దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇంకా చిన్నచితకా రాజ్యాలు, రాజులు పరిపాలిస్తున్న సంస్థానాలు 500కు పైగా ఉన్నాయి. వాటిలో నిజాం పరిపాలిస్తున్న హైదరాబాద్ రాజ్యం అతిపెద్దది. ఈ రాజ్యంలో భాగంగా ఉన్న తెలంగాణ గ్రామాలన్నీ జమీందారులు, జాగీర్దారుల గుప్పిట్లో ఉన్నాయి. వీరి మీద ఆధారపడే నిజాం రాజు పరిపాలన సాగింది. ఈ భూస్వాములే రైతుల మీద తీవ్ర నిర్బంధం సాగించారు. అందువల్ల రైతాంగం ఆర్థికంగా చితికి పోయేవారు. అప్పుల పాలై కుటుంబాలకు కుటుంబాలే భూస్వాములకు వెట్టిచాకిరి చేయవలసిన దుస్థితి ఉండేది.
సాయుధ పోరాట ఫలితాలు
భూస్వాముల పీడనను తట్టుకోలేకనే తెలంగాణ రైతాంగం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాయుధ పోరాటం చేసింది. ఈ పోరాటం వల్లనే రాచరికం, నిజాం పాలన అంతమైనాయి. హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనం కాక తప్పలేదు. అంతేకాదు, ఈ పోరాట కాలంలో కమ్యూనిస్టులు పేదలకు 10లక్షల ఎకరాల భూమి పంచారు. 3000గ్రామాలలో గ్రామ రాజ్యాలు స్థాపించారు. భూమి సమస్య జాతీయస్థాయిలో ఎజెండా మీదకు వచ్చింది. నెహ్రూ ప్రభుత్వం రక్షిత కౌలుదారి చట్టం చేసింది. భూసంస్కరణలు తామే అమలు జరుపుతామని ప్రకటించింది. ఫలితంగా 1951అక్టోబరులో సాయుధ పోరాట విరమణ జరిగింది. ఈ మహత్తర పోరాట ప్రభావంతోనే అనేక సంస్థానాలు భారతదేశంలో స్వచ్ఛందంగా విలీనానికి అంగీకరించాయి.
కుల, మతాల అతీత పోరాటం
భూస్వాములు అత్యధికులు హిందువులు, రాజు ముస్లిం. వీరిద్దరూ పరస్పరం సహకరించుకోవడం ద్వారానే తెలంగాణ రైతాంగాన్ని వృత్తిదారులను దోచుకున్నారు. ప్రజలను పీడించడానికి, వారి శ్రమను దోచుకోవడానికి మతం అడ్డు రాలేదు. భూస్వామి మీద కేసు వేసిన బందగిని భూస్వామి హత్య చేయించాడు. భూస్వామికి సహకరించింది ముస్లిం రాజు. ఇక్కడ మతప్రమేయం లేదు. నిజాం నిరంకుశత్వాన్ని దునుమాడిన పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ రజాకర్ మూకల చేతిలో బలి అయ్యాడు. నిజాం రాచరికాన్ని అంతమొందించి సమసమాజాన్ని నిర్మించాలన్న లక్ష్యంతో హైదరాబాదు నడిబొడ్డున కామ్రేడ్స్ అసోసియేషన్ ప్రారంభించిన వారు ఆలం కుందుమిరి, జవాద్ రజ్వి, మక్దుం మొహియిద్దీన్, రాజ బహదూర్ గౌడ్. బాగ్‌లింగంపల్లి నుంచి పబ్లిక్ గార్డెన్ వరకు నిజాం పోలీసులను ఎదుర్కొని తరుముతూ ముందుకు సాగిన సమరశీల కార్మిక వర్గ పోరాట నాయకులు మగ్దుం మొహియిద్దీన్, అలీ అక్తర్ లాంటివారు ముస్లింలే. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం సాగిన రైతాంగ పోరాటానికి మతం రంగు పులమటం దుస్సాహసం.
