
హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ పోలీసుల మధ్య డేటా వార్ వివాదం ముదురుతోంది. రెండు రాష్ట్రాలు పోటాపోటీగా తనిఖీలు చేస్తున్నాయి. మాదాపూర్ ఐటీ గ్రిడ్ ఆఫీస్ లో సైబరాబాద్ SOT పోలీస్ లు రెండో రోజు సోదాలు కొనసాగిస్తున్నారు. ఏపీకి చెందిన కీలకమైన సమాచారమంతా మాదాపూర్ లోని ఐటీ గ్రిడ్ ఆఫీస్ లో ఉందంటూ వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో దాడులు చేసిన సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ కంపెనీకి చెందిన భాస్కర్ అనే వ్యక్తితో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. 15కు పైగా హార్డ్ డిస్కులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 123, 379, 420, 188తో పాటు 66 B / 72 ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. . ఐటీ గ్రిడ్ కంపెనీ నిర్వాహకుడు మాత్రం అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే భాస్కర్ అనే తమ ఉద్యోగి కనిపించటం లేదంటూ ఐటీ గ్రిడ్ కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ పోలీసులు కూడా మాదాపూర్ కు చేరుకుని విచారణ జరుపుతున్నారు. ఐటి గ్రిడ్స్ పై ఫిర్యాదు చేసిన లోకేష్ రెడ్డిని ఏపీ పోలీసులు విచారిస్తున్నారు. కూకట్ పల్లిలోని ఫార్చ్యూన్ హోమ్స్ లో ఉంటున్న లోకేష్ రెడ్డి ఇంటికి ఉదయమే చేరుకున్నారు ఏపీ పోలీసులు.
మరోవైపు సైబరాబాద్ పోలీసుల సోదాలపై తెలంగాణ హైకోర్టులో హెబిఎస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు ఐటి గ్రిడ్ డైరెక్టర్ అశోక్. తమ ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రమ్ గౌడ్ కనిపించట్లేదని పిటిషన్ లో చెప్పారు.