- ఓయూకు దాన కిశోర్.. జేఎన్టీయూకు బుర్రా వెంకటేశం
- జూన్ 15 వరకే ఇన్చార్జ్ వీసీల కాలపరిమితి
- ఆలోపే కొత్త వీసీలను నియమించేలా ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని పది ప్రభుత్వ యూనివర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలను సర్కారు నియమించింది. సీనియర్ ఐఏఎస్లకు బాధ్యతలు అప్పగించింది. ఉస్మానియా, జేఎన్టీయూ సహా 10 వర్సిటీల వీసీల పదవీ కాలం మంగళవారంతో ముగియడంతో సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇన్చార్జ్ వీసీల పదవీకాలం జూన్ 15 వరకే ఉంటుందని తెలిపింది. ఆలోపే కొత్త వీసీల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం జీవోలు రిలీజ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి దానకిశోర్, జేఎన్టీయూకు బుర్రా వెంకటేశంను ప్రభుత్వం నియమించింది. కాకతీయ వర్సిటీకి వాకాటి కరుణ, తెలంగాణ వర్సిటీకి సందీప్ కుమార్ సుల్తానియా, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి రిజ్వీ, తెలుగు యూనివర్సిటీకి శైలజ రామయ్యర్, పాలమూరు వర్సిటీకి నదీమ్ అహ్మద్, శాతవాహన వర్సిటీకి సురేంద్రమోహన్, మహాత్మాగాంధీ వర్సిటీకి నవీన్ మిట్టల్, జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీకి జయేశ్ రంజన్ తదితరులకు వీసీగా బాధ్యతలు అప్పగించింది.
(మొదటి పేజీ తరువాయి)
తెలంగాణ యూనివర్సిటీకి ఇప్పటికే బుర్రా వెంకటేశం ఇన్చార్జ్గా ఉండగా, ఆ స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాను నియమించారు. పది వర్సిటీలకు గత సర్కారు 2021లో నియమించగా, వారి మూడేండ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఇన్చార్జ్లను నియమించొద్దనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం జనవరిలోనే వీసీల నియామకానికి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అయితే, లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో రిక్రూట్మెంట్ప్రక్రియ ఆలస్యమైంది. పోలింగ్ పూర్తికావడంతో వీసీల నియామకానికి ఎన్నికల కమిషన్ అనుమతించింది. దీంతో ప్రభుత్వం 9 వర్సిటీలకు సెర్చ్ కమిటీలను ప్రకటించింది. అప్పటికే వీసీల పదవీకాలం ముగియడంతో అనివార్యంగా ఇన్చార్జ్లను నియమించాల్సి వచ్చింది.
అవగాహన ఉన్న వాళ్లకే..
విద్యాశాఖపై కొంత అవగాహన ఉన్నవారినే ప్రభు త్వం వీసీలుగా నియమించింది. నవీన్ మిట్టల్, వాకాటి కరుణ, సందీప్ కుమార్ సుల్తానియా విద్యా శాఖలో బాధ్యతలు నిర్వహించారు. మిగిలిన పలువురు ఐఏఎస్లు కూడా గతంలో ఇన్చార్జ్లుగా వ్యవహరించారు. అయితే, ఒకదశలో ప్రస్తుతమున్న వీసీలకే ఇన్చార్జ్ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ, పలువురు వీసీలపై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఐఏఎస్ల వైపే సర్కారు మొగ్గుచూపింది. ఇప్పటికే కాకతీయ వర్సిటీ మినహా మిగిలిన 9 వర్సిటీలకు కొత్త వీసీల నియామకానికి సెర్చ్ కమిటీలు కూడా పూర్తయ్యాయి. రెండు, మూడు రోజుల్లో ఈ కమిటీలు భేటీ కానున్నట్టు తెలు స్తోంది. ఇప్పటికే యూజీసీ నామినీల సమయం కోసం విద్యాశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది ఏమైనా జూన్ 2లోపే కొత్త వీసీలను నియమించాలని సర్కారు భావిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నది.