
- వారి సంక్షేమానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాలి : కె.ఐలన్న
- తెలంగాణ కళాకారుల వేదిక డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర సాధనలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమ కవులు, కళాకారులను ఆదుకోవాలని తెలంగాణ కళాకారుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కె.ఐలన్న డిమాండ్ చేశారు. కళాకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ మోహన్ బైరాగి అధ్యక్షతన కవులు, కళాకారుల రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
ఈ సందర్భంగా ఐలన్న మాట్లాడుతూ.. ప్రజల ఆవేదనను తమ గుండెల్లో నింపుకొని ప్రపంచానికి పాటై, నాట్యమై కళాకారులు చాటి చెప్పారని తెలిపారు. అలాంటి వారికి ప్రభుత్వం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రూ. వెయ్యి కోట్ల బడ్జెట్ను కేటాయించాలన్నారు. 55 ఏండ్లు నిండిన వృద్ధ కళాకారులకు ఆర్థిక భరోసా కింద నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నలిగంటి శరత్, స్కైలాబ్ బాబు, ప్రపుల్ రాంరెడ్డి, కవిత పాల్గొన్నారు.