- 200 టీఎంసీలకు తోడు మరో
- 200 టీఎంసీలు తోడేసేందుకు కుట్రలు
- 2016 నాటి ‘పోలవరం టు సోమశిల డైవర్షన్’కు రీడిజైన్
- అందులో భాగంగానే రెండు ఫేజుల్లో గోదావరి–బనకచర్ల,
- గోదావరి–సోమశిల ప్రాజెక్టుల నిర్మాణం
- రెండింటికీ కామన్ రిజర్వాయర్‌గా బొల్లాపల్లి.. తొలి దశలో
- బనకచర్ల లింక్ ద్వారా 150 టీఎంసీల కెపాసిటీతో రిజర్వాయర్
- రెండో దశలో సోమశిల లింక్ ద్వారా 300 టీఎంసీలకు పెంచే యోచన
హైదరాబాద్, వెలుగు: గోదావరి జలాల మళ్లింపుపై ఏపీ మరో కుట్రకు తెరలేపింది. ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ కెపాసిటీని పెంచి అక్కడి నుంచి బనకచర్లకు నీటిని తీసుకెళ్లేలా ‘గోదావరి–బనకచర్ల’ లింక్‌ను చేపట్టేందుకు సిద్ధమైన పక్క రాష్ట్రం.. దానికి సమాంతరంగా పోలవరం నుంచే సోమశిలకు నీటిని డైవర్ట్ చేసేందుకు పావులు కదుపుతున్నది. ఈ రెండు డైవర్షన్లకు కామన్ రిజర్వాయర్‌గా బొల్లాపల్లిని వాడుకోవాలని చూస్తున్నది. మొత్తంగా గోదావరి–బనకచర్ల లింక్ ద్వారా 200 టీఎంసీలు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న ఏపీ.. గోదావరి–సోమశిల లింక్ ద్వారా అదనంగా మరో 200 టీఎంసీల జలదోపిడీకి సిద్ధమవుతున్నది.ఒక్క గోదావరి నుంచే కాకుండా.. కృష్ణా నుంచి కూడా నీటిని ఎత్తుకుపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నది.
బొల్లాపల్లి రిజర్వాయర్ కెపాసిటీ పెంపు
పోలవరం నుంచి నీటిని డైవర్ట్ చేసేందుకు రెడీ అవుతున్న ఏపీ.. కుడి, ఎడమ కాల్వల మాదిరిగా గోదావరి బనకచర్ల, గోదావరి సోమశిల ప్రాజెక్టులను చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. రెండు దశల్లో ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయనున్నట్లు సమాచారం. తొలి దశలో భాగంగా ఇప్పటికే గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందులో భాగంగా పోలవరం నుంచి నాగార్జునసాగర్ రైట్ కెనాల్ వరకు వివిధ దశల్లో నీటిని ఎత్తిపోయనుంది. నాగార్జునసాగర్‌కుడి కాల్వ 80వ కిలోమీటర్ వద్ద వెడల్పు చేసి ఓ చిన్నపాటి రిజర్వాయర్‌గా మార్చి అక్కడికి పోలవరం నీటిని తరలించనుంది. అక్కడికి నీటిని ఎత్తిపోశాక.. కింద బొల్లాపల్లి వద్ద 150 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి నీటిని తరలించనుంది.
బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి సొరంగం, లిఫ్ట్‌ల ద్వారా బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు రోజూ 2 టీఎంసీల చొప్పున 200 టీఎంసీలను తరలించేందుకు ప్లాన్లు రెడీ చేసుకుంది. ఇక, మొదటి దశ పూర్తయ్యే టైమ్‌లోనే రెండో దశ కింద ‘గోదావరి సోమశిల’ డైవర్షన్‌ను చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండో దశలోనూ రోజుకు 2 టీఎంసీల చొప్పున మరో 200 టీఎంసీలను సోమశిల రిజర్వాయర్‌కు తరలించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. రెండో దశ ప్రాజెక్టుకు కూడా కామన్ రిజర్వాయర్‌గా బొల్లాపల్లిని వాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ దశలో బొల్లాపల్లి రిజర్వాయర్ కెపాసిటీని 150 టీఎంసీల నుంచి 300 టీఎంసీలకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా ఇటు బనకచర్లకు, అటు సోమశిలకు మొత్తంగా 400 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలు పన్నుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ పాత ప్రాజెక్టునే రీడిజైన్!
