కొత్త పార్లమెంటు భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలనే తీర్మానాన్ని శాసన సభలో మంత్రి కేటీఆర్ ప్రవేశపెట్టారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని ఆయన వెల్లడించారు. మహాత్మా గాంధీకి ఏ మాత్రం తగ్గని మహానుభావుడు అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంటు భవనానికి పెట్టడం సముచితంగా ఉంటుందన్నారు. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని సాధించకుండా .. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించలేమని 1949లోనే అంబేద్కర్ చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
‘చట్టాలు చేసే ముందు.. సంస్కరణలు చేసే ముందు భారత సమాజాన్ని అర్థం చేసుకోండి’ అని చెప్పిన మహానుభావుడు అంబేద్కర్ అని కొనియాడారు. ‘లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ’తో సమాజం విలసిల్లాలని ప్రవచించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అన్నారు. ‘‘అంబేద్కర్ మార్గదర్శకత్వంలో టీఆర్ఎస్ పనిచేస్తుంది. ‘బోధించు.. సమీకరించు.. పోరాడు’ అనే అంబేద్కర్ తత్వాన్ని ఆచరణలో చూపిన ఆదర్శ నాయకుడు కేసీఆర్’’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర శాసనసభ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంటులో సాధారణ మెజారిటీతో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయొచ్చని తెలిపే ఆర్టికల్ 3ను రాజ్యాంగంలో పొందుపరిచిన అంబేద్కర్ కు తెలంగాణ జాతి యావత్తు రుణపడి ఉంటుందన్నారు. మరోవైపు ఇదే అంశంపై శాసన మండలిలోనూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.