9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు

9 యూనివర్సిటీలకు కొత్త వీసీలు
  • గవర్నర్ ఆమోదంతో నియామకం
  • ఓయూకు మొలుగరం కుమార్.. కేయూకు ప్రతాప్ రెడ్డి
  • పాలమూరు వర్సిటీకి శ్రీనివాస్.. ఎంజీ వర్సిటీకి అల్తాఫ్​
  • శాతవాహనకు ఉమేశ్ కుమార్.. తెలుగు వర్సిటీకి నిత్యానందరావు
  • అగ్రి వర్సిటీకి అల్దాస్ జానయ్య.. హార్టికల్చర్ ​వర్సిటీకి రాజిరెడ్డి 
  • తెలంగాణ వర్సిటీకి యాదగిరిరావు నియామకం
  • మూడేండ్ల పాటు పదవిలో కొనసాగనున్న కొత్త వీసీలు


హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని మరో తొమ్మిది యూనివర్సిటీలకు కొత్త వీసీలు వచ్చేశారు. సెర్చ్ కమిటీలు ప్రతిపాదించిన పేర్లలోంచి ఒక్కరిని ఎంపిక చేస్తూ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్లను ప్రకటించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ మొలుగరం కుమార్, కాకతీయ వర్సిటీ వీసీగా ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, పాలమూరు వర్సిటీ వీసీగా జీఎన్ శ్రీనివాస్, శాతవాహన వర్సిటీ వీసీగా ఉమేశ్ కుమార్, తెలుగు యూనివర్సిటీ వీసీగా నిత్యానందరావు, మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా అల్తాఫ్ హుస్సేన్, తెలంగాణ వర్సిటీ వీసీగా యాదగిరిరావు, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ వర్సిటీ వీసీగా అల్దాస్ జానయ్య, శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ వర్సిటీ వీసీగా రాజిరెడ్డి పేర్లను ప్రకటించారు. ఈ ఏడాది మే నెలాఖరులో వీసీల కాలపరిమితి ముగిసింది. ఆయా వర్సిటీల వీసీల నియామకం కోసం ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ నెల మొదటివారంలో సెక్రటేరియెట్​లో సెర్చ్ కమిటీ సమావేశాలు జరిగాయి. దీంట్లో ఒక్కోవర్సిటీకి ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ గవర్నర్​కు పంపించారు. శుక్రవారం గవర్నర్​ వీసీల పేర్లను వెల్లడించారు. కాగా, ఇప్పటికే సెర్చ్ కమిటీ పూర్తయిన జేఎన్టీయూతో పాటు ఇంకా సెర్చ్ కమిటీ సమావేశాలు జరగని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్ లాల్ నెహ్రు ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీల నియామకం పెండింగ్​లో ఉంది. కాగా, మూడు రోజుల క్రితం బాసర ట్రిపుల్ ఐటీ, ఉమెన్స్ వర్సిటీలకు కొత్తగా ఇన్​చార్జ్ వీసీలను నియమించింది. కొత్తగా వచ్చిన వీసీలంతా మూడేండ్ల పాటు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

ముగ్గురు బీసీలు

రాష్ట్ర ప్రభుత్వం కొత్త వీసీల నియామకంలో  బీసీలకు ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పటివరకూ 11 వర్సిటీలకు వీసీల పేర్లను ప్రకటించగా, దాంట్లో ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. దీంట్లో ఒకరు గౌడ్ సామాజిక వర్గానికి చెందిన వారుకాగా, యాదవులు ఇద్దరున్నారు.  ఓసీలు నలుగురు ఉండగా.. ఇద్దరు రెడ్డి, ఒకరు బ్రాహ్మాణ,  ఇంకొకరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారు. ఎస్సీ కేటగిరిలో ఇద్దరు, మైనార్టీల్లో ఒకరు, ఎస్టీ కేటగిరిలో ఒకరు ఉన్నారు. గత ప్రభుత్వం 10 వర్సిటీల్లో 6 వీసీ పోస్టులు ఓసీలకే కట్టబెట్టింది. మాదిగ సామాజిక వర్గానికి మొండిచేయి చూపింది. ప్రస్తుత ప్రభుత్వం మాదిగ సామాజిక వర్గం నుంచి ఇద్దరు వీసీలతో పాటు ఒకరిని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్ చైర్మన్​గా నియమించింది. ఓయూ వీసీ పోస్ట్ ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వడం మాత్రం ఇదే తొలిసారి.

ప్రొఫెసర్ మొలుగరం కుమార్‌‌..

రంగారెడ్డి జిల్లా ఘట్‌‌కేసర్‌‌ మండలం కొండాపురం గ్రామానికి చెందిన ఎం.కుమార్ ఉస్మానియా వర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ఓయూలో బీటెక్‌‌, జేఎన్‌‌టీయూలో ఎంటెక్‌‌, ఐఐటీ బాంబే నుంచి పీహెచ్‌‌డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం రీజినల్ సెంటర్‌‌ ఫర్‌‌ అర్బన్‌‌, ఎన్విరాన్‌‌మెంటల్‌‌ స్టడీస్‌‌ డైరెక్టర్‌‌గా పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ గా, ఓయూ ఎగ్జామినేషన్ కంట్రోలర్ తో పాటు పలు విభాగాల్లో పనిచేశారు. 2018లో బెస్ట్ టీచర్ అవార్డును, ఇంజినీర్​ ఆఫ్ ది ఇయర్‌‌ అవార్డును అందుకున్నారు.

ప్రొఫెసర్ అల్దాస్‌‌ జానయ్య..

