ఎస్సీ వర్గీకరణ  వన్ మెన్ కమిషన్ వర్క్ షురూ

  • ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని లేఖలు
  • వచ్చే నెల 4 నుంచి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్
  • జనవరి 10 వరకు రిపోర్ట్ ఇచ్చేందుకు గడువు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన వన్ మెన్ జ్యుడీషియల్ కమిషన్ వర్క్ షురూ చేసింది. ఈ నెల 11న బీఆర్కే భవన్ లో కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల వర్గీకరణపై ఎస్సీ నేతలు, సంఘాలు, మేధావులు, పార్టీలు, నేతలు తమ అభిప్రాయాలను కమిషన్ కు అఫిడవిట్ల రూపంలో అందజేయాలని నోటిఫికేషన్ ఇచ్చారు.

ఈ నోటిఫికేషన్ ను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోని నోటీస్ బోర్డ్ లో డిస్ ప్లే చేయాలని కలెక్టర్లను కమిషన్ చైర్మన్ ఆదేశించారు. బుధవారం వరకు 15 వినతిపత్రాలు కమిషన్ కు అందాయని అధికారులు చెబుతున్నారు. వచ్చే నెల 14 వరకు గడువు ఇచ్చారు. దీంతో పాటు వచ్చే నెల 4 నుంచి జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ చేపట్టాలని  చైర్మన్ నిర్ణయించారు. త్వరలో షెడ్యూల్ రిలీజ్ చేయనున్నారు. 

జనవరి 10 వరకు గడువు..

సామాజిక, ఆర్థిక వెనుకబాటు, ప్రభుత్వ ఉద్యోగాలు, చదువులలో రిజర్వేషన్లు పొందిన వారిని గుర్తించి సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా కమిషన్ ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది.  బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 60 రోజుల్లో వర్గీకరణపై నివేదిక ఇవ్వాలని కమిషన్ ను ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఎస్సీ కోటా కింద లబ్ధి పొందిన వారు తిరిగి వారి పిల్లలు, వాళ్ల పిల్లలు లబ్ధి పొందుతున్నారని కిందిస్థాయి వర్గాలకు రాజ్యాంగ ఫలాలు అందడం లేదని ఎస్సీల్లో కొన్ని వర్గాల ప్రజలు గత కొన్నేండ్లుగా అభిప్రాయపడుతున్నారన్నారు.

దీని ఆధారంగా ఎక్కువ రిజర్వేషన్లు అనుభవించిన కులాలను గుర్తించేందుకు అవకాశం ఉంటుందని, వర్గీకరణ సులభమవుతుందన్నారు. అందుబాటులో ఉన్న సమకాలీన డేటా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన డేటా, జనాభా గణనను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలలోని సజాతీయ ఉప-కులాల హేతుబద్ధమైన ఉప-వర్గీకరణ, రాష్ట్రంలోని ఎస్సీలలోని వివిధ ఉప సమూహాలలో వెనుకబాటుతనాన్ని గుర్తించడానికి, వినతిపత్రాలను,  అధ్యయనాలను కమిషన్ పరిశీలిస్తుంది.ఎస్సీ వర్గీకరణ కోసం 2011 జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకోనున్నట్టు  వర్గీకరణపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.

ఉద్యోగుల  వివరాలివ్వాలని లేఖలు 

రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, పోలీస్, యూనివర్సిటీలు, జ్యుడీషియల్ లో 2000 ఏడాది నుంచి రిక్రూట్ అయిన, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని ఇటీవల చైర్మన్ షమీమ్ అక్తర్ లేఖ  రాశారు. వచ్చే నెల 15 వరకు ఇందుకు గడువు విధించారు. ఏ క్యాడర్ లో జాయిన్ అయ్యారు? ఏ క్యాడర్ లో పనిచేస్తున్నారు? ఎస్సీల్లో  ఏ కేటగిరీలకు చెందిన వాళ్లు? ఇలాంటి  సమగ్ర వివరాలు అందజేయాలని లేఖలో స్పష్టం చేశారు. ఈ వివరాల ప్రకారం ఏ కేటగిరీ వారు ఎక్కువ ఉద్యోగాలు పొందారు? ఎవరికి అన్యాయం జరిగింది? అన్న అంశాలపై స్పష్టత వస్తుందని కమిషన్ చైర్మన్ భావిస్తున్నారు.