తెలంగాణ సాయుధ పోరాట నాయకురాలు, స్వాతంత్ర్య సమర యోధురాలు ఆరుట్ల కమలాదేవి. ఆమె ఉన్నత ఆశయాలు కలిగిన కమ్యూనిస్టు ధీరవనిత. నిజాం పాలనను అంతమొందించుటకు జరిగిన పోరాటంలో నిస్వార్థంగా అంకితభావంతో పోరాటం చేసిన వీర వనిత. ఆరుట్ల కమలాదేవి యాదాద్రి జిల్లా, ఆలేరు మండలం, మంతపురి గ్రామంలో పుట్టింది. తల్లిదండ్రులు ఆమెకు రుక్మిణి అని పేరు పెట్టారు. మధ్యతరగతి రైతు కుటుంబం వారిది. నిజాం పాలనలో పౌర హక్కులకు స్వేచ్ఛలేని కాలం, మూఢవిశ్వాసాలు, కులం, మతతత్వం, అంటరానితనం వ్యవస్థని శాసిస్తున్న రోజులవి. పల్లెటూర్లలో పాఠశాలలు ఉండేవి కావు. విద్యాభ్యాసం ఊహించడం కూడా తప్పే. అటువంటి కాలంలో భర్త రామచంద్ర రెడ్డి కమలాదేవిని చదివించాలని అనుకున్నాడు. మాడపాటి హనుమంతరావు నెలకొల్పిన బాలికల పాఠశాలలో కమలాదేవి చేరింది. అక్కడే బాలికల హాస్టల్ లో ఆమె ప్రథమ విద్యార్థిగా ప్రవేశించింది. పట్టుదలతో చదివి మెట్రిక్ పూర్తి చేసింది. విద్యతోపాటు రాజకీయాలు అర్థం చేసుకుని మహిళా ఉద్యమాలలో క్రియాశీలకంగా పాల్గొనేది.
రైతులపై పెత్తందార్ల దౌర్జన్యం
తెలంగాణలో బ్రిటిష్ సామ్రాజ్యవాదుల ఆలోచనల ప్రకారం నిజాం పాలన సాగేది. సంస్థానాధీశులు, దేశ్‌ముఖ్ లు లక్షల ఎకరాల భూమిని తాము అధీనంలో ఉంచుకునేవారు. భూస్వాములు, గ్రామీణ పెత్తందార్ల దౌర్జన్యంతో గ్రామ ప్రజలు, రైతులు ఎన్నో కష్టాలుపడేవారు. అన్ని కులాలవారు అణచివేతకు గురయ్యేవారు. వెట్టిచాకిరి పేరుతో ప్రతిఫలం లేకుండా భూస్వాములు ఇండ్లలో పని చేయాల్సివచ్చేది. తెలుగు భాషలో చదువుకునే అవకాశాలు లేవు. పాఠశాలలు, గ్రంథాలయాలు స్థాపనకు అడ్డంకులు ఉండేవి. ఇట్లాంటి గోసను కమలాదేవి సహించలేకపోయింది. వంటశాల పేరుతో తలుపులు, కిటికీలూ లేని స్థలంలో విద్యార్థులను పోగుచేసి కమలాదేవి బడిని, గ్రంథాలయాన్ని నడిపింది. తెలంగాణలో ప్రజోద్యమం సందర్భంలో స్త్రీలకు ఆత్మ రక్షణ అవసరమని భావించింది కమలాదేవి. మహిళా ఆత్మ రక్షణ శిబిరంలో సైనిక శిక్షణ పొందింది. భర్తతోపాటు తెలంగాణ సాయుధ సమరంలో అడుగుపెట్టింది. పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నది. చల్లూరు గుట్టలో జరిగిన చారిత్రాత్మక పోరాటంలో ఆపరకాళీ వలె విజృంభించింది. పోరాటంలో కమలాదేవి అనారోగ్యానికి గురయ్యింది. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా నిజాం పోలీసులు కమలాదేవిని అరెస్టు చేశారు.
హక్కుల కోసం పోరాటం
వరంగల్, ఔరంగాబాద్, సికింద్రాబాద్‌లో జైలుశిక్షను అనుభవించింది. జైళ్లలోనూ హక్కుల కోసం పోరాడిన ధీశాలి. భూస్వాముల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన విప్లవ యోధురాలు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఎగిసిన అగ్నిజ్వాల. 1952 మొదటి సాధారణ ఎన్నికల్లో ఆలేరు నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీతో శాసనసభకు ఎన్నికయింది. స్వతంత్ర భారతదేశంలోని రాష్ట్రంలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకురాలుగా చరిత్ర సృష్టించింది. ప్రజల దైనందిన సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ లోపల, బయట క్రియాశీలకంగా పోరాడింది. కమలాదేవిని 1998లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. మహిళలు, పేదవర్గాలు కష్టాల నుంచి శాశ్వత విముక్తిని సాధించేవరకు చిత్తశుద్ధితో అలుపెరగని కృషి చేసిన వ్యక్తిత్వం ఆమెది. తెలుగు మహిళలకు వెలుగు బాట చూపిన గొప్ప మానవతావాది కమలాదేవి జనవరి 1వ తేది 2001న ఈలోకం విడిచింది. ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని కమలాదేవికి నివాళి అర్పిద్దాం.
- దేవులపల్లి రమేశ్,
సిద్దిపేట జిల్లా