (సోనియా, మీరా కుమార్, సుష్మా స్వరాజ్) సారథ్యంలో తెలంగాణ ఏర్పడిందని.. కానీ ఇప్పుడు రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. 80 లక్షల ఓట్లు సాధించి ఇందిరమ్మ, సోనియమ్మ రాజ్యం తెచ్చుకుందామని.. అందుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.