తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు

తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణకు ఓ వైపు ఉన్న మహారాష్ట్ర పరిధిలోని అరేబియా సముద్రంలో ఓ అల్పపీడనం ఏర్పడగా.. మరో వైపు ఏపీలోని బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రానికి అటూ ఇటూ రెండు అల్పపీడనాలతో వాతావరణ ఉక్కబోతగా ఉండటంతోపాటు రాబోయే మూడు, నాలుగు రోజులు మోస్తరు వర్షాలు పడనున్నట్లు ప్రకటించింది వాతావరణ శాఖ. 

దీనికితోడు నైరుతు రుతుపవనాల తిరోమనం.. మరో రెండు, మూడు రోజుల్లో ఈశాన్య రుతుపవనాలు రాకతో పగటి ఉష్ణోగ్రతల్లో  మార్పు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఓ వైపు ఈశాన్య రుతుపవనాల రాక.. ఇంకో వైపు అల్పపీడనాల ఎఫెక్ట్ తో.. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు, నాలుగు రోజులు మోస్తరు వర్షాలు పడతాయని వివరించింది వాతావరణ శాఖ. ఉరుములు, మెరుపులు కూడా ఉంటాయని.. వాతావరణంలో మార్పులు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. 

2024, అక్టోబర్ 15వ తేదీ.. మంగళవారం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 

ఇక అక్టోబర్ 16వ తేదీ బుధవారం తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వివరించింది.