ALSO READ: ఆరు గ్యారెంటీలను ప్రకటిస్తం .. అధికారంలోకి వచ్చిన నెలలోనే అమలు చేస్తం: రేవంత్
వేలాది రైతాంగం బలి
1948 సెప్టెంబర్ 13న ఇండియన్ యూనియన్ సైన్యాలను హైదరాబాద్ సంస్థానం మీదకు పంపారు. అప్పటికే జబ్బలు జారేసిన నిజాం రాజు యూనియన్ సైన్యాలతో పెద్దగా ప్రతిఘటించనే లేదు. ఐదవ రోజునే చేతులెత్తేసి భారతదేశంలో విలీనానికి అంగీకరించాడు. యూనియన్ సైన్యాలు రాచరిక ప్రభుత్వాన్ని అంతం చేయడం కోసమే వచ్చాయని తెలంగాణ రైతాంగం నమ్మింది. స్వాగతం పలికింది. నిజాం పాలనలో 1500 మంది రైతులు బలయ్యారు. కానీ యూనియన్ సైన్యాల చేతుల్లో 2500 మంది బలయ్యారు . ఏ నిజాం రాజుకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడుతున్నారో ఆ రాజునే మళ్లీ రాజ ప్రముఖ్ పేరుతో నెహ్రూ, పటేల్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దింది. రాజభరణం పరిహారంగా చెల్లించారు. నరహంతకుడు ఖాసిం రజ్వీని శిక్షించకుండా, సకల సౌకర్యాలతో విమానంలో పాకిస్తాన్‌కు పంపించారు.
ఖద్దరు స్వామ్యం
రైతాంగం తిరుగుబాటుతో భయపడి హైదరాబాద్ పారిపోయిన భూస్వాములు ఇప్పుడు ఖద్దరు బట్టలు, తెల్ల టోపీలతో గ్రామాలకు చేరుకొని రైతులు సాగు చేసుకుంటున్న భూములను మళ్లీ గుంజుకునేందుకు ప్రయత్నించారు. యూనియన్ సైన్యాల అసలు ఉద్దేశం ప్రజలకు అప్పుడు అర్థమయింది. తాము పోరాడి సాధించుకున్న భూములను కాపాడుకునేందుకు సాయుధ పోరాటం కొనసాగించవలసి వచ్చింది. నిజానికి స్వాతంత్రోద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ ఇండియాలో మాత్రమే పోరాటాలు చేసింది. సంస్థానాల్లో పోరాటాలు చేయవద్దని నిర్ణయించింది. అందుకే ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వంలోనే పోరాటం సాగింది.
ఐలమ్మ పేరు వాడుతున్న భూస్వామ్య బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐలమ్మ పేరు వాడుకుంటున్నది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజును జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించటం మంచిదే. మతం పేరుతో బీజేపీ పెడుతున్న చిచ్చు జాతీయ సమగ్రతకు ముప్పు. ఐలమ్మ పేరును టీఆర్‌ఎస్ వాడుకుంటున్నది. కానీ ఐలమ్మ భూస్వామికి వ్యతిరేకంగా పోరాడింది. టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం భూస్వాములకే అండగా నిలుస్తున్నది. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలు అంటే భరించలేకపోతున్నది. అసైన్డ్ భూములు గుంజుకుంటున్నది. ఇది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడమే కదా. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమికోసం సాగింది. నాటి లక్ష్యాలు ఇంకా పూర్తి కావలసి ఉన్నది. ఎర్రజెండా వెలుగులోనే ఆ సమస్యలకు పరిష్కారం. అందుకే కమ్యూనిస్టు పార్టీలు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు. ఈ చరిత్రకు మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నది బీజేపీ. రైతాంగ పోరాట చరిత్రకు కూడా మతం రంగు పులుముతున్నది. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
‑ ఎస్ వీరయ్య, సీపీఎం స్టేట్ సెక్రటేరియట్ మెంబర్