
- ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇన్బేసిన్ అవసరాలకే నీళ్లివ్వాలి
- తెలంగాణలో లిఫ్ట్ స్కీములన్నీ ఒకప్పటి గ్రావిటీ ప్రాజెక్టులే
- తుంగభద్ర, అప్పర్ కృష్ణ, భీమా నదుల ఆధారంగా
- హైదరాబాద్ స్టేట్‌లో చేపట్టాలనుకున్నరు
- ఏపీతో కలిశాక ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం వాటన్నింటినీ పక్కనపడేసింది
- గోదావరి నీళ్లనూ ఏపీ ఔట్‌సైడ్ బేసిన్‌కు తరలిస్తున్నది
- కృష్ణా ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదనలు
హైదరాబాద్, వెలుగు : కృష్ణా జలాలను ఏపీ అడ్డదారిలో ఔట్ సైడ్ బేసిన్‌కు తరలించుకుపోతున్నదని కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ 2 (కేడబ్ల్యూడీటీ 2/బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్) ముందు తెలంగాణ వాదించింది. కృష్ణా బేసిన్‌లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతుంటే.. ఏపీ మాత్రం విచ్చలవిడిగా ఔట్‌సైడ్ బేసిన్‌కు ఏటా 323 టీఎంసీలను తరలించుకుపోతున్నదని తెలిపింది.
అవసరం ఉన్న వారికి నీటిని ఇవ్వాలిగానీ.. అవసరం తీరి దురాశతో ఎదురుచూసే వారికి కాదని పేర్కొంది. వర్షాకాలంలోనూ తెలంగాణ రైతులు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. ఏపీ మాత్రం యథేచ్ఛగా కృష్ణా పరివాహకంలోనే లేని ప్రాంతాలకు నీటిని తరలించుకెళ్లిపోతున్నదని ఆక్షేపించింది.
హెల్సింకి రూల్స్, బెర్లిన్ రూల్స్, ఐక్యారాజ్యసమితి వాటర్‌కోర్స్ కన్వెన్షన్ ప్రకారం.. క్యాచ్మెంట్ ఏరియా ఎక్కువున్న ప్రాంతాలు, ఇన్బేసిన్ ప్రాంతాలకే నీటి తరలింపులో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. కృష్ణా జల వివాదాలపై బుధవారం ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రజేశ్ కుమార్, జస్టిస్ రామ్మోహన్ రెడ్డి, జస్టిస్ ఎస్.తాళపత్ర తో కూడిన బెంచ్ ముందు వాదనలు మొదలయ్యాయి. శుక్రవారం దాకా వాదనలు కొనసాగనున్నాయి.
తెలంగాణ తరఫున అడ్వకేట్ సి.ఎస్.వైద్యనాథన్ వాదనలు వినిపించారు. సరఫరా కన్నా డిమాండ్ ఎక్కువున్నప్పుడు ఏపీ విచ్చలవిడి నీటి వినియోగానికి అడ్డుకట్ట వేయాలని ట్రిబ్యునల్‌ను కోరారు.
ఇప్పటి లిఫ్టులు.. ఒకప్పటి గ్రావిటీ ప్రాజెక్టులు
రాష్ట్రంలో ఇప్పటికే నిర్మించిన.. ప్రస్తుతం నిర్మిస్తున్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులున్నీ ఒకప్పుడు హైదరాబాద్ స్టేట్‌లో గ్రావిటీ ప్రాజెక్టులుగా చేపట్టాలనుకున్నవేనని వైద్యనాథన్ తెలిపారు. తుంగభద్ర డ్యామ్, తుంగభద్ర నది, అప్పర్ కృష్ణా ప్రాజెక్ట్ కెనాల్స్, భీమా ప్రాజెక్టుల ఆధారంగా ఆయా ప్రాజెక్టులను చేపట్టాలని భావించారన్నారు. అయితే, హైదరాబాద్ స్టేట్.. ఏపీ కలిపాక ఉమ్మడి రాష్ట్రంలోని ఏపీ సర్కారు ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లకుండా ఆపేసిందని గుర్తు చేశారు. ‘‘ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల కింద తెలంగాణకు కేటాయించిన నీళ్లలో వాడుతున్నది చాలా తక్కువే.
ప్రస్తుతం నిర్మిస్తున్న ప్రాజెక్టుల నీటి కేటాయింపులతో కృష్ణా బేసిన్‌లోని 80 లక్షల మందికి జీవనాధారం లభిస్తుంది. కానీ, 1956లో ఉమ్మడి ఏపీలో ఏకపక్షంగా, పక్షపాత ధోరణితో నాటి పాలకులు వ్యవహరించారు. నీళ్లు, ఉద్యోగాలు, ఆర్థికాంశాల్లో తెలంగాణకు అన్యాయం చేశారు. నదీ జలాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. అంతర్రాష్ట్ర నదులకు సంబంధించి రాష్ట్రాలకు సమానంగా వాటాలు ఇవ్వాలని జాతీయ, అంతర్జాతీయ నదీ జలాల సూత్రాలు చెబుతున్నాయి. కానీ, తెలంగాణ విషయంలో అందుకు విరుద్ధంగా జరిగింది’’ అని పేర్కొన్నారు.
గోదావరి నీళ్లనూ మళ్లిస్తున్నరు
కృష్ణా నీళ్లు సరిపోవన్నట్టు గోదావరి నీళ్లనూ ఔట్ సైడ్ బేసిన్‌కు ఏపీ మళ్లించుకుపోతున్నదని వైద్యనాథన్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీలు, పట్టిసీమ లిఫ్ట్ ద్వారా 100 టీఎంసీలు, చింతలపూడి లిఫ్ట్ ద్వారా 27 టీఎంసీల నీటిని మళ్లిస్తున్నదన్నారు. ఏపీ తరలిస్తున్న ఆ గోదావరి జలాలకు సమానంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు అదనపు కేటాయింపులు చేయాలన్నారు.
కృష్ణా నదీ జలాల్లో పెన్నా బేసిన్‌కు 75 శాతం డిపెండబిలిటీతో 98 టీఎంసీలు, యావరేజ్ డిపెండబిలిటీలో 195 టీఎంసీలను తరలిస్తున్నదని చెప్పారు. కృష్ణాలో డ్రైన్ల ద్వారా కృష్ణా డెల్టాకు 75 టీఎంసీల నీటి లభ్యత ఉంటున్నదని, అందులో కొంత భాగం తెలంగాణకు కేటాయించాలన్నారు. ఏపీ క్యాపిటల్ రీజియన్ అభివృద్ధితో కృష్ణా డెల్టా సిస్టమ్‌లో కొంత ఆయకట్టు తగ్గిందని, ఆ మేరకు ఏపీలో నీటి వాడకం కూడా తగ్గిందని, ఆ జలాలను తెలంగాణకు ఇవ్వాలని కోరారు.