మహిళల కోసం నియోజకవర్గానికో మినీ ఇండస్ట్రియల్ పార్క్ : శ్రీధర్‌‌‌‌ బాబు

మహిళల కోసం నియోజకవర్గానికో  మినీ ఇండస్ట్రియల్ పార్క్ : శ్రీధర్‌‌‌‌ బాబు
  • వాటిల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 10%  కేటాయింపు: శ్రీధర్‌‌‌‌ బాబు
  • త్వరలోనే పెండింగ్ బకాయిలు 300 కోట్లు విడుదల చేస్తామని మంత్రి వెల్లడి 
  • బడ్జెట్‌‌లో ఎస్సీ, ఎస్టీలకు 15% ఫండ్స్ కేటాయించాలి: వివేక్ వెంకటస్వామి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళల కోసం మినీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఆ పార్కుల్లో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 10% ప్రత్యేకంగా కేటాయిస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలు ఎదిగితేనే సమాజం అభివృద్ధి చెందుతుందని.. చేవెళ్ల డిక్లరేషన్‌‌లో దళితులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శుక్రవారం హైదరాబాద్ రెడ్‌‌ హిల్స్‌‌లోని ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌‌టీసీసీఐ) భవన్‌‌లో ‘రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎంఎస్ఎంఈ–2024: ఎ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ’ పేరుతో సమావేశం నిర్వహించారు. 

ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ఈ కాన్ఫరెన్స్‌‌కు శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. దళితుల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని అన్నారు. ‘‘2017 నుంచి సబ్సిడీల కింద పారిశ్రామికవేత్తలకు అందాల్సిన బకాయిలు రూ.4,500 కోట్లకు పైగా ఉన్నాయి. వీటిలో  రూ.2,200 కోట్లు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకే రావాలి. మేం అధికారంలోకి రాగానే ఈ బకాయిల చెల్లింపుపై దృష్టిసారించాం. త్వరలోనే రూ.300 కోట్లు చెల్లిస్తాం” అని వెల్లడించారు. 

దళిత పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటం.. 

దేశంలో ఎక్కువ మంది కార్మికులు ఎంఎస్ఎంఈ రంగంలోనే ఉపాధి పొందుతున్నారని..  కానీ ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా పాలసీ అంటూ ఏదీ లేదని శ్రీధర్ బాబు అన్నారు. ‘‘రాహుల్‌‌గాంధీ సూచనల మేరకు మేం పాలసీ తీసుకొచ్చాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోరిక మేరకు.. వాళ్లకు మరింత ప్రయోజనం చేకూరేలా పాలసీ  గైడ్‌‌లైన్స్ తయారు చేస్తాం. ప్రొక్యూర్‌‌‌‌మెంట్, కాంట్రాక్టుల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం కల్పించేందుకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటాం. 

పరిశ్రమల స్థాపనలో, బ్యాంక్ రుణాలు పొందడంలో వాళ్లకు ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తాం. వచ్చే నెల మొదటి వారంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, పారిశ్రామికవేత్తలు, అధికారులతో కూడిన ప్రత్యేక బృందం తమిళనాడు, కర్నాటకలో పర్యటించనుంది. అక్కడి ప్రభుత్వాలు దళిత పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలపై అధ్యయనం చేస్తుంది” అని తెలిపారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం తెచ్చిన టీప్రైడ్ పథకం కింద 15 వేల మందికి పైగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఇప్పటికీ సబ్సీడీలు అందలేదు. దళితబంధు పథకం కూడా ఫెయిల్యూర్‌‌‌‌గా మిగిలిపోయింది” అని అన్నారు. ఈ సమావేశంలో విప్‌‌లు అడ్లూరి లక్ష్మణ్, రాంచంద్రు నాయక్, ఎమ్మెల్యేలు వినోద్, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, నాగరాజు, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

దళితులు ఎదిగేందుకు కృషి చేయాలి: వివేక్ 

దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం కృషి చేయాలని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కోరారు. వచ్చే బడ్జెట్‌‌లో ఎస్సీ, ఎస్టీలకు 14 నుంచి 15 శాతం నిధులు కేటాయించాలని మంత్రి శ్రీధర్‌‌‌‌ బాబుకు విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను ఓపిగ్గా విన్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ‘‘ప్రొక్యూర్మెంట్ పాలసీలో దళితులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయనే దానిపై ఆయా శాఖల అధికారులకు అవగాహన ఉండాలి. దీనిపై ప్రతి రెండు నెలలకోసారి రివ్యూ మీటింగ్ పెట్టాలి” అని కోరారు.