- హైదరాబాద్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ పెడ్లర్ అరెస్ట్
- పంజాగుట్టలో డ్రగ్స్ సేల్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రూ.8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
- గోవా, ముంబై నుంచి సిటీకి డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న నిందితుడు
- సిటీలో 20 మందికి పైగా కస్టమర్లతో లింక్స్
హైదరాబాద్, వెలుగు : సిటీలో డ్రగ్స్ కస్టమర్లకు కొకైన్,హెరాయిన్ సప్లయ్ చేస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్ పెడ్లర్ ను యాంటీ నార్కొటిక్స్ బ్యూరో(టీఎస్ న్యాబ్)సోమవారం అరెస్ట్ చేసింది. నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ వద్ద 557 గ్రాముల కొకైన్, 21 గ్రాముల హెరాయిన్, 215 గ్రాముల చరస్, 902 ఎక్సటీసీ పిల్స్, 105 ఎల్ఎస్డీ బ్లాట్స్, 235 గ్రాముల గంజాయి,7 గ్రాముల యాంఫేటమిన్
8 సెల్ఫోన్స్, రూ.5.40 లక్షల క్యాష్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ మొత్తం విలువ రూ.8 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. గోవా, ముంబై నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ చేస్తున్న నైజీరియన్ నెట్ వర్క్ వివరాలను టీఎస్ న్యాబ్ ఎస్పీ రఘువీర్ తో కలిసి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ మంగళవారం వెల్లడించారు.
బిజినెస్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందాలోకి..
నైజీరియాకు చెందిన ఇవుల ఉడోక స్టాన్లీ(43) బిజినెస్ వీసాపై 2009 నవంబర్ ఇండియాకు వచ్చాడు. ముంబై అంధేరీలో షెల్టర్ తీసుకున్నా డు. స్థానికంగా ఉండే జెవెల్ అనే మరో నైజీరియన్ తో కలిసి రెడీమేడ్ క్లాత్స్, క్రాఫ్ట్ బిజినెస్ చేసేవాడు. టూరిస్ట్ స్పాట్ గోవాలో నైజీరియన్స్ ఎక్కువగా ఉండడంతో 2011లో అక్కుడకు మకాం మార్చాడు. పాస్ పోర్ట్ లేకపోగా 2012లో మపుస పోలీసులు అరెస్ట్ చేశారు.
జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత స్థానికంగా ఉండే రాజస్థాన్ కు చెందిన మహిళ ఉషా ఛందల్ ను 2014లో పెండ్లి చేసుకున్నాడు. వీరు గ్రోసరి షాప్ పెట్టారు. అప్పటికే గోవాలో డ్రగ్స్ సప్లయ్ చేసే ఇద్దరు నైజీరియన్స్ స్టాన్లీ షాప్ కు వస్తుండే వారు. కొవిడ్ కారణంగా స్టాన్లీ గ్రోసరి షాప్ మూతబడింది. దీంతో స్టాన్లీకి పరిచయం ఉన్న ఇద్దరు నైజీరియన్స్ డ్రగ్స్ సప్లయ్ని ఆఫర్ చేశారు.
డ్రగ్స్ డెలివరీ చేస్తూ కస్టమర్లు, డీలర్స్ నెట్వర్క్
స్టాన్లీ డ్రగ్స్ డెలివరీ చేసేవాడు. గ్రాముకు రూ.2 వేలు కమీషన్ ఇచ్చేవారు. స్టాన్లీకి కూడా డ్రగ్స్ సప్లయర్స్, కస్టమర్లతో చైన్ ఏర్పడింది. ట్యాక్సీ డ్రైవర్లకు కమీషన్ ఇస్తూ స్టాన్లీ డ్రగ్స్ డెలివరీ చేసేవాడు. 2017లో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కాడు. జైలులో మరో నైజీరియన్ డ్రగ్స్ సప్లయర్ పరిచయం అయ్యాడు. పుణె నుంచి కొరియర్స్ ద్వారా డ్రగ్స్ సప్లయ్ చేయడం తెలుసుకున్నాడు.
జైలు నుంచి రిలీజ్ అయ్యాక మళ్లీ డ్రగ్స్ సప్లయ్ ప్రారంభించాడు. ముంబై, గోవాలోని నైజీరియన్స్ నుంచి కిలోల కొద్ది కొకైన్, హెరాయిన్ సహా డిమాండ్ ఉన్న డ్రగ్స్ ను కొనుగోలు చేసేవాడు. డ్రగ్స్ కొనుగోలు, సేల్స్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తం ముంబైలోని క్లాత్స్ వ్యాపారస్తుల ద్వారా నిర్వహించేవాడు. 500లకు పైగా డ్రగ్స్ కస్టమర్లతో నెట్వర్క్ఏర్పాటు చేసుకున్నాడు. ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా కొరియర్లో డ్రగ్స్ పార్సిల్ చేస్తుండేవాడు.
నెల రోజులు సెర్చ్ ఆపరేషన్
స్టాన్లీకి సిటీలో 20 మందికి పైగా రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారు. ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో గతేడాది నమోదైన డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ బ్యూరో అధికారులు దర్యాప్తు చేశారు. ఆ కేసులో అరెస్ట్ అయిన హనుమంత్బాబు అనే నిందితుడిని విచారించారు. గోవాలో షెల్టర్ తీసుకుంటున్న స్టాన్లీ ద్వారా డ్రగ్స్ సప్లయ్ జరుగుతున్నట్లు గుర్తించారు. పోలీసులు గోవాకు వెళ్లి నెల రోజులు నిఘా పెట్టారు. స్టాన్లీ కదలికలను గమనించారు.
ALSO READ : నిజామాబాద్లో కలకలం రేపుతున్న పిల్లల కిడ్నాప్
డ్రగ్స్ సప్లయ్ చేసేందుకు సిటీకి వస్తున్నట్లు గుర్తించారు. పంజాగుట్ట పీఎస్ పరిధిలో అతడిని అరెస్ట్ చేసి అరకిలో కొకైన్ సహా మొత్తం రూ.8కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్ చేశారు. సిటీలోని కస్టమర్ల వివరాలను అధికారులు రాబడుతున్నారు. స్టాన్లీతో రెగ్యులర్ గా కాంటాక్ట్ తో ఉన్న ఏడుగురిని గుర్తించారు. వారికి నోటీసులు ఇచ్చి విచారించనున్నారు.