హైదరాబాద్: తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. 8 నెలల్లో 145 అవినీతి, లంచం కేసులు నమోదు చేసి 109 మంది అవినీతిపరులను అరెస్ట్ చేసింది. ఇందులో 30 మంది రెవిన్యూ శాఖకు చెందిన వ్యక్తులు కాగా, 21 మంది హోం శాఖ, 18 మంది మున్సిపల్ శాఖకు చెందిన లంచగొడి, అవినీతిపరులు కావడం గమనార్హం. జనవరి 2024 నుంచి ఆగస్ట్ 2024 మధ్యలో 100 అవినీతి కేసులు రిజిస్టర్ అయినట్లు ఏసీబీ మాజీ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ తెలిపారు. గడచిన 8 నెలల్లో 109 మంది అవినీతిపరుల ఆట కట్టించినట్లు ఆయన వెల్లడించారు.
ALSO READ| పార్టీ మారిన ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టండి
నాలుగేళ్లలో 100 అవినీతి కేసులు నమోదు కాగా.. ఈ 8 నెలల్లోనే 145 కేసులు ఏసీబీ నమోదు చేసినట్లు తెలిపారు. పౌరులకు అవినీతి నిరోధక శాఖపై నమ్మకం పెరిగిందని, అందువల్లే ధైర్యంగా ముందుకొచ్చి ఏసీబీని ఆశ్రయిస్తున్నారని హైదరాబాద్ కమిషనర్గా సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్ చెప్పారు. అవినీతిపరులపై ఫిర్యాదులు ఇటీవల పెద్ద ఎత్తున పెరగడంతో అవినీతి నిరోధక శాఖకు సిబ్బంది అవసరం ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.