నల్లగొండ జిల్లా, తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీగా నియమితులయ్యారు. అగ్రికల్చర్ ఎకనామిక్స్ లో బనారస్ హిందూ వర్సిటీ నుంచి డాక్టరేట్‌‌ అందుకున్నారు. జగిత్యాల వ్యవసాయ కాలేజీ అసోసియేట్ డీన్‌‌గా సేవలు అందిస్తున్నారు. 2002లో ఆయన అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ నుంచి ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్నారు.

ప్రొఫెసర్  రాజిరెడ్డి..

కొండా లక్ష్మణ్‌‌ హార్టికల్చర్‌‌ యూనివర్సిటీ వీసీగా దండ రాజిరెడ్డి నియమితులయ్యారు. అగ్రికల్చర్‌‌లో బీఎస్సీ, ఎంఎస్సీ పూర్తి చేశారు. గుజరాత్‌‌ అగ్రికల్చర్‌‌ వర్సిటీలో అగ్రోమెటియోరాలజీలో పీహెచ్‌‌డీ పూర్తిచేశారు. అఫ్గానిస్తాన్‌‌ అగ్రోమెట్‌‌ సర్వీసెస్‌‌ ప్రాజెక్టుకు వరల్డ్‌‌ బ్యాంకు కన్సల్టెంటుగా కొంతకాలం పనిచేశారు. చాలా రోజులు జయశంకర్‌‌ అగ్రికల్చర్‌‌ వర్సిటీ డైరెక్టర్‌‌గా బాధ్యతలు నిర్వహించారు.

ప్రొఫెసర్ నిత్యానందరావు 

నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా మంగనూరు గ్రామానికి చెందిన వెలుదండ నిత్యానందరావు తెలుగు యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. పాలెం ఓరియంటల్‌‌ కాలేజీలో డిగ్రీ, ఓయూలో ఎంఏ తెలుగు, ఎంఫిల్‌‌, పీహెచ్‌‌డీ పూర్తి చేశారు. ఉస్మానియా వర్సిటీ తెలుగు విభాగంలో అసిస్టెంట్‌‌ ప్రొఫెసర్‌‌గా, అదే శాఖ హెచ్‌‌వోడీగా పనిచేశారు. 2022లో పదవీ విరమణ చేశారు.

టి.యాదగిరిరావు..

వరంగల్‌‌ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరి రావును తెలంగాణ యూనివర్సిటీ వీసీగా ప్రభుత్వం నియమించింది. కాకతీయ వర్సిటీలో పీజీ, పీహెచ్‌‌డీ పూర్తిచేశారు.  ఇప్పుడు అదే వర్సిటీలో సీనియర్‌‌ ప్రొఫెసర్‌‌గా, పబ్లిక్‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌ బీవోఎస్‌‌ చైర్‌‌పర్సన్‌‌గా పనిచేస్తున్నారు. 2021లో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు అందుకున్నారు. తెలంగాణ వర్సిటీ సోషల్‌‌ సైన్సెస్‌‌ డీన్‌‌గా కూడా పనిచేశారు. 

ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్.. 

సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన జీఎన్ శ్రీనివాస్ పాలమూరు యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. ఓయూలో బీటెక్‌‌, ఎంటెక్‌‌, పీహెచ్‌‌డీ పూర్తిచేశారు. ఓయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్​ గా చేరారు. 2003లో ఏపీలోని అనంతపురం జేఎన్టీయూలో అసోసియేట్ ప్రొఫెసర్‌‌గా సేవలందించారు. వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చిన శ్రీనివాస్‌‌.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశారు. 

అల్తాఫ్‌‌ హుస్సేన్‌ ‌: 

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన ఖాజా అల్తాఫ్ హుస్సేన్  మహాత్మాగాంధీ యూనివర్సిటీ వీసీగా ప్రభుత్వం నియమించింది. ఆత్మకూరులోని ప్రభుత్వ పాఠశాలలో టెన్త్ వరకూ, వరంగల్‌‌ సీకేఎం కాలేజీలో ఇంటర్‌‌, డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఫిజిక్స్‌‌లో పీజీ, పీహెచ్‌‌డీ పూర్తిచేశారు. ‍కేయూ ఫిజిక్స్‌‌ విభాగంలో ప్రొఫెసర్‌‌గా, హెచ్‌‌వోడీగా, రిజిస్ర్టార్‌‌గా సేవలందించారు. బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2016-– 19 వరకు మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా పనిచేశారు.

 ప్రొఫెసర్ ప్రతాప్‌‌రెడ్డి..

రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన ప్రతాప్ రెడ్డి కాకతీయ యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు.  ఓయూలో పీజీ, పీహెచ్‌‌డీ పూర్తి చేసిన ఆయన.. ఓయూలో జువాలజీ విభాగం హెచ్‌‌వోడీగా, రిజిస్ట్రార్‌‌గా, పీజీ అడ్మిషన్స్‌‌ డైరెక్టర్‌‌గా సేవలందించి రిటైర్‌‌ అయ్యారు. 

ఉమేశ్‌‌ కుమార్‌‌..

మహబూబ్‌‌నగర్‌‌ జిల్లా నారాయణపేట గ్రామానికి చెందిన ఉమేశ్ కుమార్ శాతవాహన యూనివర్సిటీ వీసీగా నియమితులయ్యారు. గతంలో మహాత్మాగాంధీ వర్సిటీ వీసీగా, రిజిస్ట్రార్‌‌గా పనిచేశారు. ఇందిరా గాంధీ జాతీయ స్థాయి ఎన్ఎస్ఎస్ ట్రోఫీని 2015లో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.