పోలవరం టు సోమశిల ప్రాజెక్టుకు గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలోనే ప్రణాళికలు రెడీ చేశారు. పోలవరం నుంచి సోమశిలకు 350 టీఎంసీల గోదావరి నీళ్లను మళ్లించేందుకు ప్లాన్ చేశారు. రెండేండ్లపాటు దానిపై వర్కౌట్జరిగింది. అయితే, నాడు మన రాష్ట్ర అధికారులు జీఆర్ఎంబీలో వాదనలు వినిపించడంతో ఏపీ వెనుకడుగు వేసింది. 2018లో ప్రాజెక్టును పక్కకుపెట్టింది. ఆ తర్వాత ఎన్నికలు రావడం.. అధికార మార్పిడి జరగడంతో దానిపై మళ్లీ చర్చ జరగలేదు. తాజాగా మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో.. ఆ పాత ప్రాజెక్టునే ముంగటేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఆ పోలవరం–సోమశిల డైవర్షన్ ప్రాజెక్టునే ఇప్పుడు రీడిజైన్ చేసి రెండు దశల్లో చేపట్టేలా ‘గోదావరి బనకచర్ల’, ‘గోదావరి సోమశిల’ లింకులను చేపడ్తున్నట్టు తెలుస్తున్నది.
ఇప్పటికే నిరుడు నవంబర్‌లో జరిగిన ఓ రివ్యూ మీటింగ్‌లో దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. గోదావరి బనకచర్ల, గోదావరి సోమశిల లింక్ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. బొల్లాపల్లి రిజర్వాయర్‌కు గోదావరి నీటిని తరలించడంతోపాటు అందుబాటులో ఉన్న కృష్ణా నీటి తరలింపుపైనా ఆలోచన చేయాలని ఆ రివ్యూలో ఏపీ ఇరిగేషన్ అధికారులకు చంద్రబాబు సూచించారు. గోదావరిలో వరదను నమ్ముకునే బదులు.. కృష్ణా నదికి వస్తున్న వరదల ఆధారంగా ఆ నీటినే బొల్లాపల్లి రిజర్వాయర్‌కు తరలించే అంశంపై ఆలోచన చేయాలని అధికారులకు చెప్పారు.
అవసరమైతే ఇటు గోదావరి, అటు కృష్ణా నీటినీ వాడుకునే వెసులుబాటును చూడాలన్నారు. ఆ రివ్యూ తర్వాత వెంటనే గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సమగ్ర స్వరూపం తీసుకొచ్చారు. రూ. 80 వేల కోట్ల ఖర్చుతో చేపట్టనున్న ఆ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా కేంద్రానికి కూడా లేఖలు రాశారు. అంతేగాకుండా ఇటీవల సోమశిల డ్యామ్‌నూ ఆయన పరిశీలించి వచ్చారు. కండలేరుకు నీటిని తరలించే కాలువ కెపాసిటీలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఇవన్నీ పోలవరం నుంచి సోమశిలకు నీటిని డైవర్ట్ చేసేందుకు వేస్తున్న ఎత్తుగడల్లో భాగమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రం అభ్యంతరాలు
గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. గోదావరి జలాల్లో అందుబాటులో ఉన్నవి 1486 టీఎంసీలేనని పేర్కొంది. అందులో 968 టీఎంసీలు తెలంగాణకు కేటాయించగా.. 518 టీఎంసీలు ఏపీకి ఇచ్చారని గుర్తుచేసింది. మిగులు జలాలకు సంబంధించి ఇప్పటి వరకు లెక్క తేల్చలేదని, అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ప్రాజెక్టులను ఎలా చేపడతారని ఆక్షేపించింది. మిగులు జలాల వాటాలు తేలనప్పుడు కొత్తగా లింక్ ప్రాజెక్టులను చేపట్టడం ఏంటని వాదించింది.
2016లో ఏపీ నిర్మించ తలపెట్టిన పోలవరం- సోమశిల ప్రాజెక్టు విషయాన్ని కూడా లేఖలో అధికారులు ప్రస్తావించారు. ఆ ప్రాజెక్టుకే ఇప్పుడు రీడిజైన్ చేస్తున్నట్టుగా ఉందని పేర్కొన్నారు. వెంటనే ఆ ప్రాజెక్టును ఆపాలని లేఖల్లో కోరారు. మరోవైపు ఇప్పటికే కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సాయం చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖకు, టెక్నికల్ అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర జలశక్తి శాఖకు ఆయన రెండు లేఖలు రాశారు.